గిరిజనుల మృతి: నిర్లక్ష్యంగా మంత్రిగారి సమాధానం!
విజయవాడ: ఏజెన్సీ ప్రాంతంలో 16మంది గిరిజనుల మృతిపై ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని చాపరాయి గ్రామంలో 16 మంది గిరిజనులు చనిపోయిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ గ్రామంలో కేవలం 60 మంది మాత్రమే ఉంటున్నారని, 60 మంది కోసం రోడ్లు వేయడం, నీళ్లివ్వడం, వైద్యం అందించడం కష్టమని అన్నారు. గిరిజనులు కొండప్రాంతాల్లో ఉంటే.. వారికి ఈ వసతులన్ని ఎలా కల్పించగలమని? ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తున్నామంటూ మంత్రి చెప్పుకొచ్చారు.
ఆవు చనిపోయి ఉన్న నీళ్లు తాగడం వల్లే గిరిజనుల మరణాలు సంభవించాయని మంత్రి కామినేని చెప్పారు. మృతుల రక్త నమూనాలు సేకరించామని, వారు మలేరియా వల్ల చనిపోలేదని తెలిపారు. పీజీ విద్య కోసం డాక్టర్లు వెళ్లిపోవడం వల్ల ఏజెన్సీలో ఖాళీలున్నాయని చెప్పారు. విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ వ్యాధి వ్యాపించిన మాట నిజమేనన్నారు.