మధ్యేమార్గం..! | Krishna river water board suggests compromise formula to Andhra, Telangana | Sakshi
Sakshi News home page

మధ్యేమార్గం..!

Published Thu, Oct 30 2014 1:52 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM

జలసౌధ కార్యాలయంలో కృషా ్ణనదీ జలాల బోర్డు చైర్మన్  ఎస్‌కేజీ పండిట్, సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా - Sakshi

జలసౌధ కార్యాలయంలో కృషా ్ణనదీ జలాల బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిట్, సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచన

 
 సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి నీటి వినియోగ అంశంపై  మధ్యేమార్గంలో వెళ్లాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సూచించింది. బుధవారమిక్కడ జలసౌధలో జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో ఈ మేరకు హితవు పలికింది. అయితే ఈ వివాదాన్ని మరింత జటిలం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. శ్రీశైలం కేంద్రంలో విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలంటూ ఇప్పటివరకు వాదించిన ఏపీ సర్కారు.. కేసీ కెనాల్ సాగునీటి అవసరాల కోసం కనీస నీటిమట్టాన్ని మరికొంత పెంచాలంటూ కృష్ణా బోర్డు ముందు పంచాయతీ పెట్టింది. నిబంధనల ప్రకారం 834 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే హక్కు తమకుందంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గట్టి వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బోర్డు సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కనీస నీటిమట్టాన్ని పెంచాలని ఏపీ సర్కారు కోరగా... ఇది తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రగా రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే ఉన్న జీవోలు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని, ఏపీ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని పేర్కొన్నాయి. నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గురువారం పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. వర్కింగ్ గ్రూప్‌గా పేర్కొనే ఈ భేటీకి బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్, బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
 మేట పెరుగుతోంది.. ఎత్తు పెంచాలి
 
 శ్రీశైలం, సాగర్ జలాల అంశాన్ని అధికారులు మొదట ప్రస్తావించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టాలను సమీక్షించారు. గతంలో జారీ అయిన 69, 107, 233 జీవోలపై చర్చ జరిగింది. జీవో 107 ప్రకారం కనీస మట్టాన్ని 854 అడుగులుగా గుర్తించాలని ఏపీ వాదించింది. శ్రీశైలం దిగువన ప్రధాన కాల్వగా ఉన్న కేసీ కెనాల్‌లో 3 మీటర్ల మేర మేట వేసిందని, దీంతో నీటి ప్రవాహాలకు ఇబ్బందిగా ఉందని వివరించింది. ఈ దృష్ట్యా శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగుల నుంచి మరింత పెంచాలని కోరింది. ఎంత పెంచాలన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై తెలంగాణ అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది. 69, 107 జీవోలను తెలంగాణ ఉల్లంఘిస్తోందన్న ఏపీ వాదన సరికాదని, నిజానికి తర్వాత తెచ్చిన సవరణ జీవో 233 ప్రకారం పోతిరెడ్డిపాడు నీటి అవసరాలు తీరాక 834 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చునని వారు వాదించారు. పోతిరెడ్డిపాడు అవసరాలకు ఇప్పటికే నీటిని తరలించుకుపోయినందున తమకు 834 అడుగుల వరకు విద్యుదుత్పత్తి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ పంపకాలకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 53కు చట్టబద్ధత లేదంటే, ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన 69, 107 జీవోలకూ చట్టబద్ధత ఉండదని తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 67 టీఎంసీల మేర నీటిని ఏపీ తరలించుకుపోయిందని, వాస్తవానికి ఆ రాష్ర్టం వాటా 34 టీఎంసీలేనని నొక్కి చెప్పారు.
 
 రోజుకో టీఎంసీ చొప్పున...
 
 కాగా, నిబంధనల మేరకు 834 అడుగుల వరకు నీటిని వినియోగించుకుంటామన్న తెలంగాణ వినతికి బోర్డు అభ్యంతరం తెలిపింది. వర్షాకాల సీజన్ పూర్తికాకముందే శ్రీశైలంలో కనీస నీటి మట్టం వరకు నీటిని వాడుకుంటే భ విష్యత్తులో సాగునీటి కొరతతో పాటు, విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశమున్న దృష్ట్యా నీటి వినియోగంపై మధ్యేమార్గం అవలంబించాలని సూచించింది. శ్రీశైలంలో నవంబర్ 2 వరకు రోజుకో టీఎంసీ చొప్పున 3 టీఎంసీల నీటిని వాడుకొని విద్యుదుత్పత్తి చేసుకోవాలని పేర్కొంది. దీనివల్ల నీటి మట్టం కనీస స్థాయికి పడిపోదని, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపింది. ఎస్‌ఆర్‌బీసీ తాగునీటి కష్టాలు కూడా తీరుతాయని పేర్కొంది. మూడు నాలుగు రోజుల అనంతరం శ్రీశైలంలో నిలిపివేసి, సాగర్‌లో విద్యుదుత్పత్తిని ప్రాంభించాలని సూచించింది. ఈ ఉత్పత్తి సైతం కష్ణా డెల్టాకు అవసరమైన రీతిలో సాగితే ఏపీకి సాగునీరు, తెలంగాణకు విద్యుత్ అందుతుందనే ప్రతిపాదనను తెచ్చింది. అయితే దీనిపై అధికారుల స్థాయిలో నిర్ణయం చెప్పలేమని, ప్రభుత్వంతో మాట్లాడి తమ వైఖరి చెబుతామని తెలంగాణ వర్గాలు స్పష్టం చే శాయి.
 
 మేం వాడుతోంది మా లెక్కలోకే..
 
 శ్రీశైలం కింద తమకున్న నీటి లెక్కలను గణాంకాలతో సహా తెలంగాణ సర్కారు వివరించింది. శ్రీశైలంలో మొత్తంగా 97 టీఎంసీల నీటి వాటా ఉండగా.. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ కింద తెలంగాణ వాడుకున్నది కేవలం 16.8 టీఎంసీలు మాత్రమేనని వెల్లడించింది. ఇక మొత్తం కృష్ణా జలాల్లో నికర జలాల కేటాయింపు 184.9 టీఎంసీలు కాగా, ఇందులో ప్రస్తుత సీజన్‌లో 109.3 టీఎంసీలు వాడుకున్నామని, ఇంకా 75.67 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని పేర్కొంది. మిగులు జలాల్లోనూ 77 టీఎంసీలకు గాను ఇప్పటికి 22 టీఎంసీలు వాడుకోగా.. మరో 53 టీఎంసీలు తమకు దక్కుతాయని కృష్ణా బోర్డుకు తెలిపింది. తమకు ఉన్న కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నామని, ప్రస్తుతం వాడుతున్న నీటిని తమ ఖాతాలో చేర్చినా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
 
 అసలు బోర్డు పరిధి ఏంటి?
 
  బోర్డు పరిధి ఏంటన్న దానిపైనా కొద్దిసేపు చర్చ జరిగినట్లు తెలిసింది. కేవలం సాగునీటి ప్రాజెక్టులు మాత్రమే బోర్డు పరిధిలోకి వస్తాయని, అక్కడి నుంచి విద్యుదుత్పత్తి అంశం రాదని కొందరు లేవనెత్తినట్లుగా తెలిసింది. విద్యుత్ విషయం కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి అంశమని, దీనిపై ఉండే వివాదాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ), రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకే వస్తాయని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. నదీ జలాల బోర్డుకు దీంతో సంబంధమే లేదని ఈ భేటీ అనంతరం పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement