పీఎల్‌జీఏ ప్రశాంతం
- ముగిసిన అమరవీరుల వారోత్సవాలు
- పట్టుసాధించిన పోలీసు యంత్రాంగం
- కలిసొచ్చిన ముందస్తు వ్యూహం
పాడేరు/కొయ్యూరు/జీకేవీధి : మావోయిస్టు అమరవీరుల(పీఎల్‌జీఏ)వారోత్సవాలు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ప్రశాంతంగా ఆదివారంతో ముగిశాయి. దళసభ్యులు అక్కడక్కడ స్థూపాలు ఏ ర్పాటు చేసి స్థానికులతో కలిసి అమరవీరుల కు నివాళులర్పించినప్పటికీ ఎటువంటి వి ధ్వంసకర సంఘటనలకు పాల్పడిన దాఖ లాలు లేవు. అన్ని వైపుల నుంచి పోలీసుల కూంబింగ్ ఉధృతంతో మావోయిస్టులు వారోత్సవాల నిర్వహణకు అవకాశం లేకుండాపోయింది.
గూడెంకొత్తవీధి మండలం కుంకంపూడిలో దళసభ్యులు 30 అడుగుల భారీ స్తూపం నిర్మాణ పనులు చేపట్టారు. అది పూర్తయ్యే తరుణంలోనే దళ సభ్యుడు కొర్రా సీతన్న, గాలికొండ ఏరియా కమిటీకి చెందిన మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తుగా చేపట్టిన వారి వ్యూహరచన కలిసొచ్చింది. ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, కొయ్యూరు, జి.మాడుగుల, చింతపల్లిల్లో ఎక్కడా వారోత్సవాల ఊసు లేదు. వారోత్సవాలకు ముందు నుంచే యంత్రాంగం అప్రమత్తమైంది.
మారుమూల గూడేల్లోని గిరిజనులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. మావోయిస్టులకు సహకరించొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గిరిజనులు గ్రామాలకే పరిమితమయ్యారు. జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్, నర్సీపట్నం ఓఎస్డీ ఎఆర్ దామోదర్ సైతం మావోయిస్టు ప్రభావిత పోలీసు స్టేషన్లు సందర్శించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దుల్లో బలగాలు గాలింపు చేపట్టాయి.
పకడ్బందీ ప్రణాళిక: ఎస్పీ
వారోత్సవాల భగ్నానికి పక డ్బందీ ప్రణాళికను అమలు చేసి మంచి ఫలితం సాధించామని రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఆదివారం ఫోన్‌లో సాక్షికి తెలిపారు. భారీస్థాయిలో కూంబింగ్ చేపట్టామన్నారు. ఒడిశా సరిహద్దులోనూ బలగాలు జల్లెడ పట్టాయన్నారు. వారోత్సవాలను పూర్తిగా అడ్డుకున్నామన్నారు. మావోయిస్టులకు స్థానిక గిరిజనులు ఎలాంటి సహకారం అందించలేదన్నారు. మావోయిస్టులపై వ్యతిరేకత నెలకొందని గిరిజనులంతా అభివృద్ధినే కోరుకుంటున్నారని తెలిపారు.