వైఎస్ మరణం...రాష్ట్రానికి శాపం | 'Newsline' with the Bandar, the former MLA Nani | Sakshi
Sakshi News home page

వైఎస్ మరణం...రాష్ట్రానికి శాపం

Published Sat, Aug 24 2013 12:41 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

'Newsline' with the Bandar, the former MLA Nani

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం రాష్ట్రానికి శాపంగా మారిందని బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ వైఎస్ అధికారంలో ఉన్నంతకాలం విభజనవాద శక్తుల ఆటలు సాగలేదన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఆయనకు లభించిన ప్రజాకర్షణను ఎదుర్కొనడానికే ప్రతిపక్షాలు, విభజనవాదులకు సమయం చాలలేదని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో వైఎస్ శక్తివంచన లేకుండా కృషిచేశారని చెప్పారు. అభివృద్ధినే ఆయుధంగా చేసుకుని 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను కట్టడి చేశారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌కు వస్తాయనుకున్న ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి వైఎస్ తన సత్తా చాటుకున్నారని తెలిపారు. విభజనవాదుల దృష్టి ఉద్యమబాట నుంచి అభివృద్ధి వైపునకు మళ్లేలా తనదైన శైలిలో వైఎస్ పాలన సాగించారని పేర్ని కొనియాడారు.
 
వైఎస్ మరణంతో విభజన శక్తులు పేట్రేగిపోయాయని, ఫలితంగానే 2009 డిసెంబరు 9 ప్రకటన వచ్చిందని పేర్ని చెప్పారు. రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఈ ప్రకటన వచ్చేది కాదని  ప్రజాప్రతినిధులందరూ ఆనాడు భావించారని ఆయన గుర్తుచేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో నాయకత్వ లోపం కారణంగానే రాష్ట్రాన్ని విభజిస్తూ  సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకొందన్నారు. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమం స్వచ్ఛందంగా సాగుతోందని, దీని తాకిడికి కేంద్రం దిగిరాక
తప్పదని ఆయన స్పష్టంచేశారు.

 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి అవిశ్రాంతం పనిచేస్తే.. ప్రతిపక్ష నాయకుడు రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని పేర్ని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్ కృషిచేశారని చెప్పారు. కృష్ణాడెల్లాకు 2004 నుంచి 2009 వరకు వరుసగా రెండు పంటలకు సకాలంలో నీరు ఇచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. ఆయన మరణానంతరం మూడేళ్లుగా ఖరీఫ్‌లో సకాలంలో నీరు విడుదల చేయకపోగా రెండో పంటకు అసలు నీరే ఇవ్వడంలేదన్న విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. ఇప్పుడే ఇలా ఉంటే రాష్ట్రం విడిపోతే డెల్టాకు అసలు నీరే వచ్చే అవకాశం ఉండదని చెప్పారు.

నదీ జలాల వినియోగం, విద్యా, వైద్య సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు తదితర అంశాలపై రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా గుడ్డిగా రాష్ట్రవిభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. డెల్టా పరిరక్షణ కోసం వందేళ్ల కలగా ఉన్న పులిచింతల ప్రాజెక్టు పనులను వైఎస్ ప్రారంభించారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసిందీ ఆయనేనని గుర్తుచేసుకున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్ష రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని ఆయన స్పష్టంచేశారు.

 వైఎస్ జగనే సమర్థ నాయకుడు
 వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో సమర్థుడైన నాయకుడు లేని పరిస్థితి నెలకొంది. అయితే తమ కోరికలు, ఆకాంక్షలు నెరవేర్చే నేతగా, వైఎస్ వారసునిగా జగన్‌ను ప్రజలు ఇప్పటికే గుర్తించారని పేర్ని చెప్పారు. 2014లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సమర్థుడైన నాయకుడు అధికారంలోకి వస్తే విభజనవాదుల దుశ్చర్యలకు కళ్లెం దానంతట అదే పడుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement