వ్యాపారి కిడ్నాప్.. దారుణ హత్య
క్రైం (కడప అర్బన్), పులివెందుల : పులివెందులకు చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి(36) అనే వ్యాపారి మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. కడప నగరంలోని మద్రాసు రోడ్డులో శుక్రవారం రెండు ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో ఉన్న కారులో అతడి మృతదేహం
లభించింది. మృతుడి బంధువుల కథనం మేరకు.. లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన కర్ణ సతీష్‌కుమార్‌రెడ్డి పులివెందులలో ఉంటూ పెట్రోలు బంకు, వాటర్ ప్లాంట్లను నడిపేవాడు.
కొంతకాలంగా అప్పుల పాలవడం, వివాహేతర సంబంధాలు ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురై పులివెందులలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తుండేవాడు. తనకు కడపలో పని ఉందని ఈనెల 13న పెట్రోలు బంకు యజమాని, సమీప బంధువు హరనాథరెడ్డికి చెందిన ఇండికా విస్టా (కేఏ37 ఎం4758) కారును తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి రాకపోవడంతో ఈనెల 16న అతని సోదరుడు ప్రసాద్‌రెడ్డి, బంధువులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారిస్తున్న సమయంలోనే శుక్రవారం సాయంత్రం కడపలో అతని మృతదేహం లభ్యమైంది.
ఇది టీడీపీ నేత పనే!
కడప నగరానికి చెందిన టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్‌పై సతీష్‌కుమార్‌రెడ్డి బంధువులు ఆరోపణలు చేశారు. అతని దగ్గర సతీష్‌కుమార్‌రెడ్డికి డబ్బులు ఇచ్చిన వ్యక్తుల పంచాయతీ జరిగిందని, అతని అనుచరులు రెండు రోజుల క్రితం కడప నగరంలోని గోకుల్ సర్కిల్ సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న సతీష్‌కుమార్‌రెడ్డిని కిడ్నాప్ చేశారని చెప్పారు. దారుణంగా కొట్టిన చిత్రం వాట్సాప్ ద్వారా తమకందిందని సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి సెల్‌ఫోన్ ద్వారా మీడియాకు చూపారు. మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నాయని చెప్పారు.
స్థానికుల సమాచారం మేరకు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, చిన్నచౌకు సీఐ యుగంధర్‌బాబు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించారు. అంతలోనే పులివెందుల నుంచి సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, బంధువులు మధుసూదన్‌రెడ్డి, నాగార్జునరెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఒక్కసారిగా దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మీడియా కు తెలిపారు. కాగా, సతీష్‌కుమార్‌రెడ్డి మృతి తో పులివెందులలోని నగురిగుట్ట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య సంజీవమ్మ, కుమారుడు యోగవర్ధన్‌రెడ్డి, కుమార్తె నిఖిత బోరున విలపించారు.