పనితీరుకు పాతర | Patara to how they work | Sakshi
Sakshi News home page

పనితీరుకు పాతర

Published Thu, Jun 23 2016 1:14 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

Patara to how they work

జిల్లాలో దూమారం రేపుతున్న ఉద్యోగుల స్థానచలనం
రెవెన్యూలో కొనసాగుతున్న కసరత్తు
కీలక మండలాల తహసీల్దార్ పోస్టింగ్‌ల కోసం   {పజాప్రతినిధుల పట్టు
వాణిజ్య, రవాణా శాఖ బదిలీల్లో ఎన్జీవో రాష్ట్ర నేత జోక్యం
కావాల్సిన 10 మందికి కీలక ఏసీటీవో పోస్టింగ్‌లు
జిల్లా పరిషత్‌లో 163 మంది ఉద్యోగులకు బదిలీలు
మాట వినని అటవీశాఖ అధికారులకు స్థానచలనం
చక్రం తిప్పుతున్న అమాత్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు

 

విజయవాడ   జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసే అధికారులను పక్కన పెట్టి, తమకు కావాల్సిన, తమ సామాజికవర్గం వారు, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఏజెంట్‌లా పనిచేసే అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. బాగా ముట్టజెప్పడాన్ని అదనపు అర్హతగా నిర్ణయించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అమాత్యులు బదిలీల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, జిల్లా పరిషత్, వాణిజ్యపన్నులు, రవాణా, నీటి పారుదల శాఖల్లో బదిలీలపై పూర్తి దృష్టి కేంద్రీకరించి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు.

 
జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు బదిలీలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈనెల 20వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది. మూడేళ్లు పనిచేసిన వారిని రిక్వెస్ట్ బదిలీ చేయొచ్చు. జిల్లాలో దీనికి భిన్నంగా బదిలీల పర్వం సాగుతోంది. కావాల్సి ఉద్యోగి అయితే ఒకేచోట ఏడేళ్లకు పైగా పనిచేస్తున్నా పట్టించుకోవడంలేదు. జిల్లాలో కీలకమైన తహసీల్దార్ల  బదిలీల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిల్లాలో 15 మందికిపైగా తహసీల్దార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కొందరు అధికాారపార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలురైన తహసీల్లార్లకు పోస్టింగ్ ఇప్పించే పైరవీల్లో నిమగ్నమయ్యారు. మచిలీపట్నంలో కలెక్టరేట్‌లో బదిలీల ప్రహసనం సాగుతూనే ఉంది. రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలు ఎక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు తేల్చులేకపోతున్నారు.

 
అధికార పార్టీ కనుసన్నల్లోనే..

కైకలూరు నియోజకవర్గంలో మాట వినని అధికారులను మంత్రి కామినేని శ్రీనివాసరావు, అధికార పార్టీ నేతలు పట్టుబట్టి మరీ బదిలీచేయించారు. కైకలూరు, మండవల్లి పరిధిలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇక్కడ చేపల సాగు నిషిద్ధం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు, మంత్రి కామినేని అనుచరులు అక్రమంగా చేపల సాగు చేపట్టారు. దీనిని అడ్డుకున్న అటవీశాఖ రేంజర్ సునీల్‌కుమార్, తెలంగాణ కేడర్‌కు చెందిన వి.వి.ఎల్.సుభద్రాదేవిని కొద్ది నెలలకే బదిలీ చేశారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఇటీవల జరిగిన బదిలీల్లో మంత్రి, చైర్‌పర్సన్ తమకు ఇష్టం లేని ఉద్యోగులను అక్కడి నుంచి సాగనంపారు. జూనియర్ అసిస్టెంట్లు ఏడుగురు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, బిల్ కలెక్టర్లు ఐదుగురు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఒకరిని బదిలీ చేయించారు.

 
రాష్ట్ర ఎన్జీవో నేత జోక్యం

జిల్లాలోని వాణిజ్య పన్నులు, రవాణా శాఖల ఉద్యోగుల బదిలీల్లో రాష్ట్ర ఎన్జీవో సంఘ కీలక నేత చక్రం తిప్పారు. విజయవాడ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఏసీటీవోలను బదిలీలు చేయించడం వెనుక ఆ నేత పరపతితో పాటు భారీగా నగదు చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన వారిని కీలక ప్రాంతాల్లో, అధిక ఆదాయం ఉండే చోట ఏసీటీవోలుగా నియమించారు. మూడేళ్ల సర్వీసు పూర్తికానివారిని కూడా బదిలీ చేయించారు. ఇదే క్రమంలో పరపతి ఉన్న అధికారుల జోలికి వెళ్లలేదు. సదరు ఎన్జీవో నేతతో సన్నిహితంగా ఉంటూ ఇటీవల తన నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ సోదాలు ఎదుర్కొన్న అధికారి, మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఇద్దరు జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో చక్రం తిప్పారు. పరపతి లేకపోవడంతో ఏడాది కాలం పూర్తి కాని గుంటూరు, ఏలూరు అధికారులను బదిలీ చేశారు. సదరు నేత రవాణా శాఖ బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ యూనియన్ కార్యకలాపాల్లో ఉండే ఒక ఉద్యోగికి తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ జరిగింది. ఆ ఉద్యోగి బదిలీని నిలిపివేసే ప్రయత్నాల్లో ఎన్జీవో నేత ఉన్నారని సమాచారం.

 

గుంటూరులోనూ అడ్డగోలే..
గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రకియ అడ్డగోలుగా సాగుతోంది. జిల్లాలో చక్రం తిప్పే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అన్నిశాఖల బదిలీల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖ వ్యవహారాలు, బదిలీలను ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఇతర ప్రభుత్వ శాఖల వ్యవహారాలను మరో సీనియర్ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత బదిలీల్లో వారిద్దరు పూర్తిస్థాయిలో చక్రం తిప్పారు. జిల్లాలో కీలకంగా ఉన్న మంత్రి అన్ని శాఖల బదిలీల్లో కల్పించుకుని కావాల్సినవారికి కావాల్సిన పోస్టింగ్ ఇప్పించారని తెలుస్తోంది. జిల్లా పరిషత్‌లో 152 మంది ఉద్యోగులు బదిలీ అవగా 50 శాతం వరకు నిబంధలకు విరుద్ధంగానే జరిగాయి. జిల్లాలో 20 మంది తహసీల్దార్లకు స్థానచలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement