వణికించిన భూప్రకంపనలు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: రాత్రి 9.57 గంటలు.. ఒక్కసారిగా వస్తువులు కదిలినట్లయ్యింది.. 9.59 గంటలు.. మరోసారి అదే అనుభవం..భూమి కంపించిందని అర్థమైంది.. ఒక్కసారి జనంలో కలవరం.. భయంతో ఇళ్లలో ఉన్న వారందరూ పరుగు పరుగున బయటకు వచ్చేశారు. జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలో రెండుసార్లు నాలుగైదు సెకండ్లపాటు భూమి కంపించింది. అయితే ప్రకంపనలు స్వల్పస్థాయిలో ఉండటంతో ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. బంగాళాఖాతం కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రకంపనలు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంతోపాటు దాదాపు అన్ని మండలాల్లోనూ భయాందోళనలు రేకెత్తించాయి. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, గార, రాజాం, ఆమదాలవలస తదితర మండలాల్లో ప్రకంపనలు వచ్చాయి. పలాస మండలం రాజగోపాలపురంలో పలు ఇళ్ల గోడలు బీటలు వారాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసారు. ఇక ప్రయాణాలు చేస్తున్నవారు..బయట పనుల్లో ఉన్నవారైతే..తమ ఇళ్లలో ఏం జరిగిందో అన్న ఆందోళనలతో పరుగులు తీశారు. పలు ఇళ్లలో చిన్న చిన్న వస్తువులు కింద పడిపోగా, కొన్ని ఇళ్లలో టీవీలు పడిపోయాయి.
తీర ప్రాంతంలోనే...
బంగాళాఖాతంలో భూకంపం సంభవించడంతో దాని ప్రభావం తీర ప్రాంతం పొడవునా కనిపిం చింది. బుధవారం సాయంత్రం నుంచి సముద్రపు అలల తాకిడిలో కొంత తేడా కన్పించిందని, భూకం పం రాగానే తామంతా సముద్రపు అలలను గమనించామని, అలల ఉధృతి కాస్తా పెరిగిందని సంతబొమ్మాళి తీర ప్రాంత యువకులు ఘటన తర్వాత ‘న్యూస్‌లైన్’కు ఫోన్లో తెలియజేశారు. ఏదిఏమైనా భూప్రకంపనలతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
అప్రమత్తంగా ఉండాలి..
భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు సూచించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదైందని ఆర్డీవో గణేష్‌కుమార్ తెలిపారు. మత్స్యకారులెవరూ సముద్ర వేటకు వెల్లకూడదని, నిషేద సమయమని గుర్తు చేసారు. గురువారం కూడా మత్స్యకారులు వేటకు వెళ్ల కూడదని హెచ్చరికలు జారీ చేశారు.