ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి ముస్తాబవుతున్న కరప గ్రామ సచివాలయం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి జిల్లాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంతో మమకారం. అందులోనూ తూర్పు గోదావరి జిల్లా అంటే మరింత అభిమానం. నాడు ఆయన తండ్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా మన జిల్లాపై ఇదే ఆప్యాయతను చూపించేవారు. నిరుపేదలందరికీ సొంత ఇంటి కలను సాకారం చేస్తానని అప్పట్లో వైఎస్ మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడే ‘ఇందిరమ్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ పథకానికి తొలి అడుగులు మన జిల్లా నుంచే పడ్డాయి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. నాడు వైఎస్ వేసిన అడుగులే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే ప్రతి సేవనూ ప్రజల గుమ్మం ముంగిటకే చేర్చే బృహత్తర కార్యక్రమమే సచివాలయ వ్యవస్థ. పరిపాలనలో వ్యవస్థాపరంగా పేరుకుపోయిన జాప్యాన్ని సమూలంగా పెకలించేసి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ సత్వర సేవలందించాలని సీఎం కన్న కలలను ఈ జిల్లా నుంచే సాకారం చేసే దిశగా ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.
క్షేత్రస్థాయిలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికే ఈ వ్యవస్థ ప్రారంభానికి సీఎం జిల్లాకు రానున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆ జాతిపిత స్వప్నించిన గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా మండల కేంద్రమైన కరపలో సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు కరపలో పైలాన్, సచివాలయం, సభావేదిక కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయాల ఏర్పాటు ఒక ఎత్తయితే వాటి ద్వారా ప్రజలకు సేవలందించేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించడం మరో సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి. గడచిన ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు ఇస్తామని లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి మోసం చేయడంతో నిరుద్యోగులు గత ఎన్నికల్లో టీడీపీకి చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో నిరుద్యోగుల వెతలను నేరుగా చూసిన జగన్.. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి, ఆ మాట ప్రకారం.. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కొలువులు ఇవ్వడం మేధావుల ప్రశంసలను అందుకుంది.
జిల్లాలో ఏ గ్రూపు, పోలీసు, ఇంటర్, టెన్త్.. ఇలా ఏ పరీక్ష చూసుకున్నా 15 వేల నుంచి 50 వేల మంది మాత్రమే హాజరయ్యే వారు. అటువంటిది సచివాలయ పరీక్షకు 2,06,211 మంది హాజరవ్వడం జిల్లా చరిత్రలో ఒక రికార్డుగానే నిలిచిపోయింది. పరీక్ష నిర్వహణ, ఫలితాలు ప్రకటన, ప్రస్తుతం జరుగుతున్న ఎంపికల వరకూ ప్రతి అడుగూ పారదర్శకంగా పడడంపై అన్ని వర్గాల నుంచీ ప్రభుత్వానికి ప్రశంసలు అందుతున్నాయి. ప్రలోభాలకు తావులేని ఎంపికలు జరగబట్టే నిరుపేదలు, రిక్షా కార్మికులు, బుట్టలు అల్లుకునే వారు, రోజువారీ కూలీ చేసుకునే కుటుంబాలు, బీసీ, ఎస్సీ వర్గాల్లోని నిరుపేదల నుంచి పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికవగలిగారు. మొత్తం 13,640 పోస్టులు ఈవిధంగా భర్తీ చేస్తున్నారు.
జిల్లాలో 62 మండలాల పరిధిలో 1072 గ్రామ పంచాయతీలుండగా. 2 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈవిధంగా జిల్లాలో మొత్తం 1,271 గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యాయి. తద్వారా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకొని నూతన శకానికి నాంది పలికారు. ప్రజలు తమ సమస్యలపై జిల్లా అధికారుల చుట్టూ తిరగనవసరం లేకుండా సచివాలయంలోనే అన్ని పనులూ జరిగేలా స్థానిక పాలనను అందుబాటులోకి తెస్తున్నారు. ఆ రూపంలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తున్నారు.
నాడు వైఎస్ అలా..
ప్రతి పేదవాడి సొంతింటి కలనూ సాకారం చేయాలనే తపనతో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూప కల్పన చేశారు. దీనిని 2006 ఏ ప్రిల్ 1న కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రికలో ఆయన ప్రారంభించారు. అప్పటి వరకూ పట్టణ ప్రాంతాల్లో రూ.30 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.22,500గా ఉన్న గృహనిర్మాణ సాయాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచారు. పట్టణ ప్రాంతాల్లో రూ.55 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.45 వేలు, ఎస్సీలకు ఇచ్చే సాయాన్ని పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.65 వేలకు పెంచారు. మూడు విడతల్లో జిల్లాకు 2,14,205 ఇళ్ల మంజూరు కోసం రూ. 743.96 కోట్లు విడుదల చేశారు. వీటిలో సుమారు 1.95 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.
జిల్లాపై తండ్రి నమ్మకం
ప్రతి పేదవాడికీ సొంతింటి కలను సాకారం చేయాలనే తపనతో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2006 ఏప్రిల్ 1న మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రికలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అప్పటివరకూ అర్బన్ ప్రాంతాల్లో రూ.30 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.22,500గా ఉన్న గృహనిర్మాణ సాయాన్ని.. పెరిగిన ధరలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో రూ.55 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.45 వేలు, ఎస్సీలకు ఇచ్చే సాయాన్ని పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.65 వేలకు పెంచారు. ఇక్కడి నుంచే అంతటి బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టడం జిల్లాపై ఆయనకున్న నమ్మకానికి తార్కాణంగా నిలుస్తోంది.
తనయుడి విశ్వాసం
చరిత్రలో మునుపెన్నడూ మరే ఇతర పరీక్షలకూ హాజరు కానంత సంఖ్యలో సచివాలయ పరీక్షలకు జిల్లాలో అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో ఏ గ్రూపు, పోలీసు, ఇంటర్, టెన్త్.. ఇలా ఏ పరీక్ష చూసుకున్నా 15 వేల నుంచి 50 వేల మంది హాజరయ్యే వారు. అటువంటిది సచివాలయ పరీక్షకు 2,06,211 మంది హాజరవ్వడం జిల్లా చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచిపోతుంది. జిల్లాలోని 62 మండలాల పరిధిలో 1,072 గ్రామ పంచాయతీలుండగా. 2 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈ రకంగా జిల్లాలో 1,271 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం ఈ జిల్లాపై సీఎం జగన్‌కు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. ఆయన ఎన్నికల శంఖాన్ని కూడా ఇక్కడి నుంచే పూరించారు.
సచివాలయాలతో గాంధీజీ గ్రామ స్వరాజ్యం
జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా నిజం చేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థకు గాంధీజీ 150వ జయంతి రోజైన అక్టోబరు 2న సీఎం శ్రీకారం చుడుతున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సచివాలయ వ్యవస్థకు నా నియోజకవర్గంలో నాంది పలకడం జీవితంలో మరచిపోలేని రోజుగా మిగిలిపోతుంది. సచివాలయ వ్యవస్థను ఇక్కడి నుంచే ప్రారంభించాలనుకోవడం జిల్లా ప్రజలపై సీఎంకు ఉన్న అభిమానానికి గీటురాయి. దూరాభారంతో ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లనవసరం లేకుండా అన్ని రకాల సేవలనూ ఇంటి ముంగిటకే తీసుకువెళ్లడమంటే సామాన్య విషయం కాదు. ప్రజల ముంగిటకే పాలన అంటూ గత చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్లు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజల సొమ్మును అడ్డంగా దోచేసి ఛీత్కారానికి గురయ్యారు.
– కురసాల కన్నబాబు, వ్యవసాయ, సహకార శాఖల మంత్రి
Comments
Please login to add a commentAdd a comment