మరో ఐదు శవాలకు మళ్లీ పరీక్ష
- శేషాచలం ‘ఎన్‌కౌంటర్’పై హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో తమిళనాడు కూలీల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతిమ సంస్కారాలు జరగకుండా ఇంకా మార్చురీలోనే ఉన్న మరో ఐదుగురి కూలీల మృతదేహాలకు కూడా మళ్లీ శవపరీక్ష (రీ పోస్టుమార్టం) నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల్లో చనిపోయిన కూలీ శశికుమార్ మృత దేహానికి మళ్లీ శవ పరీక్ష చేయాలని కోర్టు ఇప్పటికే ఆదేశించటం తెలిసిందే. అయితే తమ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసేందుకు ఫోరెన్సిక్ విభాగంలో నిపుణులైన డాక్టర్లు లేరని నిమ్స్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించటంతో గురువారం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొద్దిగా సవరించింది.
ఈ బాధ్యతలను ఉస్మానియా మెడికల్ కాలేజీ వైద్యులకు అప్పగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.పోలీస్ కాల్పుల పై మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాళ్ హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. మునియమ్మాళ్ ఒక్కరే హైకోర్టును ఆశ్రయించినందున శశికుమార్ మృతదేహానికి మాత్రమే మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.
లంచ్ మోషన్‌లో...
పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కూలీలు మురుగన్, మూర్తి, శివాజీ, పెరుమాళ్, మునుస్వామిల మృతదేహాలకూ మళ్లీ శవపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అభ్యర్థిస్తూ వారి భార్యలు హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ దాఖలు చేశారు. దీన్ని ధర్మాసనం స్వీకరించింది.
ఇలాగైతే అందరూ వస్తారు: అదనపు ఏజీ
దీంతో ఆ ఐదుగురి కూలీల మృతదేహాలకు సైతం రీపోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం శుక్రవారం అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు తెలిపింది. ఆయన ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఒకరి పట్ల ఒకరకంగా మిగిలిన వారి పట్ల మరో రకంగా వ్యవహరించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. హైదరాబాద్ డాక్టర్ల చేత మాత్రమే రీ పోస్టుమార్టం చేయిస్తామని పేర్కొంటూ ఈ బాధ్యతను ఉస్మానియా వైద్య కళాశాల డాక్టర్ల బృందానికి అప్పగించింది. నిపుణులైన డాక్టర్లతో బృందాన్ని ఏర్పాటు చేయాలని కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించింది.