Paravada
-
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ.. ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీక్
సాక్షి,అనకాపల్లి : జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీకయ్యాయి. ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీకవ్వడంతో ఎనిమిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. -
సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ పరలోకానికి
సాక్షి, విశాఖపట్నం : సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ ఓ వృద్ధురాలు తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాలు... చోడవరం దరి భోగాపురానికి చెందిన ఆడారి కన్నంనాయుడు భార్య పిల్లలతో కలసి లంకెలపాలెంలో నివసిస్తున్నాడు. కూలిపనులు చేసుకుంటూ ఆ కుటుంబం బతుకుతోంది. కన్నంనాయుడు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మరణించిన భర్త కన్నంనాయుడి ఆత్మశాంతి కోసం బుధవారం మూలన కొత్త బట్టలు పెట్టడానికి భార్య మంగతల్లి (65), కుమారులు నాగార్జున, బంగారు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు ముత్యాలమ్మపాలెం సముద్రంలో మైలస్నానం చేయడానికంటూ శనివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలపై తల్లీకొడుకులు వచ్చి స్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణమయ్యారు. వెంకటపతిపాలెం దాటిన తరువాత కొట్టుమసేను మిల్లు వద్ద వాహనం వెనుక కూర్చున్న మంగతల్లి జారి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తల వెనుకవైపు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళ్లముందే తల్లి మృతి చెందడంతో కుమారులు కన్నీరుమున్నీరు అయ్యారు. మంగతల్లికి ఒక కుమార్తె కూడా ఉంది. కాగా..ప్రమాదంపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
పరవాడలో బీకే టీఎంటీ స్టీల్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పరవాడలో బీకే గ్రూప్ నిర్మించిన టీఎంటీ స్టీల్ బార్ల తయారీ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం ఈ ప్లాంట్ను లాంఛనంగా ప్రారంభించారు. పారిశ్రామికవేత్త కంటిపూడి సర్వారాయుడుతో బీకే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు వికాస్ బన్సాల్, మానవ్ బన్సాల్లు ప్రారంభోత్సవం చేయించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తమకు స్టీల్ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పరవాడలో ఎఫ్ఈ 500డి టీఎంటీ ప్లాంట్ను నెలకొల్పామన్నారు. దీనికి సుమారు రూ.75 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఇది రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగంలోనే అతి పెద్ద ప్లాంట్ అని వివరించారు. దీంతో తమ బీకే గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.800 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. తమ ప్లాంట్లో 8 నుంచి 40 ఎంఎం సైజ్ వరకు టీఎంటీ బార్ల ఉత్పత్తి జరుగుతుందన్నారు. బీకే ప్లాంట్ల స్టీల్ ఉత్పత్తులను మెక్సికో, న్యూజి లాండ్, కెనడా, ఇంగ్లండ్, సౌదీ అరేబియా, బెహ్రయిన్, ఖతార్, యూఏఈ, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో మార్కెటింగ్ చేస్తున్నామని తెలిపారు.