సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నంలో గురువారం జరిగిన సమైక్య సమరభేరి సభ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చింది. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు సభకు తరలివచ్చారు. తూర్పు కృష్ణా సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ అధ్యక్షతన నోబుల్ కాలేజీ మైదానంలో జరిగిన సభలో మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యా సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు ఉద్వేగపూరిత ఉపన్యాసాలతో జనాన్ని ఉత్తేజితుల్ని చేశారు.
రాజీనామా చేయకుంటే చరిత్ర క్షమించదు : చంద్రశేఖర్‌రెడ్డి
సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేలా ఒత్తిడి పెంచాలని ఏపీ ఎన్‌జీవోల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేశామన్నారు. ఇప్పటికైనా వారు ఉద్యమంలోకి రాకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు రాలేరని హెచ్చరించారు. నెలరోజులకు పైగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు జీతాలనే కాదు, జీవితాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. మరో స్వాతంత్య్ర పోరాటంలా సాగుతున్న ఈ ఉద్యమాన్ని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే వరకూ కొనసాగిస్తామని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు.
చరిత్రంటే మనదే.. చరిత్ర సృష్టించిందీ మనమే : చలసాని
హైదరాబాద్ తెలంగాణ వారి సొత్తు అంటూ కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని, హైదరాబాద్ నిర్మాణంలో, అభివృద్ధిలో మన తాతముత్తాల నుంచి ఈ తరం వరకూ రక్తమాంసాలు ధారబోశామని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీమాంధ్రులు చరిత్ర హీనులు, చేతగాని వాళ్లు కాదని, చరిత్రను నిర్మించిన, సృష్టించిన వారని పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన వ్యక్తి శ్రీలంకను పాలించి అక్కడ జెండాను రూపొందిస్తే ఇప్పటికీ ఆ దేశ జెండాగా సింహం చిత్రంతో ఉందని వివరించారు.
రాచరికపు వ్యవస్థలో సైతం సీమాంధ్రులు పాట్నా వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుని సుభిక్షంగా పాలన సాగించిన సంగతిని మరిచారా అంటూ చరిత్రను గుర్తుచేశారు. మద్రాసు సైతం బందరు ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి చరిత్రను చూస్తే తెలుస్తుందని అన్నారు. భారతజాతికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య ఈ గడ్డపై పుట్టినవాడేనని, ప్లేగువ్యాధికి మందు కనుక్కొని ప్రపంచాన్ని కాపాడిన యల్లా ప్రగడ సుబ్బారావు మన వాడేనని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను సీమాంధ్రులు దోచుకోలేదని, మన పూర్వీకుల నుంచి కూడా హైదరాబాద్ అభివృద్ధి పునాదులుగా నిలిచారని చలసాని వివరించారు.
వాస్తవానికి తెలంగాణ వాళ్లు వాడుకునే కరెంటుకు సీమాంధ్రలో వాళ్లు అదనపు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. వాడుకోని కరెంటుకు సీమాంధ్రులు ఏటా రూ.5,200 కోట్లు అదనంగా చెల్లిస్తున్న సంగతి నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా-గోదావరి బేసిన్‌లో లభ్యమవుతున్న గ్యాస్ నిక్షేపాలను తెలంగాణకు తరలిస్తున్న సంగతి నిజంకాదా అని నిలదీశారు. ఇటలీకి చెందిన సోనియా మన దేశానికి వచ్చిన తర్వాత 14ఏళ్లపాటు భారత పౌరసత్వం పొందకుండా ఆ దేశ పౌరసత్వంతోనే కొనసాగారని, అయినా అమెను ఇక్కడి వారు గుండెల్లో పెట్టుకుంటే రాష్ట్ర విభజన చేస్తూ మన గుండెలపై తన్నుతున్నదని చలసాని విమర్శించారు.
తెలంగాణకు అన్యాయం కాదు.. అభివృద్ధి జరిగింది : వెంకటేశ్వరరావు
తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ చెబుతున్న మాటల్లో నిజంలేదని, వాస్తవ లెక్కలు తీస్తే సీమాంధ్రుల త్యాగాలతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ లో సాగు విస్తీర్ణం 9లక్షల ఎకరాల నుంచి 25లక్షలకు పెరిగిందని, పారిశ్రామికంగా గతంలో 130పరిశ్రమలు ఉంటే ఇప్పుడు ఏకంగా 9వేల పరిశ్రమలు పనిచేస్తున్నాయని, 12 విద్యా సంస్థలు ఇప్పుడు 50యూనివర్సిటీలు, 200ఇంజనీరింగ్ కాలేజీలుగా మారాయని, హెల్త్, ఐటీ హబ్‌గా హైదరాబాద్ ఎంతో పురోగతిని సాధించిందని వివరించారు. హైదరాబాద్‌లో తలసరి ఆదాయం రూ.35వేలు ఉంటే కోస్తా ఆంధ్రాలో రూ.25వేలు, రాయలసీమలో రూ.23వేలు ఉందని ఆయన వివరించారు.
వైఎస్ ఉంటే ఇలా జరిగేది కాదు : కుమార్ యాదవ్
హైదరాబాద్ నుంచి వచ్చిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి నాయకుడు కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ లేకపోవడం వల్లే మనకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని అన్నారు. హైదరాబాద్ అందరిది అని, భయపడి పారిపోతే భారత్‌లో బతకలేమని, రాజకీయ కుట్రలను ఎదిరించి బతకాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను ప్రోత్సహిస్తున్న బీజేపీ నాయకులు కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని ప్రకటించారు.
సభలో మాట్లాడిన పలువురు దివంగత వైఎస్‌ను గుర్తు చేసుకున్నారు. వైఎస్ సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారని, ఆయన ఉంటే రాష్ర్ట విభజనను అడ్డుకునేవారని అన్నారు. నెహ్రూ, ఇందిరా, ఎన్టీఆర్ సమైక్యతకే పెద్దపీట వేశారని, సోనియా మాత్రం రాజకీయ లబ్ధి కోసం విభజన చిచ్చు పెట్టరని వక్తలు అన్నారు
సమైక్య సునామీ
Published Fri, Sep 20 2013 12:59 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement