సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌కు అనారోగ్యం పట్టుకుంది. నెల రోజులుగా ఆ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై హైదరాబాద్‌లో వైద్య విద్యా సంచాలకుడి (డీఎంఈ)కి ఫిర్యాదు చేశామని, అయినా స్పందన లేదని పలువురు వైద్య విద్యార్థులు, అధ్యాపకులు చెబుతున్నారు.
అది తమ పరిధిలో లేదని, విజయవాడ వెళ్లి యూనివర్సిటీలో కనుక్కోవాలని డీఎంఈ సూచించారని వారు పేర్కొంటున్నారు. సాధారణంగా వర్సిటీ పరిధిలో అడ్మిషన్లు, ఫలితాలు, కౌన్సెలింగ్ తదితర వివరాలన్నీ వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంటాయి. ఇటీవలే వర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్‌తో పాటు ఎన్‌ఆర్‌ఐ, యాజమాన్య కోటా సీట్ల భర్తీ కూడా జరిగింది. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
ముఖ్యంగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో సీట్ మ్యాట్రిక్స్ విధానంలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి? ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి? తదితర సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో ఉంచాలి. కానీ, ఆ సమాచారం తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా www.ntrhus.ap.nic.in వెబ్‌సైట్ పనిచేయలేదు. దీనిపై యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లకు ఫిర్యాదులు అందినా స్పందన కరువయింది. కాగా.. నెల రోజులుగా ఎంత ప్రయత్నించినా వెబ్‌సైట్ పనిచేయలేదని.. దీనిపై డీఎంఈకి, వీసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర గవర్నర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని ఒంగోలుకు చెందిన రాజశేఖర్ అనే ఈ-సేవా కేంద్రం నిర్వాహకుడు తెలిపారు.