విషాదాంతం : ప్రమోషన్‌ కోసమే హత్య చేశారా? | Missing HDFC Bank VP case gets murkier | Sakshi
Sakshi News home page

విషాదాంతం : ప్రమోషన్‌ కోసమే హత్య చేశారా?

Published Mon, Sep 10 2018 12:58 PM | Last Updated on Mon, Sep 10 2018 7:57 PM

Missing HDFC Bank VP case gets murkier  - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ కిరణ్‌ సంఘ్వి(39) అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. గత ఐదురోజులుగా కనిపించకుండాపోయిన  సంఘ్వి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ కేసులో ఒక​ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రమోషన్‌, ప్యాకేజీ వివాదాల కారణంగానే సంఘ్వి సహోద్యోగులు కొందరు ఈ హత్యకు పాల్పడినట్టు  తెలుస్తోంది.

డిప్యూటీ కమిషనర్‌ తుషార్‌ దోషి అందించిన సమాచారం ప్రకారం ఈ కేసులో నిందితుడుగా ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ సర్ఫరాజ్ షేక్ (20)ను అరెస్ట్‌ చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు, మరో ముగ్గురు పేర్లను కూడా వెల్లడించాడు. సదరు ముగ్గురు వ్యక్తులు బ్యాంకు కార్యాలయంలోని పార్కింగ్‌ ఏరియాలోనే సంఘ్విపై కత్తితో దాడి చేసి సంఘ్విని హత్య చేశారని, అనంతరం ఒక పరుపులో చుట్టి సంఘ్వి కారులోనే దాచి పెట్టారని చెప్పారు. అయితే మృతదేహాన్ని మాయం చేసేందుకు తాను ప్పుకున్నానని, ఇందుకు తనకు 10వేల  రూపాయలు  చెల్లించారని చెప్పాడు. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంలో ఒక మహిళ ప్రమేయంకూడా ఉందని,   కమలా మిల్స్‌ భవనంలోని పార్కింగ్‌ ఏరియాలో సీసీటీవీ లేని కారణంగా అక్కడ పలుమార్లు రెక్కీ నిర్వహించి ఈ హత్యకు పూనుకున్నట్టు పోలీసుల విచారణలో షేక్‌  ఒప్పుకున్నాడు.

కాగా ముంబైలో హెచ్‌డీఎఫ్‌సీ సిద్ధార్థ్ సంఘ్వి అదృశ్యం కలకలం  సృష్టించింది. భార్య, నాలుగేళ్ల కుమారునితో కలిసి మలాబార్‌ హిల్స్‌లో నివాసం ఉంటున్న సిద్ధార్థ్‌ కిరణ్‌ సంఘ్వీ  బుధవారం  నుంచీ  అదృశ్యమయ్యారు.  గత బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఆఫీసుకు బయల్దేరిన సంఘ్వి రాత్రి పదయినా ఇంటికి తిరిగి చేరుకోలేదు.  దీంతో  అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ కేసు విచారణలో భాగంగా  గురువారం ఉదయం నవీ ముంబై ప్రాంతంలో కత్తి సహా కారు సీటుకు రక్తపు మరకలతో, అనుమానాస్పద స్థితిలో  ఉన్న ఆయన కారును పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు కిడ్నాప్‌  అనుమానాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ, హతుడి ఫోన్‌ లొకేషన్‌ తదితర వివరాల ఆధారంగా నిందితుణ్ని అరెస్ట్‌ చేశారు.  వృత్తిగత కక్షలే ఈ హత్యకు కారణమై అయి వుండవచ్చని  పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాప్‌, హత్య కేసు  నమోదుచేశామని,  దర్యాప్తు కొనసాగుతోందని  ముంబై డీసీపీ మంజునాథ్‌ సింగే వెల్లడించారు. సంఘ్వి  సహోద్యోగులను కూడా ప్రశ్నించనున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement