వడివడిగా.. ‘కొవ్వాడ’!
శ్రీకాకుళం పాత బస్టాండ్: స్థానికులు ఎంత వద్దని మొత్తుకుంటున్నా కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ పనులను ప్రభుత్వం తన మానాన తను చేసుకుంటూ పోతోంది. క్షేత్రస్థాయికి వెళ్లకుండా జిల్లా కేంద్రం నుంచే చేయాల్సిన పనులను చకచకా చేసేస్తోంది. భూ సేకరణకు సంబంధించి మంగళవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ హోటల్లో సర్వేయర్లకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమం దీన్నే స్పష్టం చేస్తోంది. రెవెన్యూ అధికారులు కాకుండా న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌పీసీసీఎల్ ప్రతినిధులు దీన్ని నిర్వహించడం విశేషం. అణుపార్కును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులకు దీనిపై ఎటువంటి సమాచారం లేకపోగా.. వారికి తెలియకుండానే భూసేకరణ, ఆర్‌ఆర్ ప్యాకేజీలు వంటి సన్నాహాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. రణస్టలం మండలం సముద్ర తీర గ్రామమైన కొవ్వాడ సమీపంలో అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి మూడేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది, దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు జీవోలు జారీ చేశాయి.
కొవ్వాడ చుట్టుపక్కల 5 గ్రామాల పరిధిలో 1900 ఎకరాల భూములు సేకరించాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 270, 276 నెంబర్లతో రెండు జీవోలు జారీ చేసింది. శ్రీకాకుళం భూసేకరణ యూనిట్ ఏర్పాటు చేశారు. అలాగే ప్లాంటుకు అవసరమైన నాగావళి నది నుంచి తరలించేందుకు కూడా జీవో నెం.53 ద్వారా వీలు కల్పించారు. ఇన్ని పనులు జరిగిపోతున్నా భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం జరపలేదు. మరోవైపు స్థానికులు ఈ విద్యుత్ ప్లాంటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. పలుమార్లు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు, పాలకులకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వం చాప కింద నీరులా సన్నాహాలు చేసుకుంటూ పోతోంది. ప్రజల వ్యతిరేకత గమనించి క్షేత్రస్థాయికి వెళ్లకుండానే పనులు జరిగేలా చూస్తున్నారు.
తాజాగా భూసేకరణ పనులను సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా జియోగ్రాఫికల్ విధానంలో చేపట్టడంపై సుమారు వందమంది సర్వేయర్లకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ టోటల్ స్టేటస్(ఈటీఎస్)గా పేర్కొంటున్న ఈ విధానంలో వినియోగించే పరికరాలతో ఒకేచోటు నుంచి ఆరు కిలోమీటర్ల పరిధిలోని భూములను సర్వే చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రత్యక్షంగా అన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. ఢిల్లీకి చెందిన జాంక్ సంస్థ ప్రతినిధులు అంగద్ భాటియా, మోజా భాటియా ఈ విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అదనపు చీఫ్ ఇంజినీర్ పి.బంగారయ్య శెట్టి శిక్షణ ఇచ్చారు.