
పాల ధర మళ్లీ పెంపు
- లీటరుకు రూ.2
- సేకరణ ధరలోనూ పెరుగుదల
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విజయ పాల ధరలు మళ్లీ పెరిగాయి. లీటరుకు రూ.2 పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయించింది. జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య పాల సేకరణ ధరను కూడా లీటరుకు రూ.2 పెంచుతూ తీర్మానించింది. పెరిగిన పాల ధరలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య ఎండీ టి.బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం రూ.2 కోట్ల విరాళాన్ని అందించాలంటూ కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమితి పాలకవర్గం తీర్మానించిన రోజే పాల ధర పెంచుతూ నిర్ణయించటం గమనార్హం. మరోపక్క పాల ధరల పెంపుపై వినియోగదారులు భగ్గుమంటున్నారు. ఏడాదికాలంలో మూడుసార్లు ధరలు పెంచటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపడమేనని మండిపడుతున్నారు.