క్రైం (కడప అర్బన్) : పులివెందుల నగిరిగుట్టకు చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇతను ఈనెల 13వ తేదీన పులివెందుల నుంచి కడపకు వచ్చి మూడు రోజుల క్రితం హత్యకు గురైన ఘటన శుక్రవారం వెలుగు చూడటం తెలిసిందే.
ఈ సంఘటనపై కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, చిన్నచౌకు సీఐ యుగంధర్‌బాబు, సిబ్బంది తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. శనివారం మృతదేహానికి రిమ్స్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై బలమైన గాయాలున్నాయని పోస్టుమార్టంలో ప్రాథమికంగా వెల్లడైంది. దీంతో హత్యకు గురయ్యాడని నిర్ధారించారు. సతీష్‌కుమార్‌రెడ్డి బంధువు, ఇండికా విస్టా కారు యజమాని హరినాథరెడ్డి ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్య కేసు నమోదు చేశారు.
ఈ కేసు చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో క్రైం నెంబరు 66/2015లో 364, 342, 302, రెడ్‌విత్ 34 ఐపీసీ కింద నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా మల్లికార్జునరెడ్డి, అతని అల్లుడు ప్రమోద్, కుమార్తె షర్మిల, కడప నగరానికి చెందిన టీడీపీ నేత బాలకృష్ణయాదవ్,అతని అనుచరులను చేర్చారు. సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు హరనాథరెడ్డి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. పులివెందుల పట్టణానికి చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి తన పెట్రోలు బంకు వ్యవహారాలు చూసుకునేవాడని, ఈనెల 13వ తేదిన తన కారును కడపకు తీసుకు వచ్చాడన్నారు. సిద్దవటం పరిధిలోని భాకరాపేట సమీపంలో హెచ్‌పీసీఎల్‌లో మేనేజర్‌తో మాట్లాడే పనిమీద తన కారులో పంపించానని, అలాగే తన సొంత పని చూసుకుని వచ్చేందుకు ఆలస్యమవుతుందని చెప్పాడన్నారు. తర్వాత రెండు రోజులకు కడప నగరానికి చెందిన బాలకృష్ణ యాదవ్ డబ్బు పంచాయతీ విషయమై తమ దగ్గరే ఉన్నాడని, రావాలని సోదరులు ప్రసాద్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాగార్జునరెడ్డిలకు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
వారు వచ్చి బాలకృష్ణ యాదవ్‌ను కలువగా మల్లికార్జునరెడ్డి, ప్రమోద్‌లకు డబ్బు బాకీ విషయమై పంచాయతీ జరిగిందని చెప్పారు. వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పారన్నారు. ఆ సమయంలో అక్కడ సతీష్ కుమార్ రెడ్డి లేరని, అనంతరం శవమై కనిపించాడని తెలిపారు.
మల్లికార్జునరెడ్డి ప్రముఖ కాంట్రాక్టర్ అని, అతనితో సతీష్‌కుమార్‌రెడ్డికి మహరాష్ట్రలో కాంట్రాక్టు పనులు చేసేటపుడు పరిచయం ఉండేదన్నారు. మల్లికార్జునరెడ్డి కుమార్తె షర్మిల సతీష్‌కుమార్‌రెడ్డికి పరిచయం ఉన్న నేపథ్యంలో అవసరాలకు బంగారం ఇచ్చిందని, ఆ బంగారాన్ని రూ. 1.80 లక్షలకు కుదవకు పెట్టాడని, తర్వాత ఆ డబ్బు చెల్లించని కారణంగా పంచాయతీ జరిగిందన్నారు. వారే కుట్ర పన్ని సతీష్‌కుమార్‌రెడ్డిని పథకం ప్రకారం హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
సతీష్ కుమార్‌రెడ్డి హత్య.. నలుగురిపై కేసు నమోదు
Published Sun, Apr 19 2015 3:29 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement