
సాక్షి, అమరావతి: ఏపీ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి ఎం సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన వారి జాబితాను ట pటb. ్చp. జౌఠి. జీn వెబ్‌సైట్‌లో ఉంచారు. అనంతరం సచివాలయంలో హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియ ద్వారా 2,623 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారని వెల్లడించారు. 2,723 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 3,94,384 మంది దరఖాస్తు చేశారని, వారిలో 65,575 మంది రాత పరీక్షకు అర్హత సాధించారని చెప్పారు.
వారిలో 2,623 మంది ఉత్తీర్ణత సాధించి కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారని తెలిపారు. మిగిలిన పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రాత పరీక్షల్లో పురుషుల విభాగంలో జింకా శశికుమార్ (వైఎస్సార్ జిల్లా), చల్లా సత్యనారాయణ (గుంటూరు జిల్లా), సిద్ధారెడ్డి చెన్నారెడ్డి (ప్రకాశం జిల్లా), వాడపల్లి కోటేశ్వరరావు (విజయనగరం జిల్లా) 145 మార్కులకు పైగా సాధించి ఉత్తమంగా నిలిచారని మంత్రి తెలిపారు. మహిళా విభాగంలో లక్ష్మీ ప్రియాంక (విజయనగరం జిల్లా) 138 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారని చెప్పారు. ఎంపికైన వారి సర్టిఫికెట్లు పరిశీలించిన అనంతరం శిక్షణకు పంపుతామని ఆమె చెప్పారు. భారీస్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment