నెల్లూరు (అగ్రికల్చర్) : వ్యవసాయశాఖలో బదిలీల కోసం పైరవీల జాతర ప్రారంభమైంది. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న డీడీఏలు, ఏడీఏలు, ఏఓలు, మినిస్ట్రీరియల్ సిబ్బందికి స్థానచలనం కలిగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ శాఖలో బదిలీల కోసం సోమవారం ప్రత్యేకంగా జీఓ నంబర్ 211ను జారీ చేసింది. జీఓలో కౌన్సెలింగ్ పక్రియకు భిన్నంగా జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కనుసన్నల్లో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల్లో అలజడి మొదలైంది.
అనుకూలమైన స్థానం కోసం అధికార పార్టీ నేతల సిఫారస్ ఉత్తరాల కోసం బారులు తీరుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల లేఖ ద్వారా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తెలిపితేనే కోరుకున్న స్థానం దక్కే అవకాశం ఉండటంతో పైరవీలు తప్పడం లేదని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు.
బదిలీల్లో అధికారం హవా
ఉద్యోగుల బదిలీల్లో గత విధానాన్ని పక్కనపెట్టి, అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారస్సులకు ప్రాధాన్యమివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలకు లాభం చేకూర్చేందుకే సిఫారస్ బదిలీలను తెరమీదకు తీసుకొచ్చారని, ఈ పక్రియలో పెద్దఎత్తున నగదు చేతులు మారే అవకాశం ఉందని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు తమకు నచ్చిన అధికారులను నియమించాలంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జేడీఏ కార్యాలయ సిబ్బంది కార్యాచరణ రూపొందించేందుకు మంగళవారం నుంచే కసరత్తును ప్రారంభించారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న డీడీఏలు, ఏడీఏలు, ఏఓలు, సిబ్బంది, సీనియారిటీ, రిమార్క్సు, ఇతర కారణాలతో కూడిన జాబితాను సిద్ధం చేసే పనిలో తలమునకలయ్యారు.
నేతల చుట్టూ ప్రదక్షిణలు..
ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఫెవికాల్ వీరులు తమ సీటును కాపాడుకునేందుకు పైరవీలు ప్రారంభించారు. మరి కొందరు తమకు ఇష్టమైన స్థానాన్ని దక్కించుకునేందుకు అధికారపార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు.
వీరికి స్థానచలనం తప్పనిసరి
ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఏడీఏలు, ఏఓలకు స్థానచలనం తప్పదు. సొంత జిల్లాలో పనిచేస్తున్న ఏడీఏలను ఇతర జిల్లాలకు బదిలీచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఏడీఏలకు బదిలీలు తప్పవని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారిలో ఆత్మ ఇన్‌చార్జి పీడీగా డిఫ్యూటేషన్‌పై పనిచేస్తున్న విజయభారతి, జేడీఏ కార్యాలయంలో పనిచేస్తున్న ఏడీఏలు మురళి, గయాజ్ అహ్మద్ ఉన్నారు. వీరిపై గతంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ పైరవీలు చేసి వారి స్థానాలను కాపాడుకున్నట్లు సమాచారం.
రబీ సీజన్‌లో యూరియా కొరత సమయంలో డీలర్లకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఏడీఏ మురళికి స్థానచలనం తప్పని పరిస్థితి. అదేవిధంగా సొంత జిల్లాలో పనిచేస్తున్న నెల్లూరు, పొదలకూరు, వెంకటగిరి ఏడీఏలు సత్యవాణీ, శ్రీలత, ఉషారాణిలు కూడా వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరి పైరవీరులు ఫలిస్తాయో ఈనెల 31 వరకు వేచిచూడాల్సిందే.
పైరవీల జాతర
Published Wed, May 20 2015 5:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement