సాక్షి, విశాఖపట్నం : సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ ఓ వృద్ధురాలు తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాలు... చోడవరం దరి భోగాపురానికి చెందిన ఆడారి కన్నంనాయుడు భార్య పిల్లలతో కలసి లంకెలపాలెంలో నివసిస్తున్నాడు. కూలిపనులు చేసుకుంటూ ఆ కుటుంబం బతుకుతోంది. కన్నంనాయుడు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మరణించిన భర్త కన్నంనాయుడి ఆత్మశాంతి కోసం బుధవారం మూలన కొత్త బట్టలు పెట్టడానికి భార్య మంగతల్లి (65), కుమారులు నాగార్జున, బంగారు నాయుడు నిర్ణయించారు.
ఈ మేరకు ముత్యాలమ్మపాలెం సముద్రంలో మైలస్నానం చేయడానికంటూ శనివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలపై తల్లీకొడుకులు వచ్చి స్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణమయ్యారు. వెంకటపతిపాలెం దాటిన తరువాత కొట్టుమసేను మిల్లు వద్ద వాహనం వెనుక కూర్చున్న మంగతల్లి జారి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తల వెనుకవైపు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళ్లముందే తల్లి మృతి చెందడంతో కుమారులు కన్నీరుమున్నీరు అయ్యారు. మంగతల్లికి ఒక కుమార్తె కూడా ఉంది. కాగా..ప్రమాదంపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment