‘సీమ’కు ప్రత్యేక ప్యాకేజీనే మేలు | Seema to benefit special packages | Sakshi
Sakshi News home page

‘సీమ’కు ప్రత్యేక ప్యాకేజీనే మేలు

Published Sat, Aug 15 2015 4:46 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘సీమ’కు ప్రత్యేక ప్యాకేజీనే మేలు - Sakshi

‘సీమ’కు ప్రత్యేక ప్యాకేజీనే మేలు

- ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి
- అభివృద్ధి వికేంద్రీకరించకుంటే మరో విభజన
- ప్రత్యేక హోదాపై అఖిలపక్షాన్ని పిలవాలి
- ‘సాక్షి’తో ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్
కడప సెవెన్‌రోడ్స్ :
‘రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ఉపయోగపడుతుంది.  ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే మరో విభజన అనివార్యమవుతుంది. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర హక్కు.’ అని రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అన్నారు.  శుక్రవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వివరించారు.
 
ప్రశ్న: అభివృద్ధి అంతా కోస్తాకే వెళుతుండడంపై మీ స్పందన?
జవాబు : అభివృద్ధిని వికేంద్రీకరించా లి. కానీ, రాష్ట్రంలో అభివృద్ధి అంతా రాజధానిదే అన్నట్లుగా తయారైంది. విభజన చట్టంలోని కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు. జాతీయ స్థాయి సంస్థలను
 
ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వద్ద నిర్దిష్ట కార్యచరణ కరువైంది. ఇక్కడి ఎర్రచందనం, బెరైటీస్, ఇసుక ద్వారా  వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా ఒక్క కొత్త పథకాన్నీ ప్రకటించకపోవడం దురదృష్టకరం. వికేంద్రీకరణ జరగకపోతే మరో విభజన అనివార్యం.
ప్రశ్న: సీమకు ప్రత్యేక ప్యాకేజీ గురించి ఏమంటారు?
జవాబు : స్పెషల్ ప్యాకేజీ అంటూ కేంద్ర ప్రభుత్వం ముష్టి విదిల్చితే సరిపోదు. రాయలసీమ తక్షణ ఉపశమనం కోసం స్పెషల్ ప్యాకేజీ కింద 50 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి.
ప్రశ్న: సీమ ప్రాజెక్టుల గురించి ఏమంటారు?
జవాబు : గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే సరిపోదు. ‘సీమ’ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలి.  
ప్రశ్న: నికర జలాల మాటేమిటి?
జవాబు: సీమకు 250 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ఇప్పుడు 120 టీఎంసీలు ఉపయోగించుకుంటున్నాం. మిగిలిన నీటిని కేటాయించి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మనది వాటర్ సర్‌ప్లస్ స్టేట్ అని సీఎం చెబుతున్నారు. కృష్ణా, గోదావరి నీటిని ఏ విధంగా పంపిణీ చేసుకోవాలో ఆలోచించాలి. పోలవరం, పట్టిసీమలో సీమ వాటా ఎంతో తేల్చాలి.
ప్రశ్న:ప్రత్యేక హోదా లభిస్తే సీమ అభివృద్ధి అవుతుందా?
జవాబు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే పరిశ్రమలు రాయలసీమలో ఏర్పాటవుతాయని చెప్పలేం. ప్రత్యేక హోదా కంటే రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీనే ఉపయోగం. అయితే, ఇది పోటీకాదు. రెండింటినీ సాధించుకోవాలి.
ప్రశ్న: హోదాపై కేంద్ర, రాష్ట్రాల వైఖరి ఎలా ఉంది?
జవాబు : బీజేపీ, టీడీపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటులో అంగీకరించడం వల్లనే విభజన సాధ్యమైంది. కనుక ప్రత్యేక హోదా మన హక్కు.
ప్రశ్న:హోదా సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది కదా?
జవాబు : ఎందుకు సాధ్యం కాదు? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయంటూ కేంద్రం వంకలు చెప్పడం సరికాదు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు ఇవ్వండి.
ప్రశ్న: ప్రత్యేక హోదా ఇస్తే మిగతావి కేంద్రం ఇవ్వదని సీఎం అంటున్నారు?
జవాబు : మిగతావి సాధించుకోలేమనడం ముఖ్యమంత్రి చేతగాని తనానికి నిదర్శనం. సాధించుకోలేనపుడు ఎన్డీయేలో భాగస్వామిగా ఎందుకున్నారో చెప్పాలి. ప్రత్యేక హోదాపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే బాధ్యత సీఎంపై ఉంది.
ప్రశ్న: మీ భవిష్యత్ కార్యచరణ ఏమిటి?
జవాబు : రాష్ట్ర శాసనమండలిలోని ప్రొగెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలం కలిసి రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదికను ఏర్పాటు చేశాం. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. నన్ను కన్వీనర్‌గా ఉండమన్నారు.  సీమ అభివృద్ధికి సెప్టెంబరులో అన్ని వర్గాలతో కలిసి కర్నూలులో పెద్ద సదస్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement