60 ముక్కలుగా శరీరం, పరిశీలించేందుకు రెండు రోజులు
పురుషులు మాత్రమే పనిచేయగలరనే ఫోరెన్సిక్ విభాగంలో మహిళగా ఆమె రికార్డు సాధించింది. ఎంచుకున్న పనిని ఏళ్లుగా సమర్థంగా నిర్వర్తించడంతో పాటు అందమైన ప్రకృతిని తన కెమరా కన్నుతో పట్టేస్తోంది డాక్టర్ గీతారాణి గుప్తా.
మధ్యప్రదేశ్ ఫోరెన్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏకైక మహిళగానే కాదు, 32 ఏళ్ల వైద్య వృత్తిలో 9,500 మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన రికార్డు కూడా డాక్టర్ గీతారాణి గుప్తా సొంతం. 63 ఏళ్ల వయసులోనూ భోపాల్‌లోని మెడికో లీగల్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌గా విధులను నిర్వహిస్తున్నారు. మగవాళ్లే చేయగలరు అనే విభాగంలో పనిచేయడంతో పాటు, రికార్డు సృష్టించిన గీతారాణి గుప్తా ఇన్నేళ్ల వైద్యవృత్తిలో తన అనుభవాలను ఆమె ఇటీవల పంచుకున్నారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఫోరెన్సిక్ మెడిసిన్‌లో ఎం.డి చేసిన ఏకైక మహిళగా గీతారాణి పేరే ఉంటుంది. తను పుట్టి పెరిగిన వాతావరణం, ఎంచుకున్న మెడికల్ విభాగం, వృత్తి అనుభవాలతో పాటు, అభిరుచులనూ తెలియజేశారు.
కళ్ల ముందు కదలాడే కథలు
‘‘ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనే అయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. అది అంత దారుణమైనది. 60 ముక్కలుగా కట్ అయి ఉన్న ఉన్న ఒక శరీరం పోస్ట్ మార్టం కోసం షాజాపూర్ నుండి వచ్చింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, బోర్‌వెల్‌లో వేశారు హంతకులు. పోలీసులు మృతదేహాన్ని, వెలికి తీసి తరలించడానికే మూడు రోజులు పట్టింది. దీన్ని పరీక్షించడానికి నాకు రెండు రోజులు పట్టింది. నాలుగేళ్ల క్రితం, మూడు నాలుగు ముక్కలు చేసిన పుర్రె, అస్థిపంజరం తీసుకొచ్చారు. ఇది పరీక్షించడం ఓ సవాల్ అయ్యింది. పుర్రెను పరీక్షించినప్పుడు, బుల్లెట్ పుర్రెలో చిక్కుకున్నట్లు కనుక్కున్నాను. అతని కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఎన్ని కేసులు... ప్రతీ రోజూ మృతదేహాల మీద పరీక్షలే.
ఏకైక మహిళగా తొలి అడుగు
మా నాన్నగారు ఉపాధ్యాయుడు. నేను కూడా మెడికల్ కాలేజీలో లెక్చరర్ కావాలనుకున్నాను. అంతే పట్టుదలగా చదివాను. ఫోరెన్సిక్ విభాగంలో లెక్చరర్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దానికి నా వయస్సు రెండు నెలల 8 రోజులు ఎక్కువ. లెక్చరర్‌గా వెళ్లకుండా ఈ విభాగంలో చేరిపోయాను. అలా ఫోరెన్సిక్ మెడిసి¯Œ లో ఎమ్‌డి చేసిన రాష్ట్రంలో తొలి మహిళా వైద్యురాలిని అయ్యాను. పీహెచ్‌డి చేయాలనుకున్నాను. కానీ, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించడం నాకిష్టం లేదు. అందుకే, ఎంచుకున్న వృత్తిలో అలాగే కొనసాగాను.
మాటలు రాని క్షణాలు
నా మొదటి రోజు ఉద్యోగంలో నేను గమనించిన విషయం.. నోరు, ముక్కుపై క్లాత్ అడ్డుపెట్టుకొని మృతదేహాన్ని చూడటానికి ఆ కుటుంబసభ్యులు వచ్చినప్పుడు మనిషి చనిపోయాక ఇక విలువ లేదని అర్ధం చేసుకున్నాను. ఆ క్షణంలో మాటలు రాకుండా అలాగే ఉండిపోయాను. మొదటిరోజే 20 మృతదేహాలను చూశాను. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేకపోయాను. కాని నా మనస్సుకు తెల్లవార్లు బలంగా ఉండాలంటూ నాకు నేను నచ్చజెప్పుకుంటూ గడిపాను. ఇది నాకు అంతర్గత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తరువాత ఇక నేను నా విధిని నిర్వర్తిస్తున్నాను అనే అనుకున్నాను. అలా ఆ ఏడాది 20 మృతదేహాలకు పోస్టుమార్టం చేశాను. ఎంపీ మెడికల్ లీగల్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆఫీసర్‌గా 1989లో ఎంపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిపిఎస్సి) నుంచి ఎంపిక చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నా పని శవపరీక్ష. ఇదే కాకుండా మెడికో లీగల్ కేసుల పరిష్కారానికి కోర్టుకు హాజరు కావడం.
ఖాళీ సమయంలో ఫోటోగ్రఫీ..
ఫోరెన్సిక్ విభాగంలో శవపరీక్ష ఛాయాచిత్రాలను తీయిస్తూ ఉండేవాళ్లం. ఆ ఫొటోలను పరిశీలించడానికి ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ రాకేశ్ జైమిని, ప్రశాంత్ సక్సేనా ఫోటోగ్రఫీని నేర్పించారు. అలా ఫొటోగ్రఫీ నా అభిరుచిగా మారిపోయింది. నేను ఒంటరిగా ఉంటాను. కానీ, నాకు నచ్చిన అన్ని పనులు చేస్తాను. మరో నచ్చిన పని లాంగ్ డ్రైవింగ్. నా దగ్గర కారు, ల్యాప్‌టాప్, కెమెరా ఉన్నాయి. జంతువులు, పక్షుల ఫోటోలు తీయడానికి సిటీ నుంచి అడవుల వరకు దూరంగా వెళ్లిపోతాను.
ఎంపిక మనది అవ్వాలి..
నేను ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తున్నారు. పురుషు ఆధిపత్య సమాజంలో మహిళలు చోటు సంపాదిస్తున్నారు. అమ్మాయిలూ ధైర్యంగా ఉండండి. సవాళ్లను స్వీకరించి ముందుకు సాగండి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఈ ఎంపికను మీరే చేసుకోండి. ఏదో ఒక అభిరుచిని మీలో ఎప్పుడూ ఉంచుకోండి. అది మిమ్మల్ని నిరంతరం జీవించేలా చేస్తుంది’’ అని నవతరం అమ్మాయిలకు వివరిస్తారు డాక్టర్ గీతారాణి గుప్తా.