రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్లకు ఆటోమెటిక్ తలుపుల ఏర్పాటు, పాల రవాణాకు ప్రత్యేక బోగీలు, ఆర్‌పీఎఫ్‌కు సెల్ సదుపాయం కూడా కల్పించలేదు. ఒడిశా నుంచి పాసింజరు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు జిల్లా మీదుగా నడుస్తున్నా ఇక్కడకు వచ్చేసరికే ఒడిశా ప్రయాణికులతో బోగీలు నిండిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జిల్లా మీదుగా వెళ్లి, వచ్చే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను ప్రజలు కోరినప్పటికీ కనీసం ఈ బడ్జెట్‌లో కూడా దాన్ని పట్టించుకోలేదు. ప్రయాణికుల కష్టాలూ తీరలేదు.
పలాస : జిల్లా ప్రజలకు ఈసారీ నిరాశే మిగిలింది. రాష్ట్ర విభజన తరువాత పూర్తిస్థాయిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో సిక్కోలుకు ఏ మాత్రం లబ్ధిచేకూరలేదు. పార్లమెంటులో గురువారం రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కనీసం ఈ ప్రాంతం ఊసే ఎత్తలేదు. సామాన్యుల బడ్జెట్ అని గొప్పలు చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మాత్రం ఎటువంటి ప్రయోజనం అదనంగా చేకూర్చలేదు. ఎప్పటిలాగే ఈసారీ మొండిచేయి చూపారు. విశాఖ కొత్త రైల్వేజోన్ ఊసే లేదు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు గల తెలుగు ప్రజలు, ప్రయాణికులు ఒడిశా అధికారుల కబందహస్తాల నుంచి బయటపడే అవకాశం లేకుండాపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ రైల్వేజోన్ కొత్తగా ఏర్పడుతుందని, పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు గల రైల్వేస్టేషన్లు విశాఖపట్నంలో కలిపితే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కలుగుతాయని జిల్లా ప్రజలు ఆశించారు.
అయితే వారి ఆశలుఅడియాసలయ్యాయి. కనీసం రైల్వేజోన్ ప్రస్తావన కూడా రాలేదు. బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి చూపించడమే కాకుండా కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా బడ్జెట్‌లో చోటు లభించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన కూడా రాలేదు. అలాగే కొత్త రైళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని ఇచ్ఛాపురం, ఆమదాలవలస (శ్రీకాకుళం జంక్షన్), పలాస రైల్వేస్టేషన్ల నుంచి రోజూ వేలాది మంది వివిధ ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణిస్తుండడం ద్వారా లక్షలాది రూపాయల ఆదాయం ఆ శాఖకు వస్తోంది. పలాస రైల్వేస్టేషన్ ఏ-గ్రేడ్‌లో ఉండడంతో రోజుకు రూ.4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ స్టేషన్‌లో కనీసం మౌలిక సదుపాయాలు నేటికీ లేవు. వ్యాపార కేంద్రం కావడం వల్ల ఇక్కడ నుంచి ఎక్కువగా జీడిపప్పు ఇతర సరుకులు రవాణా అవుతుంటాయి.
అయితే బడ్జెట్‌లో సరుకులపై రవాణా చార్జీలు మోపడం వల్ల వ్యాపారస్తులకు అదనపు భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ స్టేషన్‌లో ప్లాట్‌ఫారం పైకప్పు కూడా లేదు. మరుగుదొడ్లు, మంచినీటి సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. అలాగే ఇచ్ఛాపురం, సోంపేట, నౌపడ, ఆమదాలవలస వంటి ముఖ్యమైన రైల్వేస్టేషన్లను ఆధునీకరించి మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నా కనీసం దీన్ని కూడా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు పట్టించుకోలేదు. జిల్లాలో కొత్త రైలు లైన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించలేదు సరికదా కొత్త రైళ్లను వేయడానికి ప్రతిపాదనలు చేయలేదు. జిల్లాలో కాపలా లేని లెవెల్ క్రాసింగ్ గేట్లు చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రైవేటు కాంట్రాక్టు సిబ్బందితో నడిపిస్తున్నారు. కొన్ని చోట్ల గేట్లు కూడా లేవు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
వీటి గురించి కనీసం ప్రస్తావన లేదు. కొత్త ఫ్లైఓవరు బ్రిడ్జిల ప్రస్తావన లేదు సరికదా నిర్మాణంలో ఉన్న పలాస, బెండి ఫ్లైఓవరు బ్రిడ్జిలు నత్తనడకన సాగుతున్నాయి. ఐదేళ్లయినా ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. నౌపడ, గుణుపూర్ రైల్వే లైన్ ను అభివృద్ధి చేయాలనే విషయాన్ని కూడా పాలకులు విస్మరించారు. బడ్జెట్‌కు ముందు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ జిల్లాకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని, కొత్త రైల్వేజోన్ కోసం ఉత్తరాంధ్ర ఎంపీలతో కలిసి పోరాడి విజయం సాధిస్తామని చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. ప్రజాప్రతినిధులకు కేంద్రంలో కనీస గౌరవం లేదనడానికి సురేశ్‌ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సిక్కోలులో ఆగని ప్రభు రైలు
Published Fri, Feb 27 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement