116 నియోజకవర్గాల్లో ధన ప్రవాహం | Money distribution In 116 Constituencies | Sakshi
Sakshi News home page

116 నియోజకవర్గాల్లో ధన ప్రవాహం

Published Wed, Mar 13 2019 3:06 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Money distribution In 116 Constituencies - Sakshi

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉన్న 116 అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించామని, ఆ నియోజకవర్గాల్లో బ్యాంకు కార్యకలాపాలపై నిఘా ఉంచామని ఏపీ శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కేంద్ర బలగాలు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లలో లక్షా ఆరు వేల మంది అవసరమన్నారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బి, ఆర్‌పీఎఫ్‌ వంటి కేంద్ర సాయుధ బలగాల నుంచి 392 కంపెనీలు కోరామన్నారు. ఇప్పటికే 90 కేంద్ర బలగాలు ఏపీకి చేరుకున్నాయని, మిగిలినవి కూడా వస్తాయని వివరించారు. 45 కంపెనీల ఏపీపీఎస్‌ ఫోర్సు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ అధికారులు ఉంటారన్నారు.

మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిఘాకు డ్రోన్లు, హెలికాప్టర్లును వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 121 డ్రోన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని, సోషల్‌ మీడియాపై ప్రత్యేక బృందాల ద్వారా నిఘా పెట్టినట్టు చెప్పారు. సోషల్‌ మీడియాపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా పరిశీలిస్తామన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొనే పోలీస్‌ సిబ్బంది పక్షపాత ధోరణి అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 39,591 మందిని గుర్తించి వారిలో కొంతమందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఏపీలో 9,363 లైసెన్సులతో 10,116 ఆయుధాలున్నాయని, వాటిలో 8,500 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇతర భద్రత సంస్థల వద్ద మరో 1,485 ఆయుధాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 6,357 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు (ఎన్‌బీడబ్ల్యూ)లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 336 వారెంట్లను అమలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 1,484 గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించామని, స్థానిక పరిస్థితులను బట్టి ఆయా గ్రామాల్లో ముందు జాగ్రత్తగా 99,225 మందిని బైండోవర్‌ చేసినట్లు పేర్కొన్నారు.

డబ్బు వ్యయంపై నిఘా ఉంచేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు  
రాష్ట్రంలో 45,920 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, వాటిలో 17,671 కేంద్రాలను సాధారణమైనవి గాను, 9,345 కేంద్రాలను సమస్యాత్మకమైనవి గాను గుర్తించినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను మూడు రకాలుగా విభజించి వాటి వద్ద కేంద్ర బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ఒక ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు కేంద్ర సాయుధ బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. సీఐ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు ఒకటి చొప్పున 940 స్ట్రైకింగ్‌ ఫోర్సు టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో శాంతిభధ్రతల సమస్య ఏర్పడితే వెంటనే అక్కడికి చేరుకునేలా 249 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్సు టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. డబ్బు వ్యయంపై నిఘా ఉంచేందుకు 660 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 494 తనిఖీ కేంద్రాలు, 616 మొబైల్‌ తనిఖీ కేంద్రాల ద్వారా డబ్బు పంపిణీ, అక్రమ రవాణా తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement