bicycle rally
-
సైకిల్‌కు రూ.300: పరువు పోగొట్టుకున్న టీడీపీ నేతలు..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన సైకిల్ ర్యాలీకి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఝులక్ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయం ప్రధాన నాయకులు వచ్చారు. ఎంత సేపటికీ మిగతా నేతలు, కార్యకర్తలు రాకపోయేసరికి కంగుతిన్నారు. ఎక్కడ పరువు పోతుందోనని డబ్బులిచ్చి చిన్నపిల్లలను ర్యాలీకి తీసుకొచ్చి అభాసుపాలయ్యారు. ర్యాలీలో చిన్నపిల్లలు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కనీసం ఉనికి సైతం చాటుకోలేక పరువుపోగొట్టుకుని బిక్కమొహాలతో వెనుదిరిగారు. జిల్లాలో టీడీపీ నిరసన ర్యాలీ ‘నీరసంగా’ సాగింది. ఆ పార్టీ దయనీయ పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డీజిల్, పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా సైకిల్ ర్యాలీ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో ఆ పార్టీ జిల్లా నాయకులు సోమవారం జరిగే సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తీరా సోమవారం నిర్వహించాల్సిన సైకిల్ ర్యాలీకి నాయకులు, కార్యకర్తలు కరువయ్యారు. పాల్గొనేందుకు ప్రజలు కూడా విముఖత చూపారు. అసలు సైకిల్ ర్యాలీకి సైకిళ్లే కరువయ్యాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన పది నుంచి పదిహేను మంది కూడా కార్లు, బైకుల్లో అక్కడకు చేరుకున్నారు. మరి సైకిళ్లు ఎవరు తేవాలి..? చదువుకునే పిల్లల్ని వాళ్లకున్న సైకిళ్లతో సహా టీడీపీ జిల్లా కార్యాలయానికి రప్పించారు. సైకిళ్లకు పార్టీ జెండాలు కట్టారు. పిల్లల మెడలో వేసుకోవడానికి కూడా పార్టీ జెండాలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాగానే పాత గుంటూరు రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కొద్ది మంది నాయకులు, చిన్నారులతో ర్యాలీగా బయలుదేరారు. అంతే, ఒంగోలు డీఎస్పీ ప్రసాదు తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదు, దానికితోడు చదువుకునే పిల్లలతో సైకిల్ ర్యాలీ ఏమిటని టీడీపీ నేతలను నిలదీశారు. అనంతరం పిల్లలందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు. పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీలో జనార్దన్‌కు మాత్రమే ఒక్క సైకిల్ మిగిలింది. అక్కడ నుంచి ర్యాలీగా నడుచుకుంటూ బయలుదేరేందుకు టీడీపీ నాయకులు పూనుకున్నారు. కానీ, పోలీసులు అడ్డుకుని తిరిగి పార్టీ కార్యాలయంలోకే పంపించి వేశారు. ఆ సమయంలో పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అసలు విషయం ఏమిటంటే ర్యాలీకి వచ్చిన పిల్లాడితో పాటు సైకిల్‌కు రూ.300 ఇస్తామని చెప్పిమరీ తీసుకొచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. నేతలకు, కేడర్‌కు మధ్య అగాధం... జిల్లాలో తెలుగుదేశం పార్టీ రానురానూ ఉనికి కోల్పోతోంది. నాయకులే కాదు కార్యకర్తలు సైతం పార్టీకి దూరమవుతూ వస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు చెప్పడం.. ఆ కార్యక్రమాలకు పార్టీ జిల్లా నాయకులు కేడర్‌కు పిలుపునివ్వడం సర్వసాధారణమైంది. అయితే, ఇక్కడే పార్టీ పెద్దలకు, కేడర్‌కు మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఏ నిరసన కార్యక్రమానికి పిలుపినిచ్చినా ఆ పది, పదిహేను మంది మాత్రమే హాజరవుతున్నారే తప్ప పార్టీ కేడర్‌లో కదలిక లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం పదవులు అనుభవించిన నాయకులంతా కరోనా కష్టకాలంలో సైతం కనిపించకుండాపోయి ఇప్పుడు నిరసన కార్యక్రమాలంటూ రావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల మాట అటుంచితే కరోనా సమయంలో పార్టీ కార్యకర్తల బాగోగులు సైతం పట్టించుకోకుండా తప్పించుకు తిరిగారంటూ ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు పిలిచినప్పుడు వారి సంగతి తేలుద్దామని వేచిచూస్తున్న టీడీపీ కార్యకర్తలకు ఆ సమయం రానే వచ్చింది. నిరసన కార్యక్రమానికి తరలిరావాలంటూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చినా కనీస స్పందన కూడా లేని దుస్థితి నెలకొంది. కార్యకర్తలు ఝలక్ ఇచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు కంగుతిని పరువు నిలుపుకునేందుకు స్కూలు పిల్లలను పిలిపించుకుని ఛీ అనిపించుకున్నారు. ఈ ఘటనతో జిల్లాలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన విషయం స్పష్టమవుతోంది. -
సీఐఎస్ఎఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
న్యూఢిల్లీ: సింగిల్ లైన్ సైకిల్ పరేడ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం ద్వారా సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే వరుసలో 1,327 మంది భద్రతా సిబ్బంది సైకిళ్లతో పరేడ్ నిర్వహించి ఈ ఘనతను సాధించారు. ‘నోయిడాలోని ఎక్స్‌ప్రెస్ వే లో నిర్వహించిన ఈ పరేడ్‌లో ఎక్కడా ఆగకుండా సైకిళ్లకు మధ్య సమ దూరాన్ని పాటిస్తూ పరేడ్ నిర్వహించారు’ అని అధికారి ఒకరు తెలిపారు. ఈ సైకిల్ పరేడ్ ఏకబిగిన 3.2 కిలోమీటర్ల మేర సాగిందని, ఇప్పటివరకు ఈ రికార్డు ఒకే వరుసలో 1,235 సైకిళ్లతో హుబ్బాల్లి సైకిల్ క్లబ్ ఆఫ్ ఇండియా పేరున ఉందని సీఐఎస్ఎఫ్ ప్రతినిధి వెల్లడించారు. పరేడ్‌ను సక్రమంగా నిర్వహించాలంటే పూర్తి క్రమశిక్షణ అవసరమని, రెండు సైకిళ్ల మధ్య దూరం మూడో సైకిల్‌ను మించరాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పారు. ఈమేరకు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ రంజన్, ఇతర సీనియర్ అధికారులకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేసినట్లు వెల్లడించారు. -
రికార్డుల విహారిక..
హిమాయత్‌నగర్: పెట్రోల్ ధర పెరిగిందంటే అది అమలులోకి వచ్చేలోగా బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాం. మరుసటిరోజు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ బైక్‌ను బయటికి తీస్తాం. అంతేగాని ఇంధనంతో నడిచే వాహనాలను పక్కనబెట్టి కొన్నిరోజులు సైకిల్‌పై పనులు చూసుకుందామని ఎవరూ అనుకోరు. చిన్నప్పుడు సైకిల్ కోసం ఇంట్లో నానా యాగీ చేసి కొనిపించుకుంటారు. కొత్త సైకిల్ ముచ్చట తీర్చుకున్న బాల్యాన్ని గుర్తు చేసుకోవడానికైనా సైకిల్ తొక్కిన సంఘటనలు ప్రస్తుత కాలంలో చాలా అరుదు. అలాంటిది సైకిల్ సవారీ చేస్తూ రికార్డుల మోత మోగిస్తున్నారు నగరవాసి నిహారిక. ఇంటి వద్ద సరదాగా ప్రారంభించిన సైక్లింగ్ ఇప్పుడామెను అంతర్జాతీయ వేదికలపై విజేతగా నిలిపింది. అంతేకాదు.. ‘అడెక్స్ క్లబ్ పర్సియన్’ నిర్వహించే ‘బ్రేవెట్’ సైక్లింగ్‌లో పోటీపడి అవార్డుల పంట పండిస్తున్నారామె. సిటీ నుంచి ఫస్ట్ విన్నర్ నగరంలోని ఈసీఐఎల్ నివాసముండే నిహారిక హైటెక్‌సిటీలోని ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సరదా కోసం స్టార్ట్ చేసిన సైక్లింగ్‌లో ఇప్పుడు ఆమె రికార్డుల రారాణిగా వెలుగొందుతున్నారు. నిహారిక ఇంటివద్ద సరదాగా సైకిల్ తొక్కడం ప్రారంభించించారు. అదీ ఫిట్నెస్ కోసం రోజుకు ఒకటి రెండు కి.మీ చొప్పున తొక్కేవారు. అలా ఆ ప్రయాణం కాస్తా 100 కి.మీ తొక్కే దిశగా సాగింది. ఈమె ప్రతిభను గుర్తించిన స్నేహితుడు.. ‘బ్రేవెట్’లో పాల్గొంటే మంచి గుర్తింపుతో పాటు అవార్డులు సైతం గెలుచుకోవచ్చని సలహా ఇచ్చాడు. అంతే.. స్నేహితుడి సలహాతో పోటీలో పాల్గొన్న నిహారిక రికార్డులు బద్దలుకొడుతోంది. ‘బ్రేవెట్’ నిర్వహించే కాంటెస్ట్‌లో 2015లో సైక్లింగ్ పోటీల్లో పాల్గొంది నిహారిక. హైదరాబాద్ వేదికగా జరిగిన ‘సూపర్ ర్యాండొనెస్’ టైటిల్ పోటీల్లో 200 కి.మీ.లో సక్సెస్ అయిన నిహారిక.. తర్వాత 300 కి.మీ., 400 కి.మీ., 600 కి.మీ. పూర్తి చేసిన మొట్టమొదటి హైదరాబాద్ మహిళగా రికార్డు సాధించారు. దీంతో ఆమెను బ్రేవెట్ ‘సూపర్ ర్యాండొనెస్–2015–16’ టైటిల్‌తో సత్కరిచింది. ఇంత వరకు ఏ మహిళా ఈ రికార్డును నెలకొల్పకపోవడం గమనార్హం. ఘాట్రోడ్డులోవెయ్యి కి.మీ. మామూలు రోడ్డుపై సైకిల్ తొక్కాలంటే చాలా కష్టపడాలి. అటువంటిది ఘాట్ రోడ్డులో సైకిల్ అంటే కత్తి మీద సామే. అదీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కి.మీ. ఘాట్ రోడ్డులో సైకిల్‌ను తొక్కి సరికొత్త రికార్డును నమోదు చేశారు నిహారిక. తమిళనాడులోని తిరుచురాపల్లి నుంచి కన్యాకుమారి వరకు వెయ్యి కి.మీ. మేర సైక్లింగ్ చేసిన నిహారిక.. ఈ ప్రయాణంలో 650 కి.మీ. ఘాట్ రోడ్డు, మరో 350 కి.మీ.హైవేపైనాసాగింది. సౌతిండియా నుంచి ఈ రికార్డును నెలకొల్పిన ఏకైక మహిళగా నిహారిక రికార్డును సొంతం చేసుకున్నారు. 24 గంటల్లో 360 కి.మీ రైడ్ ‘ఫ్లషీ’ సంస్థ 2018–19 సంవత్సరానికి నిర్వహించిన 360 కి.మీ పోటీల్లో నిహారిక తన టీమ్ మురగన్, గణేష్, బద్రితో కలసి పాల్గొన్నారు. ఈ పోటీని కూడా నిహారికే లీడ్ చేయడం విశేషం. ఇందులో 24 గంటల్లో 360 కి.మీ. తొక్కాల్సి ఉంటుంది. అలా ఆమె బెంగళూరు నుంచి గండికోట రోడ్డు మార్గంలో సైక్లింగ్ చేసి రికార్డు సొంతం చేసుకున్నారు. అన్ని రికార్డులనూ బ్రేక్ చేస్తా సైక్లింగ్‌లో మన సత్తా ఎంటో ప్రపంచానికి తెలియాలి. ‘బ్రేవెట్’ తరఫున పాల్గొన్న ప్రతి ఈవెంట్లోను నాది ఓ రికార్డు ఉంటుంది. ఇలాంటి రికార్డులు ఎన్ని ఉన్నా అన్నింటినీ బ్రేక్ చేసేందుకు ఎదురు చూస్తున్నా. త్వరలోనే ఆ ఘనతను సాధించి మహిళా శక్తి ఏంటో చూపిస్తా. – నిహారిక ట్రిపుల్ ఎస్ఆర్ టైటిల్ విజేతగా.. 2017–18లో ‘బ్రేవెట్’ కాంటెస్ట్‌లో మళ్లీ పాల్గొన్నారు నిహారిక. ఏడాది పాటు 4,500 కి.మీ. సైకిల్ తొక్కి రికార్డు నమోదు చేశారు. వేలమంది పోటీపడిన ఈ కాంటెస్ట్‌లో ‘ట్రిపుల్ సూపర్ ర్యాండొనెస్’ టైటిల్ విజేతగా నిలిచారు. ఈ రికార్డును దేశంలో ఇంతవరకూ ఎవరూ నమోదు చేయకపోవడంతో ఆ ఘనతను సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా ఈమె నిలిచింది. -
స్పీకర్ మోడ్ లేదా ఏరోప్లేన్ మోడ్
మాలూరు/దొడ్డబళ్లాపుర/హొసకోటె: కర్ణాటక విధానసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం వ్యంగ్య బాణాలు సంధించారు. ‘స్పీకర్ మోడ్’ లేదా ‘ఏరోప్లేన్ మోడ్’లో ఉండే మొబైల్ ఫోన్ వంటి వ్యక్తి మోదీ అనీ, ఆయన ఎప్పుడూ ‘వర్క్ మోడ్’లో ఉండరని రాహుల్ ఎద్దేవా చేశారు. సోమవారం రాహుల్ మాలూరు, హొసకోటె, దొడ్డబళ్లాపుర, దేవనహళ్లి తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ‘మాట్లాడటానికి మరో విషయమే లేనట్లు మోదీ ఎప్పుడూ తన ప్రసంగాల్లో నాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రస్తుత సమస్యలపై కాకుండా కాంగ్రెస్‌ను, నన్ను దూషించడమే పనిగా పెట్టుకుని మాట్లాడతారు. ఆయన మాటల్లో ఎప్పుడూ మా పార్టీ వారిపై గౌరవం కనిపించదు’ అని పేర్కొన్నారు. పెట్రో ధరలు పెరిగిపోతుండటానికి నిరసనగా రాహుల్ గాంధీ కొద్ది దూరంపాటు సైకిల్ తొక్కి, మరికొద్ది దూరం ఎద్దుల బండిలో ప్రయాణించారు. -
సైకిల్డే సందర్భంగా గుంటూరులో సైకిల్ ర్యాలీ
-
టీడీపీ సైకిల్ యాత్ర అట్టర్‌ఫ్లాప్
సాక్షి, నిజామాబాద్ : తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన సైకిల్ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. మరోవైపు తెలంగాణవాదుల నుంచి ఈ యాత్రకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి రెండు కళ్ల సిద్ధాంతంతో ఇప్పటికే జిల్లాలో టీడీపీ దెబ్బతినగా.. మిగిలిన కార్యకర్తల్లో కూడా ఈ యాత్ర ఏమాత్రం ఉత్సాహన్ని నింపలేకపోతోంది. టీడీపీలో ఇటీవలే తెరపైకి వచ్చిన మదన్మోహన్రావు చేపట్టిన సైకిల్‌యాత్ర అక్టోబర్ 28న మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మీదుగా బిచ్కుంద మండలం వడ్లంలోకి ప్రవేశించింది. జుక్కల్ నియోజకవర్గంలో పలు మండలాల్లో ఈ యాత్రకు ఆశించిన మేరకు ప్రజాదరణలభించలేదు. ఒకటి రెండు చోట్ల మినహా బాన్సువాడ నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. నిరసనలు.. అడ్డగింతలు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో కనిపించని ఈ నేతలు ఇప్పుడు ప్రజా సమస్యల పేరుతో యాత్రలు చేపడితే ప్రజలెలా నమ్ముతారని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. బాన్సువాడ మండలం రాంపూర్ వద్ద స్థానికులు, గిరిజనులు ఆదివారం ఈ యాత్రను అడ్డుకున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీడీపీ ఇచ్చిన లేఖతోనే కేంద్రం తెలంగాణ ప్రకటించిందని చెబుతున్న నేతలు అదే చంద్రబాబుతో ఎందుకు జై తెలంగాణ అనిపించడం లేదని వారు ప్రశ్నించారు. మం గళవారం ఈ యాత్రలో పాల్గొనేందుకు బాన్సువాడకు వెళ్లిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిలకు కూడా చేదు అనుభవం ఎదురైంది. టీ ఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొనాల్సి ఉంది. కానీ తెలంగాణవాదుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం. పార్టీలో అయోమయం జిల్లాలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ యాత్రపై పార్టీ జిల్లా శాఖలో అయోమయం నెలకొంది. యాత్రను విజయవం తం చేయాలని ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పిలుపునిచ్చిన దాఖలాల్లేవు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఈ యాత్రలో పాల్గొన్నప్పటికీ.. రూరల్ ఎమ్మెల్యే మం డవ వెంకటేశ్వరరావు వంటి జిల్లా నాయకులు యాత్రకు దూరంగా ఉన్నారు. పార్టీ పరిస్థితి దయనీయం జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సైకిల్ యాత్ర సాగనున్న ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి కూడా లేకపోవడం పార్టీ దయనీయ పరిస్థితికి నిదర్శనం. కామారెడ్డి నియోజకవర్గంలో నూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండటానికీ ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య నేతలు సైతం రానున్న ఎన్నికల్లో పొటీ చేసేందుకు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. పోటీ చేయాలా వద్దా అన్న విషయాన్ని వారు తేల్చుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో కొత్తగా పార్టీలో తెరపైకి వచ్చిన మదన్మోహన్రావు జిల్లా ప్రజలకు తనను పరిచయం చేసుకోవడం కోసం పడుతున్న పాట్లలో భాగమే ఈ యాత్ర అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.