ఏపీది వితండవాదం: హరీశ్
న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. నీటి పంపిణీపై బుధవారం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు భేటీ స్పష్టత లేకుండానే ముగిసింది. సమావేశం అనంతరం తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ వితండవాదం చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రాల అనుమతితోనే నదులను అనుసంధానం చేయాలన్నారు.
నాగార్జున సాగర్ కుడి కాల్వ నిర్వహణ తమకే ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేస్తోందని హరీశ్ అన్నారు. కృష్ణాబోర్డు కేవలం నీటి పంపిణీ చేస్తుందని మాత్రమే చట్టంలో ఉందని, ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చర్చల పేరుతో రెండు రోజుల సమయాన్ని ఏపీ సర్కార్ వృధా చేసిందన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏపీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాల పంపిణీపై ఇప్పటికీ స్పష్టత రాలేదని, రేపు ఉదయం మరోసారి సమావేశం కానున్నట్లు హరీశ్ రావు తెలిపారు.
'రాష్ట్రాల సమ్మతితోనే నదుల అనుసంధానం జరుగుతందని కేంద్రమంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. అనుసంధానం కోసం గోదావరి నదిపై రెండు, మూడు పాయింట్లు అనుకున్నారు. కానీ ఇప్పటికి చాలా మార్పులు, చేర్పులు జరిగాయి. పై రాష్ట్రాలు చాలావరకూ ప్రాజెక్టులు కట్టాయి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జలాలు అవసరం. ఆ తర్వాత కూడా నీటి లభ్యత ఉంటే ...నదుల అనుసంధానానికి అభ్యంతరం లేదు. కేంద్ర జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ నేతృత్వంలో రెండు రాష్ట్రాల మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అసమగ్రంగా, అస్పష్టంగా ముగిసింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకూడదన్నదే మా అభిప్రాయం.
రెండేళ్లుగా కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలను అమలు చేస్తున్నాం. శ్రీశైలం నిర్వహణ ఏపీకి, నాగార్జున సాగర్ నిర్వహణ తెలంగాణకు తాత్కాలికంగా అప్పగించారు. అయినా కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలనే అమలు చేస్తున్నారు. బోర్డు కేవలం రెగ్యులేట్ మాత్రమే చేస్తుందని పునర్విభజన చట్టం పేర్కొంది. ఇప్పటివరకూ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం పంపకాలు జరగలేదు. పంపకాల విషయం పెండింగ్లో ఉన్నప్పుడు కృష్ణా రివర్ బోర్డు ఎలా పని చేయగలదు. కాని ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ విచిత్ర వైఖరి ప్రదర్శిస్తోంది.
ఏపీకి మూడు పంటలకు నీరు కావాలి, మాకు ఒక పంటకు కూడా వద్దా?.గోదావరిలో మాకు 90 టీఎంసీల హక్కు ఉంది. కేంద్రం మాకు ఇప్పటికీ అన్యాయం చేస్తూనే ఉంది. మాకు కర్ణాటక, మహారాష్ట్రతో సత్ సంబంధాలున్నాయి. అయినా... కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలనే అమలు చేస్తున్నారు.' అని ఆయన మండిపడ్డారు.