వేడుకగా శ్రీవారి పారువేట
తిరుమలలో గురువారం పారువేట ఉత్సవం కనులపండువలా నిర్వహించారు. శ్రీనివాసుడు పంచాయుధాలైన శంఖు, చక్ర, గద, ధనుః, ఖడ్గాన్ని ధరించి సంక్రాంతి మరునాడు వచ్చే కనుమరోజు వన విహారం వెళ్లి మృగాలను వేటాడి విజయగర్వంతో తిరిగిరావడమే ఈ ఉత్సవ విశిష్టత. డాలు, కత్తి, బల్లెం(ఈటె) కూడా స్వీకరించిన శ్రీనివాసుడు బంగారు పీఠంపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. మరో బంగారు పీఠంపై శ్రీకృష్ణ స్వామి సైతం ఆలయానికి మూడు మైళ్ల దూరంలోని పారువేట మంటపానికి చేరుకున్నారు. ఇక్కడ రెండు గంటలపాటు వైదిక ఆచారాలు, అన్నమయ్య సంకీర్తనలు, హరికథ, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తయ్యాక స్వామివారు వేటకు సన్నద్ధమయ్యారు. ఆచారం ప్రకారం కృష్ణ స్వామివారు సన్నిధిలో గొల్ల విడిదికి వెళ్లి వెన్నను ఆరగించారు. చివరగా శ్రీనివాసుడు, శ్రీకృష్ణ స్వామి ప్రత్యేక హారతులు అందుకుని భక్తులకు దర్శనమిస్తూ ఆలయానికి చేరుకున్నారు.
వినోదభరితంగా ప్రణయ కలహోత్సవం
శ్రీదేవి, భూదేవి అయిన తాయార్లు, మలయప్ప మధ్య ప్రణయకలహోత్సవం వినోద భరితంగా సాగింది. వేటకు వెళ్లి వచ్చిన శ్రీవారిని చూసి అమ్మవార్లు కోపగించడం, శాంతించాల్సిందిగా అమ్మవార్లను స్వామి ప్రార్థించడం అత్యంత భక్తిరస భరితంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారు శ్రీపీఠాన్ని అధిరోహించి ప్రదక్షిణగా, మరొక శ్రీపీఠంపై శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు అప్రదక్షిణగా ఈశాన్య దిశలోని కోనేటి గట్టు వద్ద పరకాల మఠం వద్ద వేంచేపు చేశారు. పౌరాణికుడు స్వామివారి, దేవేరుల ప్రణయ కలహ పురాణ ఘట్టాన్ని ఆలపిస్తుండగా పరివట్టం ధరించిన జీయంగార్ అమ్మవార్ల తరఫున నిలబడి రెండు పూలబంతులను స్వామిపై విసిరారు. చివరగా జీయంగార్లు, పౌరాణికులకు శఠారీ, మర్యాదలు చేసి ఉత్సవాన్ని ముగించారు. ఇదిలాఉండగా, తిరుమల ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయం నుంచి వచ్చిన పుష్పమాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి ఆనంద నిల యంలో కొలువైన మూలమూర్తికి అలంకరించి గోదాదేవి కల్యాణం నిర్వహించారు. - సాక్షి, తిరుమల