లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేశామంటున్న సర్కారీ లెక్కలు
రైతుల వద్ద ఇప్పటికీ భారీగా ఉన్న నిల్వలు
కొనుగోలు కేంద్రాల తీరు నామమాత్రం
మిల్లర్ల ఇష్టారాజ్యంగా సాగిన వ్యాపారం
ధాన్యం మార్కెట్‌లో మాయాజాలం
జిల్లాలో అధికారులు చెప్పే ధాన్యం కొనుగోలు లెక్కలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. దాదాపు ఉత్పత్తయిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేశామంటున్నారు. సర్కారు ప్రకటించిన కరవు మండలాలు పద్దెనిమిది. మరోపక్క కేంద్రాలు ప్రారంభించి రోజులు గడిచినా కొనుగోళ్లు ముమ్మరంగా జరగలేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ రైతుల వద్ద ధాన్యం నిల్వలు దైన్యంగా మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా కొనుగోలు చేశామని అధికారులు చూపిస్తున్న లెక్కలు విస్తుపోయేలా చేస్తున్నాయి.
శ్రీకాకుళం టౌన్ : జిల్లాలో కరవు మండలాలు 18. వర్షాలు సకాలంలో కురవక నీటి ఇంజిన్లు.. బోర్లు సహాయంతో రైతులు పండించిన ధాన్యం 6.57లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో 5.80లక్షల మెట్రిక్ టన్నులు కొనేశామంటోంది పౌరసరఫరాల సంస్థ. 4.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించిన అధికారులు భారీఎత్తున ఎలా కొనుగోలు చేశారనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 2,05,030 హెక్టార్ల వరి సాగు విస్తీర్ణం ఉంది. అకాల వర్షాల కారణంగా 1.95247హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి.
వంశధార, నాగావళి, మడ్డువలస ఆయుకట్టులతో పాటు బోర్లు ఇతర వాగుల సాయంతో కష్టమీద వరి సాగయింది. హెక్టారుకు 3.370 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని రైతులు కంట చూశారు. ఈ లెక్కన 6,57,982 మెట్రిక్ టన్నులు ఉత్పత్తయ్యాయి. రైతులు వ్యక్తిగత అవసరాలకు 1.32లక్షల మెట్రిక్ టన్నులు ఏటా వారి వద్ద నిల్వచేసుకుంటారు. మిగిలిన 5.26లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఇందుకోసం 119 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేసింది.
మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు
కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగానే సాగాయి. ఈ కేంద్రాల చాటున మిల్లర్లు యథేచ్ఛగా ఒడిశానుంచి ధాన్యం కొనుగోలు చేయడంతో ఇవి నామమాత్రమయ్యాయి. వీటి ద్వారా 4,20,705 మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించిన అధికారులు మౌనం దాల్చారు. దీంతో మిల్లర్లు ఒడిశా నుంచి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసి స్ధానికంగా రైతులకు ఇబ్బందులు తెచ్చి పెట్టారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందకుండా పోయింది. కామన్ రకం రూ.1410 గ్రేడ్ ఏ రూ.1450 వంతున మద్దతు ధర ప్రకటించినప్పటికి రైతుల నుంచి మిల్లర్లు కుంటి సాకులతో అదనపు ధాన్యాన్ని సేకరించారు. తడి, మట్టి శాతం చూపించి అడ్డగోలుగా ధర తగ్గించేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3.5లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినా లెక్కలు మాత్రం 5.80లక్షల మెట్రిక్ టన్నులని చెబుతున్నారు. జిల్లాలో ఉత్పత్తి అయిన దానికంటే మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం అధికంగా చూపిస్తున్నారు.
ఈ ధాన్యం ఇక్కడి మిల్లింగుకు అవకాశం ఉండడం లేదని, ఆడిస్తే బియ్యం కంటే నూకలే అధికంగా వస్తున్నాయని మిల్లర్లు సాకుగా చూపించి ఒడిశాపై మక్కువ చూపుతున్నారు. ఇప్పటికీ అడ్డదారుల్లో ధాన్యం మిల్లులకు చేరుతున్నాయి. వాస్తవానికి రైతుల వద్దే భారీగా నిల్వలు ఉండి పోయాయి. ఎవరు కొంటారోనని వారు ఎదురు చూస్తున్నారు. కళ్లంలో కొనుగోలుచేశామని లెక్కలు చూపుతున్నా నూర్పులు ఆలస్యమైన దాన్యం ఏమై నట్టని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడిధాన్యం అక్కడే ఉన్నా లక్ష్యం పూర్తయిందని పౌరసరఫరాలసంస్థ లెక్కలు చూపుతోందని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే రెండునెలలపాటు కేంద్రాల నిర్వహణకు భారీగానే అధికారులు ఖర్చును చూపిస్తున్నారు.
ఈ లెక్కలు ఎ‘వరి’ కోసం
Published Wed, Mar 9 2016 12:27 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement