sathish kumar reddy
-
సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్
క్రైం (కడప అర్బన్) : పులివెందుల ని వాసి కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసు లో శుక్రవారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని చిన్నచౌకు పోలీసుస్టేషన్లో సాయంత్రం విలేకరుల సమావేశంలో హాజరు పరిచారు. ఈ సందర్భం గా డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డిని ఈనెల 13వ తేదీ కిడ్నాప్ చేసి టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్ చెప్పిన మేరకు మా చుపల్లె బస్టాండులోని తమ కార్యాలయానికి తీసుకెళ్లి దాడి చేయడం, త ర్వాత అతన్ని చంపండంలో కీలకపాత్ర పోషించిన వారిలో డ్రైవర్ మురళీ యాదవ్, అనుచరుడు శేషసాయి అలియాస్ మణియాదవ్, మహబూబ్ రసూల్ అలియాస్ జిలానీలు ఉన్నారని పేర్కొన్నారు. వారిని అరెస్టు చేశామన్నారు. మిగతా నిందితులైన టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్, కిరాయి హంతకులు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, బాబావలీల కోసం గాలిస్తున్నామన్నారు. బాలకృష్ణ యాదవ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసు నమోదైన తర్వాత టీడీపీనేత బాలకృష్ణ యాదవ్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోయారని మీడియా బృందం అడిగిన ప్రశ్నకు డీఎస్పీ సమాధానమిస్తూ కేసు నమోదైన సమయానికి సంఘటనతో అతనికి సంబంధమున్నట్లుగా ప్రాథమిక నిర్దారణ కాలేదని చెప్పుకొచ్చారు. రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అని అడుగగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, అతని కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నామని తెలిపారు. -
సతీష్ కుమార్‌రెడ్డి హత్య.. నలుగురిపై కేసు నమోదు
క్రైం (కడప అర్బన్) : పులివెందుల నగిరిగుట్టకు చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇతను ఈనెల 13వ తేదీన పులివెందుల నుంచి కడపకు వచ్చి మూడు రోజుల క్రితం హత్యకు గురైన ఘటన శుక్రవారం వెలుగు చూడటం తెలిసిందే. ఈ సంఘటనపై కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, చిన్నచౌకు సీఐ యుగంధర్‌బాబు, సిబ్బంది తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. శనివారం మృతదేహానికి రిమ్స్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై బలమైన గాయాలున్నాయని పోస్టుమార్టంలో ప్రాథమికంగా వెల్లడైంది. దీంతో హత్యకు గురయ్యాడని నిర్ధారించారు. సతీష్‌కుమార్‌రెడ్డి బంధువు, ఇండికా విస్టా కారు యజమాని హరినాథరెడ్డి ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసు చిన్నచౌకు పోలీసుస్టేషన్లో క్రైం నెంబరు 66/2015లో 364, 342, 302, రెడ్‌విత్ 34 ఐపీసీ కింద నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా మల్లికార్జునరెడ్డి, అతని అల్లుడు ప్రమోద్, కుమార్తె షర్మిల, కడప నగరానికి చెందిన టీడీపీ నేత బాలకృష్ణయాదవ్,అతని అనుచరులను చేర్చారు. సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు హరనాథరెడ్డి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. పులివెందుల పట్టణానికి చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి తన పెట్రోలు బంకు వ్యవహారాలు చూసుకునేవాడని, ఈనెల 13వ తేదిన తన కారును కడపకు తీసుకు వచ్చాడన్నారు. సిద్దవటం పరిధిలోని భాకరాపేట సమీపంలో హెచ్పీసీఎల్లో మేనేజర్‌తో మాట్లాడే పనిమీద తన కారులో పంపించానని, అలాగే తన సొంత పని చూసుకుని వచ్చేందుకు ఆలస్యమవుతుందని చెప్పాడన్నారు. తర్వాత రెండు రోజులకు కడప నగరానికి చెందిన బాలకృష్ణ యాదవ్ డబ్బు పంచాయతీ విషయమై తమ దగ్గరే ఉన్నాడని, రావాలని సోదరులు ప్రసాద్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాగార్జునరెడ్డిలకు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. వారు వచ్చి బాలకృష్ణ యాదవ్‌ను కలువగా మల్లికార్జునరెడ్డి, ప్రమోద్‌లకు డబ్బు బాకీ విషయమై పంచాయతీ జరిగిందని చెప్పారు. వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పారన్నారు. ఆ సమయంలో అక్కడ సతీష్ కుమార్ రెడ్డి లేరని, అనంతరం శవమై కనిపించాడని తెలిపారు. మల్లికార్జునరెడ్డి ప్రముఖ కాంట్రాక్టర్ అని, అతనితో సతీష్‌కుమార్‌రెడ్డికి మహరాష్ట్రలో కాంట్రాక్టు పనులు చేసేటపుడు పరిచయం ఉండేదన్నారు. మల్లికార్జునరెడ్డి కుమార్తె షర్మిల సతీష్‌కుమార్‌రెడ్డికి పరిచయం ఉన్న నేపథ్యంలో అవసరాలకు బంగారం ఇచ్చిందని, ఆ బంగారాన్ని రూ. 1.80 లక్షలకు కుదవకు పెట్టాడని, తర్వాత ఆ డబ్బు చెల్లించని కారణంగా పంచాయతీ జరిగిందన్నారు. వారే కుట్ర పన్ని సతీష్‌కుమార్‌రెడ్డిని పథకం ప్రకారం హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
వ్యాపారి కిడ్నాప్.. దారుణ హత్య
క్రైం (కడప అర్బన్), పులివెందుల : పులివెందులకు చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి(36) అనే వ్యాపారి మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. కడప నగరంలోని మద్రాసు రోడ్డులో శుక్రవారం రెండు ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో ఉన్న కారులో అతడి మృతదేహం లభించింది. మృతుడి బంధువుల కథనం మేరకు.. లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి పులివెందులలో ఉంటూ పెట్రోలు బంకు, వాటర్ ప్లాంట్లను నడిపేవాడు. కొంతకాలంగా అప్పుల పాలవడం, వివాహేతర సంబంధాలు ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురై పులివెందులలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తుండేవాడు. తనకు కడపలో పని ఉందని ఈనెల 13న పెట్రోలు బంకు యజమాని, సమీప బంధువు హరనాథరెడ్డికి చెందిన ఇండికా విస్టా (కేఏ37 ఎం4758) కారును తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి రాకపోవడంతో ఈనెల 16న అతని సోదరుడు ప్రసాద్‌రెడ్డి, బంధువులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారిస్తున్న సమయంలోనే శుక్రవారం సాయంత్రం కడపలో అతని మృతదేహం లభ్యమైంది. ఇది టీడీపీ నేత పనే! కడప నగరానికి చెందిన టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్‌పై సతీష్‌కుమార్‌రెడ్డి బంధువులు ఆరోపణలు చేశారు. అతని దగ్గర సతీష్‌కుమార్‌రెడ్డికి డబ్బులు ఇచ్చిన వ్యక్తుల పంచాయతీ జరిగిందని, అతని అనుచరులు రెండు రోజుల క్రితం కడప నగరంలోని గోకుల్ సర్కిల్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో భోజనం చేస్తున్న సతీష్‌కుమార్‌రెడ్డిని కిడ్నాప్ చేశారని చెప్పారు. దారుణంగా కొట్టిన చిత్రం వాట్సాప్ ద్వారా తమకందిందని సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి సెల్‌ఫోన్ ద్వారా మీడియాకు చూపారు. మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నాయని చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, చిన్నచౌకు సీఐ యుగంధర్‌బాబు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించారు. అంతలోనే పులివెందుల నుంచి సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, బంధువులు మధుసూదన్‌రెడ్డి, నాగార్జునరెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఒక్కసారిగా దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మీడియా కు తెలిపారు. కాగా, సతీష్‌కుమార్‌రెడ్డి మృతి తో పులివెందులలోని నగురిగుట్ట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య సంజీవమ్మ, కుమారుడు యోగవర్ధన్రెడ్డి, కుమార్తె నిఖిత బోరున విలపించారు. -
లక్కీ ఛాన్స్
సాక్షి ప్రతినిధి,కడప: ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డిని అదృష్టం వరించనుంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కనుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పులివెందుల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా సతీష్‌రెడ్డి మూడు పర్యాయాలు పోటీచేసి ఓటమి చెందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చే శారు. వైఎస్సార్ జిల్లాకు ప్రాధాన్యత కల్పిస్తే తనకే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అయితే ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కారణంగా అప్పట్లో పదవికి దూరం కావాల్సి వచ్చిందని పరిశీలకుల అభిప్రాయం. అందివచ్చిన అవకాశం... శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ చైతన్యరాజు పేరు ముందుగా తె రపైకి వచ్చింది. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన చైతన్యరాజును డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఆయనకు పోటీగా ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజును పోటీ చేయించేందుకు సన్నద్ధం అయ్యారు. రాజకీయ సమీకరణల నేపధ్యంలో టీడీపీ నుంచి ఎన్నికైన అభ్యర్థిని రంగంలోకి దింపితే తాము పోటీలో ఉండమనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాయి. దీంతో అనూహ్యంగా ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ లేకుండా పోయింది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఫలించిన చిరకాలవాంఛ... ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి చిరకాలవాంఛ ఫలించింది. వేంపల్లె నాగిరెడ్డి మనువడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన ఆయన మూడు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేశారు. ఓటమి తప్పదని తెలిసి కూడాపోటీ చేయడం వెనుక వైఎస్ కుటుంబంపై రాజకీయంగా తలపడ్డ వ్యక్తిగా గుర్తింపు దక్కుతుందని ఆశించారు. అందులో భాగంగా టీడీపీ అధికారంలోకి రాగానే మంత్రిగా అవకాశం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా పార్టీలో పట్టుకోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర మంత్రుల జిల్లా పర్యటనల్లో పులివెందుల పరిధిలో కార్యక్రమాలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అధికారపార్టీ నేతగా తగిన ప్రాధాన్యత కోసం ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎట్టకేలకు మంత్రిత్వ హోదా ఉన్న డిప్యూటీ చైర్మన్ పదవి సతీష్‌రెడ్డిని వరించనుంది.