= పై- లీన్ పెను తుపానుపై కలవరం
= సర్వ సన్నద్ధమైన జిల్లా యంత్రాంగం
= లోతట్టు ప్రాంతవాసుల తరలింపునకు ఏర్పాట్లు
= రంగంలోకి ఆర్మీ, విపత్తు నివారణ బృందం
అనకాపల్లి, న్యూస్‌లైన్: ముంచుకొస్తున్న తుఫాన్ అన్నదాతపై పగ పట్టినట్టు కనిపిస్తోంది. పై-లీన్ వ్యవసాయదారుల్ని వణికిస్తోంది. వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలతో, అధికారుల అప్రమత్తతతో కర్షకుడి మనసు కీడును శంకిస్తోంది. ఇప్పటికే కలసిరాని వాతావరణంతో వరికి ఎదురుదెబ్బలు తగిలిన పరిస్థితుల్లో, తుఫాన్ కారణంగా ఉన్న కొద్ది పాటి ఆశ కూడా మట్టిపాలయ్యేట్టు కనిపిస్తోది.
గత రెండేళ్లలో జల్, నీలం తుఫాన్ల కారణంగా కలిగిన నష్టం ఇంకా వెంటాడుతోంది. ఇప్పుడు పై-లీన్ రూపంలో పెను తుఫాన్ భయపెడుతోంది. ఈ ఏడాది రుతుపవనాలు మొదట అనుకూలించి తర్వాత ముఖం చాటేశాయి. మైదాన ప్రాంతంలో సకాలంలో నాట్లు పడలేదు. జిల్లాలో ఖరీఫ్ 1.72 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. అనధికార లెక్కల ప్రకారం 84,487 హెక్టార్లలో వరిపంట సాగవుతోంది. మైదానంలో పిలకల దశలో ఉంది. మన్యంలో ఖరీఫ్ ప్రారంభంలో వరినాట్లు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం పంట పొట్టదశ దాటి కంకులు బయటకు వస్తున్నాయి.
కానీ ముసురు కారణంగా తెగుళ్లు విజృంభిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుచ్చెయ్యపేట మండలంలో పెదకట్టు చెరువు, గుర్రపుగెడ్డలకు గండ్లుపడి లోపూడి, లూలూరు, శింగవరం, బంగారుమెట్ట, ఎల్.బి.పురం, పొట్టిదొరపాలెం, గ్రామాల్లో 150 ఎకరాల వరి పూర్తిగా మునిగిపోయింది. మాకవరపాలెం ప్రాంతంలో పొడతెగులు, ఆకుముడత, అగ్గితెగులు ఆశించింది. మండలంలోని అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
తెగుళ్ల వల్ల, ఎరువుల కొరత వల్ల కలిగిన నష్టాలకు ఇప్పుడు తుఫాన్ కష్టాలు తోడైతే సమస్య జటిలమవుతుందన్న భయం వెంటాడుతోంది. అప్పుతెచ్చి మదుపు పెట్టిన పంట ఎక్కడ కొట్టుకుపోతుందోనన్న కలత వణికిస్తోంది. వరిపొలాల్లో అయిదు రోజులకు పైబడి నీరు నిలిస్తే పొట్టదశలో ఉన్న పంటకు 20 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. వారం రోజులు పైబడి నీరు నిలిస్తే మిగిలిన పంటకూ నష్టం వాటిల్లుతుంది. పెద్ద ఎత్తున గాలులు వీస్తే చెరకు నేలకొరుగుతుంది. వర్షాలు తీవ్రంగా పడితేమినుము, పెసలు పంటలపై ఆశలు వదులు కోవాల్సిందే.
తీవ్రత బట్టి నష్టం
పై-లీన్ తుఫాన్ తీవ్రతను బట్టి పంటలకు నష్టం ఉంటుందని జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సి.వి. రామారావు అంచనా వేస్తున్నారు. నదులు, రిజర్వాయర్లలో నీరు ముంచెత్తితే వరికి నష్టం తప్పదని తెలిపారు. పెనుగాలి వీచే అవకాశమున్నందున రైతులు తక్షణం చెరకు పంటకు జడచుట్టు వేసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించిన మీదట అనుకూలంగా ఉన్న పంటలను వేసుకోవాలని చెప్పారు.
అలకల్లోలం
Published Sat, Oct 12 2013 3:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement