లక్కీ ఛాన్స్
సాక్షి ప్రతినిధి,కడప: ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డిని అదృష్టం వరించనుంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కనుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పులివెందుల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా సతీష్‌రెడ్డి మూడు పర్యాయాలు పోటీచేసి ఓటమి చెందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చే శారు. వైఎస్సార్ జిల్లాకు ప్రాధాన్యత కల్పిస్తే తనకే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అయితే ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కారణంగా అప్పట్లో పదవికి దూరం కావాల్సి వచ్చిందని పరిశీలకుల అభిప్రాయం.
అందివచ్చిన అవకాశం...
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ చైతన్యరాజు పేరు ముందుగా తె రపైకి వచ్చింది. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన చైతన్యరాజును డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఆయనకు పోటీగా ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజును పోటీ చేయించేందుకు సన్నద్ధం అయ్యారు.
రాజకీయ సమీకరణల నేపధ్యంలో టీడీపీ నుంచి ఎన్నికైన అభ్యర్థిని రంగంలోకి దింపితే తాము పోటీలో ఉండమనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాయి. దీంతో అనూహ్యంగా ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ లేకుండా పోయింది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఫలించిన చిరకాలవాంఛ...
ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి చిరకాలవాంఛ ఫలించింది. వేంపల్లె నాగిరెడ్డి మనువడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన ఆయన మూడు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేశారు. ఓటమి తప్పదని తెలిసి కూడాపోటీ చేయడం వెనుక వైఎస్ కుటుంబంపై రాజకీయంగా తలపడ్డ వ్యక్తిగా గుర్తింపు దక్కుతుందని ఆశించారు. అందులో భాగంగా టీడీపీ అధికారంలోకి రాగానే మంత్రిగా అవకాశం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా పార్టీలో పట్టుకోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర మంత్రుల జిల్లా పర్యటనల్లో పులివెందుల పరిధిలో కార్యక్రమాలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అధికారపార్టీ నేతగా తగిన ప్రాధాన్యత కోసం ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎట్టకేలకు మంత్రిత్వ హోదా ఉన్న డిప్యూటీ చైర్మన్ పదవి సతీష్‌రెడ్డిని వరించనుంది.