బస్సు ఒకటి .. 170 మంది ప్రయాణికులు
Published Tue, Dec 17 2013 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
బొత్తలపాలెం (దామరచర్ల), న్యూస్‌లైన్ :బొత్తలపాలెం శివారులో ప్రారంభించిన మోడల్ స్కూల్‌కు ఆది నుంచి సమస్యలు ముసురుకుంటున్నాయి. స్కూల్‌ను మండలకేంద్రంలో కాకుండా బొత్తలపాలెం, రాళ్లవాగుతండకు మధ్య ఏ స్టేజీ లేని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలోనిర్మించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల రాకపోకలు జరిగే మార్గం ప్రభుత్వం చూపలేదు. రోడ్డున కనీసం ఆర్టీసీ బస్సు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో మిర్యాలగూడ డిపో మేనేజర్‌కు బస్సు నడిపించాలని ఆయన ఆదేశించారు. నెల రోజులు ఆలస్యంగా స్కూల్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసు నడిపిస్తున్నారు.
నరకం చూపుతున్న
మోడల్ స్కూల్ రోడ్డు
బొత్తలపాలెం శివారు అద్దంకి-నార్కట్‌పల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి మోడల్ స్కూల్ వరకు ఉన్న దారి అధ్వానంగా తయారైంది. ఎనిమిది కిలోమీటర్ల ఈ రోడ్డు పై అడుగడుగునా గుంతలు పడ్డాయి. ఈ రోడ్డుపై బస్సు నడపడం సవాలుగా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు.
ఒక్క బస్సులో
180 మంది వెళ్లడం సాధ్యమా..?
అసలే గుంతలు పడిన రోడ్డు. బస్సులో ఓవర్ లోడు. ఈ ప్రయాణం నరకాన్ని మరిపిస్తున్నదని విద్యార్థులు చెబుతున్నారు.మోడల్ స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు 170 మంది, ఉపాధ్యాయులు 10 మంది, వీరంతా పలు గ్రామాల నుంచి, గిరిజన తండాల నుంచి దామరచర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడికి మిర్యాలగూడ నుంచి ఆర్టీసీ బస్సు వస్తుంది. దామరచర్ల 145 మంది, రాజగుట్టు స్టేజీ వద్ద 15 మంది అప్పటికే బస్సు నిండిపోతున్నది. బొత్తలపాలెం స్టేజీ వద్ద విద్యార్థులు బస్సు టాప్ పైకి ఎక్కడమే. రాళ్లవాగుతండా స్టేజీ వద్ద పది మంది విద్యార్థులు. నిత్యం 180 మంది స్కూల్‌కు వెళ్లే ప్రయాణం దినదిన గండంగా ఉంటున్నది. అదనపు బస్సు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
-హజరయ్య (ప్రిన్సిపాల్)
అదనపు బస్సు నడపాలని మిర్యాల గూడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కోరాం. రోడ్డు మరమ్మతు చేయించాలని పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా వారి నుంచి స్పందన లేదు. ఈ రోడ్డుపై బస్సు ప్రయాణం ప్రమాద కరంగా ఉంది.
అదనపు బస్సు నడపాలి
పాఠశాల వరకు అదనపు బస్సు నడపాలి. విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మా అమ్మాయిని బడి మాన్పిద్దామనుకున్న. అదనపు బస్సు వేస్తారని ప్రిన్సిపాల్ చెప్పడంతో ఆగిపోయా. నేటికీ అది జరగలేదు.
-బాల్చీ, విద్యార్థి తండ్రి, దామరచర్ల
ఇబ్బందిగా ఉంది
కిక్కిరిసిన బస్సులో నిత్యం పాఠశాలకు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంది. బస్సులో రోజూ తొక్కిస లాట జరుగుతుంది. ప్రయాణం నరకయాతనగా మారింది. అధికారులు స్పందించాలి. అదనపు బస్సు వేయాలి.
-త్రివేణి, విద్యార్థిని, దామరచర్ల
Advertisement
Advertisement