మృతిచెందిన తండ్రీ, కొడుకులు
సంగారెడ్డి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీకుమారుడు మృతిచెందిన సంఘటన హత్నూర మండలం తురకల ఖానాపూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సాధులనగర్‌కు చెందిన చెక్కల ప్రభు(46) కుమారుడు నాగరాజు (23) ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం తుర్కల్ ఖానాపూర్ శివారులోని ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లారు.
చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కొడుకు నాగరాజుకు వల చుట్టుకొని మునిగిపోతుండడంతో గమనించిన తండ్రి కొడుకును కాపాడుకోవాలనే తపనతో నీటిలోకి దిగాడు. ఈక్రమంలో ఇద్దరూ మృత్యుఒడిలోకి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లగా మృతదేహాలు నీటిలో తేలాయి. దీంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న హత్నూర ఎస్సై సుభాశ్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే సునీతారెడ్డి
బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీత అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్ భాస్కర్‌గౌడ్, నాయకులు ఉన్నారు.
ఇవి చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా..
Comments
Please login to add a commentAdd a comment