Telangana Crime News: కలిసి తిరిగిండు.. కత్తితో పొడిచిండు..
Sakshi News home page

కలిసి తిరిగిండు.. కత్తితో పొడిచిండు..

Aug 15 2023 12:24 AM | Updated on Aug 15 2023 10:09 AM

- - Sakshi

కరీంనగర్‌: వారిద్దరూ స్నేహితులు.. నిత్యం కలిసే తిరిగేవారు.. ఉన్నట్టుండీ ఏమైందో గానీ.. వీరిలో ఒకరు తన మిత్రుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కొత్తపల్లి ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ శివారు రేకుర్తి విజయపురికాలనీకి చెందిన మావురం నాగరాజు(38) ఓ సినిమా హాల్‌లో, అతని భార్య చంద్రకళ శాతవాహన యూనివర్సిటీలో స్వీపర్‌గా పని చేస్తున్నారు.

నాగరాజు, ఇదే ప్రాంతానికి చెందిన మేక అజయ్‌ మంచి స్నేహితులు. నిత్యం కలిసే తిరుగుతూ మద్యం తాగేవారు. సోమవారం ఉదయం 11 గంటలకు స్థానికుడైన మారంపల్లి వినోద్‌ నాగరాజు ఇంటికి వచ్చాడు. స్థానిక బెల్టు షాపులో మద్యం కొనుగోలు చేసి, అతన్ని అజయ్‌ ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత నాగరాజు, అజయ్‌ల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. అజయ్‌ కత్తితో నాగరాజు గొంతులో పొడిచాడు. స్థానికులు గమనించి, బాధితుడిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

తన భర్తను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే గొంతులో కత్తితో పొడిచాడని, ఇందుకు మేక రాజశేఖర్‌, కిరణ్‌, లక్ష్మి, మారంపెల్లి వినోద్‌లు సహకరించారని మృతుడి భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా నిందితుడు అజయ్‌ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement