అమ్మకానికి కేజీబీవీ పోస్టులు!
అమ్మకానికి కేజీబీవీ పోస్టులు!
Published Fri, Feb 28 2014 3:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం,న్యూస్‌లైన్: జిల్లాలోని కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది పోస్టులు అంగడి సరుకుగా మారాయి. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బంధువు అవుట్ సోర్సింగ్ సంస్థ ముసుగులో అక్రమాలకు తెరతీశారు. పోస్టుకింత చొప్పు న రేటు నిర్ణయించి అభ్యర్థుల నుంచి దండుకుంటున్నారు. ఆయనకు మేలు చేయటం కోసం దరఖాస్తు గడువును పొడిగించిన అధికారులు, తాజా పరిణామంతో తలపట్టుకుంటున్నారు. ఈ దందా తమ మెడకు చుట్టుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ సంగతి..
కేజీబీవీల్లోని బోధనేతర సిబ్బంది పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం రిజిస్టర్డ్ అవుట్ సోర్సింగ్ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఆయా సంస్థలు ఫిబ్రవరి 14లోగా దరఖాస్తు చేయాలని పత్రికా ప్రకటన జారీ చేశారు. 14న మరో ప్రకటన విడుదల చేస్తూ, సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా గడువును 18వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో ఇది ఆశ్చర్యం కలిగించినా వాస్తవమే అయి ఉంటుందని అందరూ భావించారు. నిజానికి జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం గడువు పొడిగించాల్సినంత స్థాయిలో జరగలేదు. అసలు వాస్తవం ఏమిటంటే 14వ తేదీ నాటికి కేంద్రమంత్రి బంధువు సంస్థ దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఆయన ఆర్‌వీఎం అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. మొత్తం 17 సంస్థలు దరఖాస్తులు తీసుకోగా టెండర్లను మాత్రం 8 సంస్థలే దాఖలు చేశాయి. వీటిలో సగం సంస్థలు కేంద్ర మంత్రి అనుయాయులవేనని తెలుస్తోంది. చివరికి ఇన్‌టైం సర్వీసెస్ అనే సంస్థను ఆర్వీఎం అధికారులు ఎంపిక చేశారు.
అధికారుల ఆదేశాలు బేఖాతరు
పోస్టుల భర్తీకి సంబంధించి అధికారుల ఆదేశాలను అవుట్‌సోర్సింగ్ సంస్థ ప్రస్తుతం బేఖాతరు చేస్తోంది. పోస్టుల భర్తీని గోప్యంగా చేపడుతోంది. వాస్తవానికి, కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న నైట్‌వాచ్ ఉమెన్, కుక్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హతలను తెలియజేస్తూ ఈ నెల 28లోగా పత్రికా ప్రకటన జారీ చేయాలని ఆర్‌వీఎం అధికారులు ఆదేశించారు. కానీ దీనిని ఆ సంస్థ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఓ ప్రైవేటు గృహంలో దందా నడుపుతోంది. పోస్టుకింత చొప్పున రేటు నిర్ణయించి సొమ్ము వసూలు చేస్తోంది. దీంతో ఆర్‌వీఎం అధికారులు తల పట్టుకుంటున్నారు. ముందుముందు సంస్థతో ఇంకెన్ని అవస్థలు పడాల్సి వస్తుందోనని బెంబేలెత్తి పోతున్నారు.
అన్నీ పరిశీలించాకే భర్తీ..
ఈ విషయాన్ని రాజీవ్ విద్యామిషన్ పీవో గణపతిరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఫిబ్రవరి 28లోగా పత్రికా ప్రకటన జారీ చేసి పోస్టుల భర్తీ జరపాలని సంస్థను ఆదేశించిన విషయం వాస్తవమేన్నారు. పత్రికా ప్రకటన విడుదల చేశారో లేదో, అది ప్రముఖ పత్రికో కాదో పరిశీలించిన తర్వాతే భర్తీలు జరుపుతామని స్పష్టం చేశారు. కాగా దరఖాస్తు గడువు పెంచడానికి పేర్కొన్న కారణాన్ని ఆయన సమర్థించుకోలేకపోయారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిడైనా ఉందా అని ప్రశ్నించగా సమాధానాన్ని దాటవేశారు. గడువు పొడిగించిన తర్వాతే ఇన్‌టైం సర్వీసెస్ సంస్థ దరఖాస్తు చేసిందని అంగీకరించారు.
Advertisement
Advertisement