అధికార పార్టీ అభ్యర్థులతో కొందరు పోలీసు అధికారులు రహస్య డీల్ కుదుర్చుకున్నారా? ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అవసరమైన కోట్లాది నగదు తరలింపు బాధ్యతను తీసుకున్నారా? అందుకు ఖాకీ విధులను ఫణంగా పెట్టారా? కోట్లాది రూపాయాల డీల్‌తో నగదు తరలింపు వాహనాలకు ఎస్కార్ట్‌గా వెళ్తున్నారా? కాసుల మత్తులో ఎన్నికల చెక్‌పోస్టుల వద్ద తనిఖీ టీమ్‌లను సైతం బెదిరిస్తున్నారా? వీటన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు జిల్లా ప్రజలు. పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చగా మిగిలిపోతున్నారు కొందరు పోలీసు అధికారులు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేందుకు పని చేయాల్సిన పోలీసులు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం, ధర్మాన్ని విస్మరించి కుదుర్చుకున్న కోట్లాది రూపాయల డీల్‌తో కాసుల మత్తులో జోగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
తిరుపతి రూరల్: ఓ వైపు ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు నిష్పక్షపాతంగా విధులను నిర్వర్తిస్తున్నారు. తనిఖీలను సైతం ముమ్మరంగా చేస్తున్నారు. కొందరు ఎన్నికల కోడ్‌కు ముందే నగదును సిద్ధం చేసుకుంటే, మరికొందరు అభ్యర్థిగా ప్రకటించాక హడావుడిగా ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టులు దాటుకుని అక్రమ నగదును జిల్లాలోకి తీసుకురావడం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కష్టంగా మారింది. దీంతో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోయే కొందరు పోలీసు అధికారులకు కాసులను ఎరగా వేశారు. కోట్లలో డీల్ కుదుర్చుకున్నారు. పచ్చ నగదు తరలింపునకు పోలీసు వాహనాలనే వాడుకుంటున్నారు.
36 చెక్ పోస్టులు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు రవా ణాను, మద్యంను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 36 చెక్ పోస్టులను ఏర్పాటుచేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులతో పాటు జిల్లా నలుమూలల ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల తీరును వీడియోలు సైతం తీస్తున్నారు. ఇలా తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.11.02 కోట్ల నగదు, రూ.2.55 కోట్ల విలువైన మద్యం పట్టుకున్నారు.
ఎస్కార్ట్‌గా పోలీసు అధికారులు
కోట్లలో కుదుర్చుకున్న డీల్‌తో పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారు. కనిపించని నాలుగో సింహాన్ని కాసుల వేటకు బలిచేస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్న వాహనానికి పోలీసు కారులోనే ఎస్కార్ట్‌గా వెళ్తున్నారు. ముందుగా పోలీసు అధికారి వాహనం వెళ్తుంటే వెనుక నగదు వాహనం వస్తుంటుంది. చెక్‌పోస్టుల వద్ద ఆపితే.. ‘మా బంధువులు వాహనాన్నే ఆపుతారా?’ అంటూ కంత్రీ అధికారి కన్నెర్ర చేస్తుంటాడు. ఇదంతా కూడా ఎన్నికల సంఘం నియమించిన వీడియోల్లో సైతం రికార్డు అవుతుంది. కుప్పం, నగరి, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల్లో ఇలా బరితెగిస్తున్న అధికారులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే చంద్రగిరి, కుప్పం, చిత్తూరు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారుల వ్యవహారశైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి.
ఆ సీఐ తీరుపై సర్వత్రా విమర్శలు
భాకరాపేట కేంద్రంగా పనిచేస్తున్న పీలేరు రూరల్ సీఐ నరసింహమూర్తి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నగదు తరలింపునకు ఎస్కార్ట్‌గా వెళ్లలేదని కిందిస్థాయి సిబ్బందిని వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలోనే ఎర్రావారిపాళెం ఎస్‌ఐ కృష్ణయ్యకు సీఐకి మధ్య వాగ్వాదం జరగడం, ఎస్‌ఐని బలవంతంగా బదిలీ చేయడం, ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడం, తిరిగి ఎస్‌ఐ విధుల్లోకి రావడం అన్ని జరిగిపోయాయి. సీఐ వ్యవహారశైలి వల్ల చిత్తూరు ఎస్పీ విక్రాంత్‌పాటిల్ సైతం సంజాయిషీ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పోలీసు అధికారులే మండిపడుతున్నారు. ఇంత జరిగినా సీఐ తీరు మారలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
తాజాగా..నగదు వాహనాన్ని విడిపించుకున్న వైనం
మంగళవారం చంద్రగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఆ సభ హడావుడిలో పోలీసులు ఉండగానే చిన్నగొట్టిగల్లుకు చెందిన టీడీపీ జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి వాహనంలో తిరుపతి నుంచి నగదును తీసుకువస్తున్నారని ఎంసీసీ టీమ్‌కు సమాచారం అందింది. సాయంత్రం 6–7 గంటల సమయంలో ఎంసీసీ టీమ్ కన్వీనర్ ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లారు. దీంతో టీమ్ సభ్యులు భాకరాపేట చెక్‌పోస్టు వద్ద వీడియోగ్రాఫర్ సహా నిఘా ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారి అక్కడికి వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వాహనాన్ని చెక్ చేసేందుకు ఎంసీసీ టీమ్ ప్రయత్నించగా తనిఖీ చేయకుండానే పంపించాలని పోలీసు అధికారి హుకుం జారీ చేశారు. దగ్గరుండి సదరు ప్రజాప్రతినిధి వాహనాన్ని చెకింగ్ లేకుండానే విడిపించుకు వెళ్లాడు. ఆ అధికారి వీరంగం మొత్తం వీడియోలో రికార్డు అయింది. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment