gajulapalli
-
పట్టాలెక్కని సౌకర్యాలు
సాక్షి, మహానంది(కర్నూలు) : నంద్యాల – గుంటూరు రైలు మార్గంలో గాజులపల్లె రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వసతులు కరువయ్యాయి. రైలు వచ్చే వరకు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఈ రైల్వేస్టేషన్‌కు సమీపంలో కేవలం 4 కి.మీ. దూరంలో మహానంది పుణ్యక్షేత్రం ఉండడంతో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. రోజుకు సుమారు 2 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ రైల్వే శాఖ అధికారులు రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి వెళ్లేందుకు సమీప గ్రామాల వారు అధిక సంఖ్యలో ఈ స్టేషన్ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. గాజులపల్లె స్టేషన్ నుంచి చలమ, పచ్చర్ల, కృష్ణంశెట్టిపల్లె, గిద్దలూరు తదితర స్టేషన్ల మీదుగా విజయవాడకు వెళ్లేందుకు సమీప గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు మహానంది పుణ్యక్షేత్రం దగ్గరగా ఉండడంతో అటు విజయవాడ నుంచి, ఇటు గుంతకల్లు వైపు నుంచి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. కాని ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గతంలో డీఆర్ఎంగా ఆనంద్మాథూర్ విధులు నిర్వహించే సమయంలో సుమారు రూ.16 లక్షలతో షెడ్లు, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కాని అవి నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో భక్తులు, ప్రయాణికులు మండుటెండల్లోనే రైళ్లకోసం వేచి చూడాల్సి వస్తోంది. మహానంది స్టేషన్‌గా పేరు మార్పు ఎప్పుడు? గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా పేరు మార్చాలని, దీని ద్వారా మహానంది పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని అధికారులు కొన్నేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మహానంది దేవస్థానం ఈఓ సుబ్రమణ్యం, వేదపండితులు రవిశంకర అవధాని, అధికారులు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కలిసి గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా మార్పు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశంలో చర్చించడంతో పాటు రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారని దేవస్థానం అధికారులకు తెలిపారు. ఈ సారైనా ఎంపీ చొరవతో మహానంది ఫుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా పేరు వస్తుందని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
మంత్రి అఖిల ప్రియ ఆధ్వర్యంలో అక్రమ తవ్వకాలు..
సాక్షి, కర్నూలు : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో అక్రమంగా చేపడుతున్న ఎర్రమట్టి తవ్వకాలను ప్రజలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో మంత్రి అఖిల ప్రియ ఆధ్వర్యంలో చేపట్టిన అక్రమ తవ్వకాలను గ్రామ నాయకులు, రైతులు అడ్డుకున్నారు. సుమారు 500 మంది రైతులు చెరువు వద్దకు చేరుకుని తవ్వకాలు జరుపుతున్న జేసీబీ, ప్రొక్లెయిన్లను, టిప్పర్లను వెనక్కు పంపారు. అనంతరం అక్రమ తవ్వకాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులను, నాయకులను వెనక్కి పంపించారు. అయితే మంత్రి అఖిల ప్రియ పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. -
ఎలిమెంటరీ దాటితే ఇంటికే!
గాజులపల్లె(మహానంది),న్యూస్‌లైన్ : జిల్లాలో ఉర్దూ విద్యా బోధనను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి పర్వాలేదనిపించినా హైస్కూళ్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఉపాధ్యాయులు లేకపోగా విద్యా శిక్షకులను కూడా నియమించకుండా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా అప్పటి దాకా ఉర్దూ మీడియంలో చదువు సాగించిన విద్యార్థులు ఇతర మీడియంలోకి వెళ్లలేక, ఇదే మీడియంలో హైస్కూల్లో చదివేందుకు ఉపాధ్యాయులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె ఉన్నత పాఠశాల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఈ స్కూల్లో మూడేళ్లుగా ఉపాధ్యాయులు లేకపోయినా జిల్లా అధికారులు ఏ మాత్రం స్పందించడంలేదు. ఫలితంగా విద్యార్థులు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు చదివేందుకు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది. కొందరు ఇతర మీడియంలోకి వెళ్తున్న అక్కడ ఇమడలేకపోతున్నారు. అప్పటిదాకా నేర్చుకున్న ఉర్దూను పూర్తిగా మరిచిపోతున్నారు. జిల్లా అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకున్నా పట్టించకునే నాథుడు లేకపోవడంతో విద్యార్థులు నిత్యం పాఠశాలకు వెళ్లి సాయంత్రం వరకు కూర్చొని తిరిగి ఇంటికి వస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటు 20-07-1944లో ఏర్పాటైన గాజులపల్లె ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో వేలాదిగా విద్యార్థులు ఉర్దూను అభ్యసించారు. ప్రస్తుతం 1నుంచి ఐదో తరగతి వరకు 83 మంది విద్యార్థులు, వారికి ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే విద్యార్థులను ఇబ్బందులు పీడిస్తున్నాయి. ఐదు దాటితే కష్టాలే.. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లే సరికి టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. 2010-11, 2011-12లో ఒక వాలంటీర్‌ను, 2012-13లో డిప్యూటేషన్‌పై ఇద్దరు ఉపాధ్యాయులతో నెట్టుకొచ్చినప్పటికీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఉ పాధ్యాయులను నియమించకపోవ డం గమనార్హం. జిల్లాలో 14 ఉర్దూ హైస్కూళ్లుండగా నాలుగు మినహా మిగతా వాటి పరిస్థితి ఇదేనని తెలుస్తోంది. చదువు మానేస్తున్న విద్యార్థులు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉర్దూ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 120 మందికి పైగా ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 76కు తగ్గిపోయారు. టీచర్లు లేకపోవడంతో కొందరు చదువు మానేస్తుండగా మరికొందరు ఇతర మీడియంలోకి వెళ్తున్నారు. విషయంపై ఎంఈఓ జయమ్మ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలున్న దృష్ట్యా పదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని తెలిపారు.