చెరువుకట్ట మీద చినబాబును నిలదీసిన మహిళలు
టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్ నారా లోకేశ్ బాబు మహిళల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో వందలసార్లు చెప్పి.. మ్యానిఫెస్టోలో కూడా వాగ్ధానం చేసి రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీని ఎప్పుడు చేస్తారంటూ చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన మహిళలు చినబాబును నిలదీశారు. ఈ రోజు మద్యహ్నం పుంగనూరు నియోజకవర్గంలోకి అడుపెట్టిన ఆయనను వందల సంఖ్యలో గుమ్మిగూడిన మహిళలు పున్నమ్మ చెరువు కట్ట వద్ద అడ్డుకుని నిరసన తెలిపారు.
దీంతో అసహనానికి గురైన లోకేశ్.. 'కుక్కలు మోరుగుతూనే ఉంటాయి.. మేం చేసేపనులు చేస్తూనే ఉంటాం..' అంటూ ఆగ్రహం వెళ్లగక్కి ముందుకు కదిలే ప్రయత్నం చేశారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక్క ఓటు పడదని మహిళలు అన్నారు. అనంతరం మద్దనపల్లె గ్రామానికి చేరుకున్న లోకేశ్.. దివంగత టీడీపీ కార్యకర్త నారాయణస్వామి కుటుంబ సభ్యులకు పరిహారానికి సంబంధించిన చెక్కును అందజేశారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం నుంచి యాత్ర ప్రారంభించిన లోకేశ్ కు అడుగడుగునా ఇలాంటి నిరసనలే ఎదురవుతున్నాయి. ఉదయం కుప్పం నియోజవర్గంలోనూ లోకేశ్ బాబును రైతులు నిలదీశారు.