పదో తరగతి పరీక్షల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రథమస్థానం నిలబెట్టుకునే విషయమై సందేహాలు నెలకొన్నాయి.
మార్చి 26 నుంచి టెన్త్ పరీక్షలు
రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధనపై అనుమానాలు
గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిల్చిన జిల్లా
అప్పట్లో మాస్ కాపీయింగ్‌పై ఆరోపణలు
పకడ్బందీగా పరీక్షలు జరపాలని తాజా ఆదేశాలు
{పపంచకప్ క్రికెట్ ప్రభావం పడనుందని ఆందోళన
అమలాపురం : పదో తరగతి పరీక్షల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రథమస్థానం నిలబెట్టుకునే విషయమై సందేహాలు నెలకొన్నాయి. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో టెన్త్ పరీక్ష ఫలితాల పరంగా తూర్పుగోదావరి జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఈసారి కూడా ఇదే ఫలితం రావాలని ఆశించడం సహజం. పైగా రాష్ట్ర విభజన తర్వాత, మొదటి స్థానం కోసం పోటీపడే కరీంనగర్, వరంగల్ జిల్లాలు తెలంగాణలో చేరడంతో ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరికి తిరుగులేని వాతావరణం ఉండాలి. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని ఉపాధ్యాయులంటున్నారు.
పదవ తరగతి పరీక్షలు మార్చి 26 నుంచి ఆరంభం కానున్నాయి. అంటే కేవలం నెల రోజుల మాత్రమే సమయముంది. ఈ ఏడాది 65,648 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 47,500 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, సుమారు 18 వేల మంది ప్రైవేట్‌గా రాస్తున్నారు. పరీక్షలకు నెల రోజులే సమయం ఉండడంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లోనే కాకుండా ఉపాధ్యాయుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రెండేళ్ల కిందట జరిగిన పదోతరగతి పరీక్షల్లో రాష్ట్రంలో ద్వితీయస్థానం సాధించింది. గత ఏడాది జిల్లా విద్యాశాఖాధికారిగా ఉన్న కె.శ్రీనివాసులురెడ్డి జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని తీసుకున్న కొన్ని చర్యలు గత ఏడాది సత్ఫలితాలను ఇచ్చాయి. తొలి నుంచి జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలంటూ ఆయన విద్యార్థులను, ఉపాధ్యాయులను పరుగులు పెట్టించారు. క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లీ, ప్రీ పబ్లిక్ పరీక్షల ఫలితాల్ని ప్రమాణంగా తీసుకుని తక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదనపు తరగతుల నిర్వహణ, ఫలితాలు బాగోలేని పాఠశాలలకు దత్తత అధికారుల నియామకం వంటి చర్యలు చేపట్టారు. ఇవన్నీ ఫలించడంతో తూర్పుగోదావరి జిల్లా 95 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. అయితే ఈస్థానం కోసం పరీక్షల నిర్వహణలో నైతిక నియమావళిని గాలికొదిలేశారని, కొన్నిచోట్ల మాస్ కాపీయింగ్‌ను కూడా ప్రోత్సహించారని అప్పట్లో తీవ్ర విమర్శలు వినిపించాయి. మాస్ కాపీయింగ్‌పై చూసీచూడనట్టు వ్యవహరించాలని అప్పట్లో ఇన్విజిలేటర్లకు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లకు ఇచ్చిన అనధికార ఆదేశాల వల్లనే తూర్పుగోదావరి జిల్లా ప్రథమస్థానం సాధించిందనే ఆరోపణలు బలంగా వినిపించాయి.
కాగా ఇపుడు డీఈఓగా బాధ్యతలు చేపట్టిన నరసింహారావు ప్రథమస్థానం సాధన కోసం ఉన్న ఒత్తిడిని ఉపాధ్యాయులపై పడనివ్వడంలేదు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ నిరుడు మోసినంత ఒత్తిడి లేదు. గత అనుభవాల దృష్ట్యా ఫలితాలతో సంబంధం లేకుండా ఈసారి మాస్ కాపీయింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని డీఈఓ స్పష్టం చేయడం ఉపాధ్యాయులకు కలవరం కలిగిస్తోంది. పరీక్షలు పకడ్బందీగా జరిగితే జిల్లాకు ప్రథమస్థానం రావడం కష్టమేనని ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు. ఈ ఏడాది సిలబస్ కొత్తది కాగా పరీక్షలు పాతవిధానంలో జరుగుతుండడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. దీనికితోడు పరీక్షల ముందు ప్రపంచకప్ క్రికెట్ షెడ్యూలు రావడంతో, విద్యార్థుల చదువుకు ఆటంకం తప్పదనిఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.