KGBV posts
-
AP: విద్యాశాఖ మార్గదర్శకాలు.. ‘కేజీబీవీ’ పోస్టుల భర్తీకి పక్కా రూల్స్
సాక్షి, అమరావతి: కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచింగ్ పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కేజీబీవీల్లో మొత్తం 958 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ కావడం తెలిసిందే. ఈ పోస్టులన్నిటినీ పూర్తిగా మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు. పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. విద్యార్హతలు, అనుభవం, మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లను (పీజీటీ) పార్ట్‌టైమ్ ప్రాతిపదికన, మిగతా టీచర్లను కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. ఏడాది ఒప్పందం.. ఆపై షరతులతో పొడిగింపు కేజీబీవీల్లో బోధనకు ఎంపికైన అభ్యర్థులకు అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేయరు. కౌన్సెలింగ్‌లో వారికి కేటాయించిన కేజీబీవీలో రిపోర్టు చేయాలని మాత్రమే సూచిస్తారు. అక్కడ వారు ఎంవోయూపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నియామక ఒప్పందం 12 నెలలకే పరిమితం. విద్యా సంవత్సరం చివరి రోజుతో అది ముగుస్తుంది. తదుపరి విద్యాసంవత్సరాలకు తిరిగి కొనసాగింపుపై కొత్త ఒప్పందం సంతృప్తికరమైన పనితీరు, ఆంగ్ల మాధ్యమంలో బోధనా సామర్థ్యం తదితరాలపై ఆధారపడి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధనా సామర్థ్యం లేకున్నా, పేలవమైన పనితీరు ఉన్నా, నిధుల దుర్వినియోగం లాంటి ఇతర ఆరోపణలున్నా విద్యాసంవత్సరంలో ఏ సమయంలోనైనా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఒప్పందాన్ని రద్దు చేస్తారు. ఈ పోస్టులలో నియమించే అభ్యర్థులకు భవిష్యత్తులో క్రమబద్ధీకరణ కోరే హక్కు గానీ, దావా వేసే వీలు కానీ ఉండదు. పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా నైట్ డ్యూటీలు నిర్వర్తించేందుకు అంగీకారం తెలపాలి. వీరికి కేంద్ర ప్రభుత్వ కమ్యూనిటీ ఎయిడ్, స్పాన్సర్షిప్ ప్రోగ్రాం (సీఏఎస్‌పీ) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడకుండా వేతనాలను ఖరారు చేస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కాలవ్యవధికి లోబడే ఈ కాంట్రాక్టు, పార్ట్ టైమ్ పోస్టుల కొనసాగింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీ రోజు హాజరుకాకపోయినా, కేటాయించిన కేజీబీవీలో 15 రోజుల లోపు చేరకున్నా నియామకాన్ని రద్దు చేసి తదుపరి మెరిట్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. కౌన్సెలింగ్ అనంతరం 30 రోజులలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై ఎలాంటి నియామకాలు ఉండవు. పోస్టుల వారీగా అభ్యర్థులకు కౌన్సెలింగ్ చేపడతారు. ఈ నియామకాల కోసం జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ లేదా కలెక్టర్ నామినేట్ చేసే అధికారి చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేస్తారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, డీఈవో, ఏపీఎంఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ మెంబర్‌గా ఈ కమిటీ ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఆయా కేటగిరీల వారీగా పోస్టులను కేటాయిస్తారు. అభ్యర్థుల వయసు 2021 జూలై 1వతేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 47 ఏళ్లు కాగా దివ్యాంగులకు 52 ఏళ్లుగా నిర్దేశించారు. ప్రిన్సిపాళ్లు, పీజీటీలకు మెరిట్ మార్కులు ఇలా ♦అకడమిక్ అర్హతలో సాధించిన మార్కులు– 40 మార్కులు. ♦వృత్తిపరమైన అర్హతలో సాధించిన మార్కులు – 40 మార్కులు ♦2 సంవత్సరాల అనుభవం – 10 మార్కులు ♦హయ్యర్ అకడమిక్ అర్హత – 5 మార్కులు ♦హయ్యర్ ప్రొఫెషనల్ అర్హత – 5 మార్కులు ♦ఏదైనా కేజీబీవీలో రెండేళ్లకన్నా తక్కువ కాకుండా పనిచేసిన వారికి, సంతృప్తికరమైన విధి నిర్వహణ, ఆరోపణలు లేనివారికి మెరిట్ జాబితాలో ప్రాధాన్యమిస్తారు. సీఆర్టీలు, పీఈటీలకు మెరిట్ మార్కులు ఇలా ♦అకడమిక్ అర్హతలో సాధించిన మార్కులు – 30 మార్కులు ♦వృత్తిపరమైన అర్హతలో సాధించిన మార్కులు – 30 మార్కులు ♦టెట్‌లో సాధించిన మార్కులు – 20 మార్కులు ♦2 సంవత్సరాల అనుభవం – 10 మార్కులు ♦హయ్యర్ అకడమిక్ అర్హత – 5 మార్కులు ♦హయ్యర్ ప్రొఫెషనల్ అర్హత – 5 మార్కులు ♦ఏదైనా కేజీబీవీలో రెండేళ్లకన్నా తక్కువ కాకుండా పనిచేసిన వారికి, సంతృప్తికరమైన విధి నిర్వహణ, ఆరోపణలు లేనివారికి మెరిట్ జాబితాలో ప్రాధాన్యమిస్తారు. పీజీటీ వొకేషనల్ టీచర్ పోస్టులకు మెరిట్ మార్కులిలా ♦అకడమిక్ అర్హతలో సాధించిన మార్కులు – 60 మార్కులు ♦ 2 సంవత్సరాల అనుభవం – 20 మార్కులు ♦హయ్యర్ అకడమిక్ అర్హత – 20 మార్కులు ♦ఏదైనా కేజీబీవీలో రెండేళ్లకన్నా తక్కువ కాకుండా పనిచేసిన వారికి, సంతృప్తికరమైన విధి నిర్వహణ,ఆరోపణలు లేనివారికి మెరిట్ జాబితాలో ప్రాధాన్యమిస్తారు. -
మహబూబ్‌నగర్‌లో కొలువులకు అభ్యర్థుల కొరత
సాక్షి, మహబూబ్‌నగర్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం దొరకడమే గగనంగా మారిన ప్రస్తుత సమయంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కౌన్సెలింగ్‌కు పిలిస్తే 60శాతం మంది కూడా హాజరుకాలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అభ్యర్థులకు 2018లో టీచింగ్, నాన్‌టీచింగ్ వారికి పరీక్ష నిర్వహించారు. అందులో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులకు అదే సంవత్సరం చాలా మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ విద్యాసంవత్సరంలో కేజీబీవీల్లో ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల సంఖ్య రెట్టింపు చేయడంతో సిబ్బంది నియామకాలు చేపట్టారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన కౌన్సిలింగ్ చాలా తక్కువ మంది అభ్యర్థులు రావడంతో శనివారం మరో సారి కౌన్సిలింగ్ నిర్వహించారు. కానీ అభ్యర్తుల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. కౌన్సెలింగ్‌కు హాజరుకానీ, సమాచారం పొందలేదని అభ్యర్థులు ఉద్యోగానికి మళ్లీ వస్తారా, రారా అనే అంశంపై స్పష్టత లేదు. 216 పోస్టులకు.. 130 మంది హాజరు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కేజీబీవీల్లో ఉన్న 2016 పోస్టుల్లో సీఆరీ్ట, పీజీసీఆర్టీ పోస్టులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేజీబీవీల్లో 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు జోగులాంబ గద్వాల 32, మహబూబ్‌నగర్ 28, నారాయణపేట 43, రంగారెడ్డి 18, వికారాబాద్ 10. వనపర్తి 28 పోస్టులు ఖాళీగా ఉéన్నాయి. వీటికి కేవలం 130 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యా రు. అయితే 2018లో పరీక్ష నిర్వహించిన అనంతరం మెరిట్లో ఉన్నవారికి అప్పుడు ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. తర్వాత వీరిని కూడా మెరిట్ ఆధారంగా తీసుకుంటారని భావించక పోవడంతో చాలా మంది ఇతర ఉద్యోగాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. 2019లో నిర్వహించి టీఆరీ్టలో చాలా మంది అభ్యర్తులకు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరింత మంది అభ్యర్థులకు ఫోన్ నెంబర్లు కలవకపోవడం మరో సమస్యగా మారింది. మిగిలిన పోస్టులకు మరోసారి కౌన్సెలింగ్ ఈ నెల 1న నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 86 పోస్టులు మిగిలి పోయాయి. వీటికి ప్రభుత్వం, కలెక్టర్లతో అనుమతి వచ్చిన వెంటనే మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కూడా కేవలం వారం రోజుల్లోనే జరగనున్నట్లు సమాచారం. మరోసారి కౌన్సెలింగ్ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు వస్తే వారికి మిగిలిన చివరికి మిగిలన చోటే పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులు ఈనెల 4న నియామక ఉత్తర్వులు అందజేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఇక వీటితో పాటు ఏఎన్ఎం, స్పెషల్ ఆఫీసర్ల వంటి 18 పోస్టులు కూడా త్వరలోనే మండల స్థాయి కమిటీల ద్వారా భర్తీ చేయనున్నట్లు సమాచారం. -
పోస్టులు పక్కదారి
జిల్లాలోని కేజీబీవీ కళాశాలల్లో చదువుతున్న బాలికల తరగతులు ముందుకు సాగని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో లెక్చరర్ల నియామకాలు పూర్తయ్యాయి. ఈ జిల్లాలో మాత్రం పూర్తి కాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేజీబీవీ కళాశాల లెక్చరర్ల పోస్టులను రెండు నెలలుగా భర్తీ చేయకపోవడం, ఇంటర్వ్యూలు నిర్వహించి రెండు వారాలు పూర్తి కావస్తున్నా.. నియామకాలు జరగకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన కేజీబీవీ ఔట్ సోర్సింగ్ లెక్చరర్ల నియామకాలను సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు పక్కదోవ పట్టించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రతి బాలిక ఉన్నత చదువును అభ్యసించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఈ ఏడాది కేజీబీవీ కళాశాలలను ప్రారంభించారు. జిల్లాలోని 20 కేజీబీవీ పాఠశాలలను స్థాయి పెంచి 16 జూనియర్ కళాశాలలుగా ప్రారంభించారు. ఆ కళాశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి, అర్హత కలిగిన లెక్చరర్లను నియమించాలని రెండు నెలల క్రితమే రాష్ట్ర సమగ్రశిక్షాఅభియాన్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఇప్పటివరకు నియామకాలు పూర్తి కాలేదు. ముడుపులు ఇవ్వాల్సిందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకమైన పాలన అందించాలని పదేపదే ఆదేశిస్తున్నారు. అయితే సమగ్రశిక్షాఅభియాన్ శాఖలో పనిచేసిన మాజీ పీఓ కేజీబీవీల నియామకాలను పారదర్శకంగా నిర్వహించలేదని ఆరోపణలున్నా యి. లెక్చరర్ల పోస్టింగ్‌ల ఇంటర్వ్యూలు పారదర్శకంగా జరగలేదని దరఖాస్తులు చేసిన అభ్యర్థులు వాపోతున్నారు. ఒక్కో పోస్టుకు రూ.50 వేలు నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేశారని విశ్వసనీయ సమాచారం. గతనెల 15 నుంచి 25వ తేదీ వరకు సమగ్రశిక్షాఅభియాన్ శాఖలో ఇంటర్వ్యూ లు నిర్వహించారు. ఈ పోస్టులకు జిల్లావ్యాప్తంగా 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 1:2 ప్రాతిపదికన 200 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. ఆ ఇంటర్వ్యూలు పూర్తిచేసిన వెంటనే ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే అలా జరగలేదు. ఇంటర్వ్యూలో పాల్గొన్న డీవీఈ ఓ, సబ్జెక్టు నిపుణులతో అభ్యర్థులకు వేసే మార్కులను పెన్సిల్‌తో వేయించుకున్నారు. ఆ తర్వాత ఆ మార్కులను సరిదిద్ది తమకు అనుకూలమైన వారికి మార్కులు వేసుకుని తుది నివేదికలు త యారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు పూర్తి అయిన తర్వాత ముడుపులు ఇచ్చిన వారి పేర్లను నివేదికల్లో మార్పు చేసి కలెక్టర్ ఆమోదం కోసం పెట్టారని ఆ శాఖ సిబ్బంది ద్వారా తెలిసింది. ప్రారంభం కాని తరగతులు జిల్లాలోని 16 కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలల్లో అధ్యాపకులు లేక మూడు నెలలుగా తరగతులు ప్రారంభం కాలేదు. ఉన్నత ఆశయాలతో ఇంటర్మీడియట్లో అడుగుపెట్టిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. రెండునెలలుగా పాఠాలు జరగకపోవడంతో ఆ బాలికల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. మూడునెలలుగా పాఠాలు జరగకపోతే తమ పిల్లల భవిష్యత్ ఏమవుతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు ఉతీర్ణులు కాకపోతే బాధ్యత ఎవరు వహిస్తారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. కేజీబీవీ కళాశాలల్లో 400 మంది బాలికలు ఏం చేయాలో పాలుపోక మిన్నకుంటున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఆ ఇంటర్వ్యూలను మరో శాఖకు అప్పజెప్పి పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
అమ్మకానికి కేజీబీవీ పోస్టులు!
శ్రీకాకుళం,న్యూస్‌లైన్: జిల్లాలోని కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది పోస్టులు అంగడి సరుకుగా మారాయి. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బంధువు అవుట్ సోర్సింగ్ సంస్థ ముసుగులో అక్రమాలకు తెరతీశారు. పోస్టుకింత చొప్పు న రేటు నిర్ణయించి అభ్యర్థుల నుంచి దండుకుంటున్నారు. ఆయనకు మేలు చేయటం కోసం దరఖాస్తు గడువును పొడిగించిన అధికారులు, తాజా పరిణామంతో తలపట్టుకుంటున్నారు. ఈ దందా తమ మెడకు చుట్టుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇదీ సంగతి.. కేజీబీవీల్లోని బోధనేతర సిబ్బంది పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం రిజిస్టర్డ్ అవుట్ సోర్సింగ్ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఆయా సంస్థలు ఫిబ్రవరి 14లోగా దరఖాస్తు చేయాలని పత్రికా ప్రకటన జారీ చేశారు. 14న మరో ప్రకటన విడుదల చేస్తూ, సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా గడువును 18వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో ఇది ఆశ్చర్యం కలిగించినా వాస్తవమే అయి ఉంటుందని అందరూ భావించారు. నిజానికి జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం గడువు పొడిగించాల్సినంత స్థాయిలో జరగలేదు. అసలు వాస్తవం ఏమిటంటే 14వ తేదీ నాటికి కేంద్రమంత్రి బంధువు సంస్థ దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఆయన ఆర్వీఎం అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. మొత్తం 17 సంస్థలు దరఖాస్తులు తీసుకోగా టెండర్లను మాత్రం 8 సంస్థలే దాఖలు చేశాయి. వీటిలో సగం సంస్థలు కేంద్ర మంత్రి అనుయాయులవేనని తెలుస్తోంది. చివరికి ఇన్‌టైం సర్వీసెస్ అనే సంస్థను ఆర్వీఎం అధికారులు ఎంపిక చేశారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు పోస్టుల భర్తీకి సంబంధించి అధికారుల ఆదేశాలను అవుట్సోర్సింగ్ సంస్థ ప్రస్తుతం బేఖాతరు చేస్తోంది. పోస్టుల భర్తీని గోప్యంగా చేపడుతోంది. వాస్తవానికి, కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న నైట్‌వాచ్ ఉమెన్, కుక్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హతలను తెలియజేస్తూ ఈ నెల 28లోగా పత్రికా ప్రకటన జారీ చేయాలని ఆర్వీఎం అధికారులు ఆదేశించారు. కానీ దీనిని ఆ సంస్థ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఓ ప్రైవేటు గృహంలో దందా నడుపుతోంది. పోస్టుకింత చొప్పున రేటు నిర్ణయించి సొమ్ము వసూలు చేస్తోంది. దీంతో ఆర్వీఎం అధికారులు తల పట్టుకుంటున్నారు. ముందుముందు సంస్థతో ఇంకెన్ని అవస్థలు పడాల్సి వస్తుందోనని బెంబేలెత్తి పోతున్నారు. అన్నీ పరిశీలించాకే భర్తీ.. ఈ విషయాన్ని రాజీవ్ విద్యామిషన్ పీవో గణపతిరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఫిబ్రవరి 28లోగా పత్రికా ప్రకటన జారీ చేసి పోస్టుల భర్తీ జరపాలని సంస్థను ఆదేశించిన విషయం వాస్తవమేన్నారు. పత్రికా ప్రకటన విడుదల చేశారో లేదో, అది ప్రముఖ పత్రికో కాదో పరిశీలించిన తర్వాతే భర్తీలు జరుపుతామని స్పష్టం చేశారు. కాగా దరఖాస్తు గడువు పెంచడానికి పేర్కొన్న కారణాన్ని ఆయన సమర్థించుకోలేకపోయారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిడైనా ఉందా అని ప్రశ్నించగా సమాధానాన్ని దాటవేశారు. గడువు పొడిగించిన తర్వాతే ఇన్‌టైం సర్వీసెస్ సంస్థ దరఖాస్తు చేసిందని అంగీకరించారు.