ఉధృతంగా విభజన వ్యతిరేక ఉద్యమం
రాష్ట విభజనకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళనలు, నిరసనలతో సీమాంధ్ర అట్టుడుకుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, ఘోరావ్లతో ఆందళనలు మిన్నంటుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవులోంది. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామీణప్రాంతాల నుంచి ఉద్యమం మూరుమూల పల్లెలకు సైతం విస్తరించింది. రాష్ట్రం సమైక్యంగా లేకుంటే తమకు భవితవ్యమే లేదనే ఆందోళనతో అన్ని కులాలు, వృత్తుల వారు స్వచ్ఛందంగా ఆందోళనలు చేపడుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు, రాజకీయపార్టీల నేతలు, మేధావులు, వివిధవర్గాల ప్రజలే కాదు.. సామాన్యజనం కూడా రోడ్లపైకి వస్తున్నారు. పిల్లా, పెద్దా, ముసలి, ముతక బేధం లేకుండా వ్యక్తిగతంగా కుటుంబాలు సైతం నిరసనదీక్షలకు దిగుతున్నాయి.
తమకు ఇబ్బంది కలుగుతున్నా సీమాంధ్ర ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. దుకాణాలు మూతపడడంతో నిత్యావసరాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. రవాణా స్తంభించడంతో ప్రయాణానికి ఆటంకాలు కలుగుతున్నాయి. కనీసం సెల్ఫోన్ అయినా మాట్లాడుకుందామంటే రీ చార్జ్ కార్డులు కూడా దొరకడం లేదు.
బ్యాంకులు మూతపడడంతో పాటు ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో జనం కష్టాలు పడుతున్నారు. పాఠశాలలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు చదువు సాగడం లేదు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజలు సమైక్య ఉద్యమానికి మద్దతు తెల్పుతున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొంటున్నారు.