సాక్షి, అనంతపురం : జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మూడు రోజులుగా మూసేశారు. ఆ పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాల కారణంగా కార్యాలయాన్ని నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన ఆ పార్టీ సమైక్య ఉద్యమ నేపథ్యంలో దీనస్థితికి చేరింది.
పార్టీ కార్యాలయం మూతపడటంతో కనీసం పరిటాల రవీంద్ర వర్ధంతిని నిర్వహించలేకపోయారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేసే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలోని కదిరి, హిందూపురం, పెనుకొండ, రాప్తాడు, ఉరవకొండ, పుట్టపర్తి అసెంబ్లీ స్థానాలకు, హిందూపురం లోక్‌సభ స్థానానికి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
జిల్లాలో ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. అయినప్పటికీ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. మొన్నటి వరకు స్థానిక రామ్‌నగర్‌లో ఉన్న కార్యాలయాన్ని భవన యజమాని ఖాళీ చేయించాడు. దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించడం కోసం వెంటనే నేలమట్టం చేశారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో మరో భవనాన్ని వెతుక్కునే అవకాశం లేకుండా పోయింది. దీంతో కార్యాలయంలోని ఫర్నీచర్ మొత్తం రోడ్డు మీద వేసుకోవాల్సి వచ్చింది.
ఇది తెలిసి మునిసిపల్ మాజీ చైర్మన్ ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద రెండు చిన్న గదులు ఇవ్వడంతో ఫర్నీచర్‌ను అక్కడకు చేర్చినట్లు తెలిసింది. వివిధ పనుల నిమిత్తం నాయకులను కలిసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం లేని విషయం తెలిసి సిగ్గుపడుతున్నారు. ఈ విషయాన్ని నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీలో ముఖ్యంగా పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, వరదాపురం సూరి తదితరులు ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు. బడుగు, బలహీన వర్గాలను చేరదీసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఒక్కొక్కరు పార్టీకి దూరమవుతున్నారు. పార్టీలో ముఖ్య నాయకుల మధ్య ఆధిపత్య పోరు గురించి మిగిలిన నాయకులెవరూ ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. తమకెందుకులే అన్నభావనతో ఉంటున్నారు. గ్రూపు తగాదాల వల్ల నాయకులు ఇప్పటికే ఎవరినీ పట్టించుకోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యాలయం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేనని కార్యకర్తలు బహిరంగంగానే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయానికి శాశ్వత భవనం కోసం డాక్టర్ కేశన్న స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో 15 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. ఆ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిద్దామని, అందుకు తమవంతు సహకారం ఇస్తామని పల్లె రఘునాథరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు.
అయితే... ధర్మవరం నియోజకవర్గానికి చెందిన ఓ నేత ‘మీ డబ్బులు అవసరం లేదు. మేమే జోలె పట్టుకొని డబ్బు వసూలు చేసి, కార్యాలయాన్ని నిర్మిస్తామ’ంటూ గొడవకు దిగడంతో అప్పట్లో ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఇదే అదునుగా పార్టీకి విరాళంగా ఇచ్చిన స్థలాన్ని డాక్టర్ కేశన్న విక్రయించారు. ఇది అప్పట్లో ఓ దుమారం రేపింది. మొత్తమ్మీద టీడీపీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారు కావడంతో పార్టీ పునాదులు బలహీనపడ్డాయి.
దుకాణం బంద్!
Published Sun, Jan 26 2014 2:36 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement