ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తల్లిదండ్రుల ‘ఆధార్’ తప్పనిసరి
ఇద్దరి ఆధార్ నంబర్లు ఉంటేనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్
ఆందోళనలో 9 వేల మంది విద్యార్థులు
తిరుపతి తుడా : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. జిల్లాలో దాదాపుగా 9 వేల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నోచుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. దీనికి కారణం వీరికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరో లేదా ఇద్దరూ లేకపోవడమే!
అందరికీ ఉన్నత విద్య అందాలని, ముఖ్యంగా పేదలను, తల్లిదండ్రులు లేని విద్యార్థులను ఆదుకోవాలనే సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. తల్లీ.. తండ్రీ లేని విద్యార్థులకు ఇప్పటి వరకు వరంగా ఉన్న ఈ రీయింబర్స్‌మెంట్ ఇక వారికి అందే అవకాశం లేకుండా పోతోంది. ప్రభుత్వ నిర్ణయంతో వీరికి ఉన్నత చదువులు అందని ద్రాక్షగా మారేలా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లనుఖచ్చితంగా పొందుపరచాలి. అన్ని సర్టిఫికెట్లు ఉన్నా తల్లి లేదా తండ్రి ఆధార్ నెంబర్‌ను పొందుపరచకుంటే ఆన్‌లైన్లో దరఖాస్తు అప్‌లోడ్ కావడం లేదు. విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో తల్లిదండ్రులు లేని విద్యార్థులు దాదాపుగా 9 వేల మందికిపైగా ఉన్నారు.
వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే కావడం గమనార్హం. వీరందరికీ కూడా ఫీజురీయింబర్స్‌మెంట్ అయ్యే అవకాశం లేదు. ఇలాంటి విద్యార్థులు రోజూ మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్దల అండలేని ఈ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అయ్యేలా చూడాల్సి ఉంది.
రీయింబర్స్‌మెంట్ గడువు పెంపు
ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువును పెంచుతూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌ఎస్.రావత్ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 8 వ తేదీవరకు గడువును పెంచారు. విద్యాశాఖ నిర్ణయం విద్యార్థులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. రీయింబర్స్‌మెంట్ గడువు నవంబర్ 30తో ముగిసింది. జిల్లాలో 9760 మంది విద్యార్థులు రీయింబర్స్‌మెంట్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా రీయింబర్స్‌మెం ట్ కోసం 6 వేల మంది మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా సుమారు 9 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
అమ్మానాన్న లేరా.... అయితే.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నో!
Published Mon, Dec 1 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement