గాజులపల్లె(మహానంది),న్యూస్‌లైన్ : జిల్లాలో ఉర్దూ విద్యా బోధనను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి పర్వాలేదనిపించినా హైస్కూళ్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఉపాధ్యాయులు లేకపోగా విద్యా శిక్షకులను కూడా నియమించకుండా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా అప్పటి దాకా ఉర్దూ మీడియంలో చదువు సాగించిన విద్యార్థులు ఇతర మీడియంలోకి వెళ్లలేక, ఇదే మీడియంలో హైస్కూల్లో చదివేందుకు ఉపాధ్యాయులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె ఉన్నత పాఠశాల పరిస్థితే ఇందుకు నిదర్శనం.
ఈ స్కూల్లో మూడేళ్లుగా ఉపాధ్యాయులు లేకపోయినా జిల్లా అధికారులు ఏ మాత్రం స్పందించడంలేదు. ఫలితంగా విద్యార్థులు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు చదివేందుకు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది. కొందరు ఇతర మీడియంలోకి వెళ్తున్న అక్కడ ఇమడలేకపోతున్నారు. అప్పటిదాకా నేర్చుకున్న ఉర్దూను పూర్తిగా మరిచిపోతున్నారు. జిల్లా అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకున్నా పట్టించకునే నాథుడు లేకపోవడంతో విద్యార్థులు నిత్యం పాఠశాలకు వెళ్లి సాయంత్రం వరకు కూర్చొని తిరిగి ఇంటికి వస్తున్నారు.
స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటు
20-07-1944లో ఏర్పాటైన గాజులపల్లె ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో వేలాదిగా విద్యార్థులు ఉర్దూను అభ్యసించారు. ప్రస్తుతం 1నుంచి ఐదో తరగతి వరకు 83 మంది విద్యార్థులు, వారికి ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే విద్యార్థులను ఇబ్బందులు పీడిస్తున్నాయి.
ఐదు దాటితే కష్టాలే..
ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లే సరికి టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. 2010-11, 2011-12లో ఒక వాలంటీర్‌ను, 2012-13లో డిప్యూటేషన్‌పై ఇద్దరు ఉపాధ్యాయులతో నెట్టుకొచ్చినప్పటికీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఉ పాధ్యాయులను నియమించకపోవ డం గమనార్హం. జిల్లాలో 14 ఉర్దూ హైస్కూళ్లుండగా నాలుగు మినహా మిగతా వాటి పరిస్థితి ఇదేనని తెలుస్తోంది.
చదువు మానేస్తున్న విద్యార్థులు
ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉర్దూ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 120 మందికి పైగా ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 76కు తగ్గిపోయారు. టీచర్లు లేకపోవడంతో కొందరు చదువు మానేస్తుండగా మరికొందరు ఇతర మీడియంలోకి వెళ్తున్నారు. విషయంపై ఎంఈఓ జయమ్మ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలున్న దృష్ట్యా పదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని తెలిపారు.
ఎలిమెంటరీ దాటితే ఇంటికే!
Published Sat, Dec 21 2013 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement