పరిశీలన పేరుతో పింఛన్ల రద్దు
రాజకీయకక్ష సాధింపుతో నిజమైన లబ్ధిదారుల తొలగింపు
అధికారులకు విన్నవించుకుంటున్నా కనికరించని వైనం
కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు... అరకొరగా మంజూరు
అర్హులైనవారిని విస్మరించారన్న విమర్శలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ :సామాజిక భద్రతా పింఛన్లు అపహాస్యంగా మారాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నిరుపేదలకు అందించే పింఛన్లను తాజాసర్కారు పరిశీలన పేరుతో వేలకొద్దీరద్దుచేయడంతో దానిపైనే ఆధారపడినవారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మనోధైర్యంగా బతికినవారంతా ఇప్పుడు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల ముందు పింఛన్ల మొత్తాన్ని వెయ్యిరూపాయలకు పెంచుతామంటూ అట్టహాసంగా ప్రకటించి.. బడుగుల్లో ఆశలు సృష్టించి... వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిందే తడువుగా పరిశీలనపేరుతో వడబోతలు మొదలు పెట్టారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కమిటీలను ఏర్పాటు చేసి వారిద్వారా తమ కార్యకర్తలందరికీ పింఛన్లు మంజూరు చేయించుకునేందుకు కుతంత్రాలు పన్నారు. తమకు అనుకూలంగా లేనివారి పేర్లను లేనిపోని కారణాలతో జాబితానుంచి తొలగించారు. దీంతో రోడ్డునపడ్డ వారంతా సర్కారు కరుణకోసం రోజూ దరఖాస్తులు చేస్తూనే ఉన్నారు. అయినా వారి జాబితా చాంతాడంత ఉన్నా పునరుద్ధరించినవారి సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. 2014 జూలై నాటికి జిల్లాలో అన్ని విభాగాల్లో పింఛనర్లు 2.92లక్షల మంది ఉండగా.. రకరకాల కారణాలతో 30,200 మంచి పేర్లను జాబితానుంచి తొలగించారు. తరువాత దఫదఫాలుగా 3,150 మంది పింఛన్లు పునరుద్ధరించారు. మిగిలినవారంతా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.
అంతా అరకొరే...
గత ఏడాది 2014 అక్టోబర్, నవంబర్‌లో జరిగిన జన్మభూమి, మాఊరు కార్యక్రమంలో జిల్లా వ్యప్తంగా జరిగిన సభల్లో పింఛన్లు కావాలని 26.906 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు తదితర కేటగిరీలవారు దరఖాస్తు చేసుకోగా, వీటిలో ఆధార్, రేషన్ కార్డు నంబర్లు సరిచేసిన తరువాత కేవలం 11,600 మందిని అర్హులుగా గుర్తించారు. అ జాబితాను మండలాలు, గ్రామాల వారీగా జన్మభూమి కమిటీలు పరిశీలించి కేవలం 8.656 మందిని మత్రమే ఎంపిక చేశారు. దీంతో అర్హులైనవారు సైతం ఆసరాను కోల్పోయారు.
వయసు తప్పు పడిందంటూ తొలగించారు
రేషన్ కార్డు, ఆధార్ కార్డుల్లో వయసు తప్పు ఉందని నాకు 9 నెలలుగా పిం ఛను ఇవ్వడం లేదు. నా వయసు 68 సం వత్సరాలు. పింఛను పునరుద్ధరణకు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను.
- చిత్రాడ శ్యామ సుందర ఆచారి, జింకిభద్ర
అన్యాయంగా తొలగించారు
నా వయసు 68 ఏళ్లు. అర్హుల జాబితాలో నా పేరును అన్యాయంగా తొలగించారు. పింఛన్ మంజూరు చేయాలని ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా వినే వారు కరువయ్యారు. ప్రభుత్వం నాలాంటి వారి పెన్షన్లు తొలగించడం అన్యాయం. తక్షణమే నా పింఛన్ ఇప్పించాలి.
- పిన్నింటి వెంకటరావు, వీరఘట్టం
కాలూ చేయీ పనిచేయదు
పనిచేద్దామంటే కాలూచేయీ ఆడదు. పక్షవాతం వచ్చి మంచాన పడ్డాను. నా అనేవారు లేరు. ఆదుకునేవారెవరూ లేరు. ఉండడానికి ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. కొద్ది రోజులు పింఛను వచ్చి ఆగిపోయింది. జాబితాలో పేరు తొలగించారు. ఇప్పుడు పూట గడవడమే కష్టంగా ఉంది. నా బాధను ఎవ్వరూ పట్టించుకోవడంలేదు.
-ఉమ్మరవల్లి మీనాక్షి, వికలాంగురాలు,
బొడ్డపాడు, పలాస మండలం
సర్కారు ఏడి్చిపంఛన్
Published Tue, Jun 2 2015 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement