ప్లాన్డ్‌గా నకిలీల సృష్టి
రిమ్స్ క్యాంపస్: టౌన్ ప్లానింగ్ అధికారులు తలచుకుంటే ఏదైనా చేయగలరు. అన్నీ సక్రమంగా ఉన్నా అందాల్సినవి అందకపోతే.. ప్లాన్లు తిరగ్గొట్టగలరు.. ఏమీ లేకపోయినా ముడుపులు అందితే చాలు మంజూరు చేసేయనూగలరూ.. శ్రీకాకుళం పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ విషయంలో మరింత ముందడుగు వేశారు. నకిలీ ప్లాన్లపై సంతకాలు గీకేసి.. మాయా మహళ్లనూ సృష్టించగలరనడానికి పట్టణంలో నిర్మించిన ఒక భవంతే నిదర్శనం. గత కమిషనర్ రామలింగేశ్వర్ హయాంలో మంజూరైన ఈ నకిలీ ప్లాన్ తయారీలో కొందరు అధికారుల హస్తం ఉండగా, మరికొం దరి సంతకాలను ఫోర్జరీ చేశారు. పట్టణంలో కొత్త వంతెన ఆవల తమ్మినేని దాలినాయుడు పేరుతో భవన నిర్మాణానికి(బిల్డింగ్ అప్రువల్ నెంబరు 32/2013) ప్లాన్ మంజురైంది. చూడ్డానికి ఇద్ది అన్నీ సక్రమంగా ఉన్న పక్కా ప్లాన్‌గా కనిపిస్తున్నప్పటికీ.. నిశితంగా పరిశీలి స్తే.. పక్కా ప్లాన్‌తో రూపొందించి నకిలీ ప్లాన్ అని తేలింది. మున్సిపల్ రికార్డుల్లో దాలినాయుడు పేరుతో ప్లాన్ మంజూరైనట్లు నమోదు కాకపోగా .. 32/2013 నెంబరుతో హనుమంతు రవికుమార్ పేరిట ప్లాన్ మంజూరైనట్లు ఉంది. ఇది ఒక ఊదాహరణ మాత్రమే. ఇటువంటివి నకిలీ ప్లాన్లు ఎన్నో ఉన్నట్టు మున్సిపల్ వర్గాలే చెబుతున్నాయి.
ముడుపులిస్తే చాలు..
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారు. సొమ్మిస్తే దేనికైనా సిద్ధమంటున్నారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు యథేచ్చగా దండుకుంటున్నారు. శ్రీకాకుళంలోని ఈ విభాగం అధికారుల్లో కొందరు నకిలీ ప్లాన్ల తయారీలో నిష్ణాతులని తెలిసింది. ఎటువంటి ధ్రువపత్రాలు లేకున్నా దర్జాగా ప్లాన్ తయారు చేసి ఇచ్చేస్తారు. ఉన్నతాధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి మరీ ప్లాన్ ఇస్తారు. వాస్తవానికి ప్లాన్ లేకుండా పట్టణంలో చాలా భవనాలు ఉన్నాయి. అయితే బ్యాంకు లోన్లు పెట్టుకోవటానికి, వివాదంలో ఉన్న స్థలం తమదని క్లెయిం చేసుకోవటానికి ప్లాన్లు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్లాన్ అవసరమైన వారు టౌన్‌ప్లానింగ్ అధికారులను కలుస్తారు. ఇవ్వాల్సిన మామూళ్లు సమర్పించుకుని నకిలీ ప్లాన్లు అందిపుచ్చుకుంటున్నారు.
ఇలా బయటపడింది
తమ్మినేని దాలినాయుడు పేరుతో మంజూరైన నకిలీ ప్లానుకు ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. మున్సిపల్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. నకిలీ ప్లాన్ ఆధారంగా సదరు యజమాని బ్యాంకు రుణం తీసుకోవడానికి సిద్ధపడ్డారు.
ఇందుకు అవసరమైన ఎన్‌వోసీ కోసం మున్సిపాలిటీకి దరఖాస్తు చేశారు. అయితే రికార్డులో ఆ నెంబర్‌తో వేరే వ్యక్తికి ప్లాను మంజూరైనట్లు ఉండటంతో దాలినాయుడు పేరుతో ఉన్నది నకిలీదని తేలింది. దాంతో ఎన్‌వోసీ ఇచ్చేందుకు కొందరు అధికారులు నిరాకరిస్తున్నారు. నకిలీ వ్యవహారంలో పాత్ర ఉన్నవారు మాత్రం ఎలాగైనా ఎన్‌వోసీ ఇప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం
బాపిరాజు, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్
టౌన్ ప్లానింగ్ విభాగంలో నకిలీ ప్లాన్లు తయారవుతున్న విషయం నా దృష్టికి రాలేదు. రికార్డులను పరిశీలించి నకిలీ ప్లాన్లు ఉన్నట్టు రుజువైతే చర్యలు చేపడతాం. నకిలీ ప్లాన్లు తయారీలో పాత్ర ఉన్న అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం.