గ్రామీణ నిరుపేద ఎస్సీ విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు 2012-13 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రాజీవ్ విద్యా దీవెనలు పథకాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది నుంచి ఎస్సీ విద్యార్థులకు, ఈ ఏడాది నుంచి ఎస్టీ విద్యార్థులకు అమలు పరచాలనేది లక్ష్యం. హాస్టళ్లలో ఉంటూ 9,10 తరగతుల్లో చదువుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు పది నెలలపాటు ప్రతినెలా రూ.300, పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.1000 ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హాస్టళ్లలో ఉండకుండా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రతినెలా రూ.100, పుస్తకాల కొనుగోళ్ల కోసం రూ.750 ఇస్తున్నట్లు తెలిపింది.
జిల్లాలోని 123 ఎస్టీ హాస్టళ్లలో సుమారు 7 వేలకు పైగా విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారు. వీరిలో గతేడాది 3,500 మంది ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 2,300 మంది పథకం ద్వారా లబ్ధిపొందారు. మిగిలిన వారికి నిరాశే ఎదురైంది. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గతేడాది 65 మంది విద్యార్థినులు ఉంటే కేవలం 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి నయాపైసా రాలేదు. పథకం కింద దరఖాస్తులో పెట్టిన నిబంధనలు.. అధికారుల తీరు విద్యార్థులనే కాదు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అసంతృప్తికి గురి చేస్తున్నాయి.
దరఖాస్తుకు అడ్డంకులు..
వార్షికాదాయం రూ.2ల క్షల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పథకానికి అర్హులు. వీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులు బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. కానీ విద్యార్థులకు జీరో అకౌంట్‌తో ఖాతా తెరిచేందుకు బ్యాంకులు ముందుకురావడం లేదు. చాలా మందికి ఆధార్‌కార్డులు అందలేదు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే టీసీలు ఇవ్వాలని ఆయా కేంద్రాలు తేల్చి చెప్తున్నారు.
ప్రధానోపాధ్యాయులు బోనోఫైడ్ సర్టిఫికెట్లు జారీ చేసినా ఫలితం లేదు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ముందుకురావడం లేదు. ఈ విషయమై మంచిర్యాలలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్వామిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు జీరో అకౌంట్‌తో ఖాతాలు తెరవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా బ్యాంకులు ముందుకురాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారన్నారు. టీసీలు లేకుండా విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పథకం విషయమై ఎస్సీ కార్పొరేషన్ డిప్యూటీ డెరైక్టర్ అంకం శంకర్‌ను అడుగగా.. పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోని వారికి డబ్బులు ఇవ్వలేదు.. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నా డబ్బులు అందకపోతే విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నీరుగారుతున్న ‘రాజీవ్ విద్యా దీవెనలు’ పథకం
Published Wed, Oct 9 2013 7:01 AM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
Advertisement
Advertisement