
షార్ డెరైక్టర్‌గా కున్హికృష్ణన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన డెరైక్టర్‌గా కేరళ రాష్ట్రానికి చెందిన కున్హికృష్ణన్ నియమితులైనట్టుగా బెంగళూరులోని అంతరిక్ష ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటిదాకా షార్ డెరైక్టర్‌గా కొనసాగిన డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పీఎస్‌ఎల్‌వీ వెహికల్ డెరైక్టర్‌గా ఉన్న కున్హికృష్ణన్ షార్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. జూన్ 1న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
51 ఏళ్ల కున్హికృష్ణన్ షార్ డెరైక్టర్ అయిన అతి చిన్న వయస్కుడు. అయితే తెలుగు వారైన ఎంవైఎస్ ప్రసాద్ ఇస్రోకు ఎన్నో సేవలు అందించి ఎంతో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. తాజాగా షార్‌లో మల్టీ అబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ సెంటర్ పనులను కూడా ఆయన ఆధ్వర్యంలోనే పూర్తిచేశారు. ఇంతటి సీనియర్ శాస్త్రవేత్త ఉద్యోగ విరమణ చేస్తున్నా.. ఇస్రోలో ఏదో ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వకుండా పంపేస్తుండటంపై షార్ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి.