కొలువులో 30 ఏళ్లే! | Retirement of those who completed 30 years of government service | Sakshi
Sakshi News home page

కొలువులో 30 ఏళ్లే!

Published Mon, Jul 31 2017 12:12 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

కొలువులో 30 ఏళ్లే! - Sakshi

కొలువులో 30 ఏళ్లే!

25వ ఏట ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే ఐదేళ్లు ముందుగానే ఇంటికి
అందుకు అనుగుణంగా పెన్షన్‌ అర్హత 33 ఏళ్ల నుంచి 30కి తగ్గింపు
- ఈ–ఆఫీస్‌ ద్వారా చకచకా కదిలిన ‘50 ఏళ్లకే ఇంటికి’ ఫైలు
 
సాక్షి, అమరావతి: పనితీరు సరిగాలేదనే సాకుతో ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపించేందుకు బాబు సర్కారు రూపొందించిన ఐదు ముసాయిదా జీవోలను లోతుగా అధ్యయనం చేసేకొద్దీ అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 30 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసుకున్న వారిని ఉద్యోగ విరమణ చేయించడం ఇందులో ఒకటి. ఉదాహరణకు రామారావు అనే యువకుడు 25వ ఏట ప్రభుత్వ కొలువులో చేరితే 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసే నాటికి అతని వయసు 55 ఏళ్లు. ఈ లెక్కన 55 ఏళ్లు నిండగానే అతన్ని ఉద్యోగ విరమణ చేయించేందుకు వీలుగా ఉద్యోగుల ఫండమెంటల్‌ రూల్స్, పెన్షన్‌ నిబంధనల్లో సవరణలు తీసుకువస్తున్నారు. ఇదే జరిగితే రామారావు నిర్దిష్ట పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు నిండకుండానే ఐదేళ్లు ముందుగానే 55 ఏళ్లకే ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. సంబంధిత అథారిటీ ప్రజా ప్రయోజనాల పేరుతో ఏ ఉద్యోగినైనా 30 సంవత్సరాల సర్వీసు పూర్తయ్యాక ఉద్యోగ విరమణ చేయించవచ్చని ఫండమెంటల్‌ రూల్స్‌ సవరణల్లో పేర్కొన్నారు.

30 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగికి మూడు నెలలు ముందు రాత పూర్వకంగా నోటీసు ఇవ్వడం లేదా మూడు నెలల వేతనం ఇచ్చేసి ఇంటికి పంపించ వచ్చని సవరణల్లో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులే పూర్తి పెన్షన్‌కు అర్హులన్న నిబంధనను 30 ఏళ్లకు తగ్గిస్తూ పెన్షన్‌ రూల్స్‌లో కూడా సవరణలు చేశారు. పరిపాలన వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఫండమెంటల్‌ రూల్స్, ఆంధ్రప్రదేశ్‌ రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌లో సవరణల పేరుతో రూపొందించిన ముసాయిదా జీవోలకు ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన (సర్వీసెస్‌) శాఖలు ఆమోదం తెలిపాయి.
 
ఈ–ఆఫీస్‌ ద్వారా ఫైళ్లు చకచకా 
పనితీరు ప్రాతిపదికన 50 ఏళ్లకే ఇంటికి పంపించే ఉద్యోగులకు సంబంధించిన ముసాయిదా జీవోల ఫైలు ఈ–ఆఫీస్‌ ద్వారా చకచకా ముందుకు కదిలింది. ప్రధాన ఫైలు (నెంబర్‌ జీఎడీ–56023/3/2017–ఏఎస్‌– పీయుఐ–జీఎడీ)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 14న ఆమోదం తెలిపారు. అనంతరం 18న ఈ ఫైలు (ముసాయిదా జీవోలు)ను మూడు భాగాలుగా ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన (సర్వీసెస్‌) శాఖల ఆమోదం కోసం పంపించారు. ఆర్థిక శాఖ ఇన్‌చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 20న, సాధారణ పరిపాలన (సర్వీసెస్‌) శాఖ కార్యదర్శి 21న, న్యాయ శాఖ కార్యదర్శి 24న ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వారి అభిప్రాయాలు కూడా జోడించి తుది ఆమోదం కోసం 26న తిరిగి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.  
 
ముసాయిదా సిద్ధమైంది వాస్తవమే : యనమల
‘50 ఏళ్లకే ఇంటికి’ శీర్షికతో ఈనెల 29న ‘సాక్షి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరోక్షంగా అంగీకరించారు. ‘సాక్షి’ కథనంపై శనివారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ముసాయిదా జీవోలే లేవంటూ కొట్టిపా రేసిన ఆయన, ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల్లో ఆగ్రహం వెల్లువెత్తడంతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆదివారం మాట మార్చారు.‘ముసాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక మంత్రిగా నేను సంతకం చేయలేదు. సీఎం సంతకం చేయలేదు. జీవో ఇవ్వాలంటే కేబినెట్‌ అమోదించాలి. జీవో ఇవ్వకుండానే ఇచ్చినట్లు సాక్షి పేర్కొంది. అధికార రహస్యాల చట్టం కింద  సాక్షి పత్రిక, చానల్‌పై చర్యలు తీసుకుంటాం’అని తూర్పుగోదా వరి జిల్లా తునిలో మీడియాతో పేర్కొన్నారు. అయితే జీవోలు జారీ అయినట్లుగానీ, ఆర్థిక మంత్రి యనమల, సీఎం సంతకం చేశారనిగానీ, కేబినెట్‌ ఆమోదించారని గానీ ‘సాక్షి’ ఎక్కడా పేర్కొనలేదు. ముసాయిదా తయారైందని, వీటిని ఆర్థిక, న్యాయ, సాధారణ  పరిపాలన శాఖలు ఆమోదించాయని మాత్రమే ‘సాక్షి’ ప్రచురించింది.
 
మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం: సీఎం
తమది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘50 ఏళ్లకే ఇంటికి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  ఉద్యోగుల వయోపరిమితిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదని స్పష్టం చేశారు.  
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement