సాక్షి, నిజామాబాద్ : తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన సైకిల్ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. మరోవైపు తెలంగాణవాదుల నుంచి ఈ యాత్రకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి రెండు కళ్ల సిద్ధాంతంతో ఇప్పటికే జిల్లాలో టీడీపీ దెబ్బతినగా.. మిగిలిన కార్యకర్తల్లో కూడా ఈ యాత్ర ఏమాత్రం ఉత్సాహన్ని నింపలేకపోతోంది. టీడీపీలో ఇటీవలే తెరపైకి వచ్చిన మదన్‌మోహన్‌రావు చేపట్టిన సైకిల్‌యాత్ర అక్టోబర్ 28న మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మీదుగా బిచ్కుంద మండలం వడ్లంలోకి ప్రవేశించింది. జుక్కల్ నియోజకవర్గంలో పలు మండలాల్లో ఈ యాత్రకు ఆశించిన మేరకు ప్రజాదరణలభించలేదు. ఒకటి రెండు చోట్ల మినహా బాన్సువాడ నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
నిరసనలు.. అడ్డగింతలు
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో కనిపించని ఈ నేతలు ఇప్పుడు ప్రజా సమస్యల పేరుతో యాత్రలు చేపడితే ప్రజలెలా నమ్ముతారని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. బాన్సువాడ మండలం రాంపూర్ వద్ద స్థానికులు, గిరిజనులు ఆదివారం ఈ యాత్రను అడ్డుకున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీడీపీ ఇచ్చిన లేఖతోనే కేంద్రం తెలంగాణ ప్రకటించిందని చెబుతున్న నేతలు అదే చంద్రబాబుతో ఎందుకు జై తెలంగాణ అనిపించడం లేదని వారు ప్రశ్నించారు. మం గళవారం ఈ యాత్రలో పాల్గొనేందుకు బాన్సువాడకు వెళ్లిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిలకు కూడా చేదు అనుభవం ఎదురైంది. టీ ఆర్‌ఎస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొనాల్సి ఉంది. కానీ తెలంగాణవాదుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం.
పార్టీలో అయోమయం
జిల్లాలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ యాత్రపై పార్టీ జిల్లా శాఖలో అయోమయం నెలకొంది. యాత్రను విజయవం తం చేయాలని ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పిలుపునిచ్చిన దాఖలాల్లేవు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఈ యాత్రలో పాల్గొన్నప్పటికీ.. రూరల్ ఎమ్మెల్యే మం డవ వెంకటేశ్వరరావు వంటి జిల్లా నాయకులు యాత్రకు దూరంగా ఉన్నారు.
పార్టీ పరిస్థితి దయనీయం
జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సైకిల్ యాత్ర సాగనున్న ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి కూడా లేకపోవడం పార్టీ దయనీయ పరిస్థితికి నిదర్శనం. కామారెడ్డి నియోజకవర్గంలో నూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండటానికీ ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య నేతలు సైతం రానున్న ఎన్నికల్లో పొటీ చేసేందుకు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. పోటీ చేయాలా వద్దా అన్న విషయాన్ని వారు తేల్చుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో కొత్తగా పార్టీలో తెరపైకి వచ్చిన మదన్‌మోహన్‌రావు జిల్లా ప్రజలకు తనను పరిచయం చేసుకోవడం కోసం పడుతున్న పాట్లలో భాగమే ఈ యాత్ర అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ సైకిల్ యాత్ర అట్టర్‌ఫ్లాప్
Published Wed, Nov 6 2013 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement