మొక్కుబడిగా.. | Probably .. | Sakshi
Sakshi News home page

మొక్కుబడిగా..

Published Sun, Oct 26 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

మొక్కుబడిగా..

మొక్కుబడిగా..

కర్నూలు(జిల్లా పరిషత్) :
 మొదటిసారిగా నిర్వహించిన కర్నూలు జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు మొక్కుబడిగా సాగాయి. ఏదైనా ప్రభుత్వ సమావేశమంటే ముందుగా అందుకు సంబంధించి అజెండా కాపీని సంబంధిత సభ్యులకు పంపిస్తారు. కానీ జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశానికి సంబంధించి అజెండా కాపీని అధికారులు కేవలం జెడ్పీ చైర్మన్‌కు మాత్రమే పంపించారు.

సమావేశాలు జరుగుతాయన్న సమాచారం మాత్రమే ఆయా కమిటీలకు చేరవేశారు. దీంతో సమావేశానికి హాజరైనా ఏం మాట్లాడాలో తెలియక, ఏం జరుగుతుందో అర్థం గాక సభ్యులు నోర్లెళ్లబెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. మొత్తంగా అన్ని స్థాయీ సంఘాల సమావేశాలను జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నీ తానై నడిపించారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ ఉన్నందున తీర్మానాలు చేయకుండానే సమావేశాలు ముగించారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు నిర్వహించారు.

స్త్రీ, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వర్క్స్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖల అభివృద్ధి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమీక్ష సందర్భంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. సొంత భవనాలు గాకుండా అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు.

కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోందని చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకిచ్చే పౌష్టికాహారం పక్కదారి పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని, పాణ్యం నియోజకవర్గంలో కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంచి 15 శాతం నిధులు స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు వెళ్తున్నాయని, ఆ డబ్బులు ఎలా ఖర్చు చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని చెప్పారు.

దుర్గాబాయి మహిళా ప్రాంగణం మేనేజర్ మాట్లాడుతూ మహిళా ప్రాంగణం భవనం పాతబడిపోయిందని, దీనికి మరమ్మతులు చేయించాలని కోరారు. డాక్టర్స్ కాలనీలో ప్రాంగణం కోసం ఐదెకరాల స్థలం కూడా ఉందని, కర్నూలు జిల్లాకు మాత్రమే ప్రాంగణం నిర్మాణం కోసం నిధులు మంజూరు కాలేదని చెప్పారు.

Advertisement
Advertisement